అక్షర యోధుడు పాషాకు నివాళి - విరసం ఉమ్మడి వరంగల్ కమిటీ

By Siva KodatiFirst Published Jun 12, 2022, 9:44 PM IST
Highlights

ప్రముఖ పాత్రికేయుడు ఎండీ పాషా మరణం పట్ల విరసం ఉమ్మడి వరంగల్ కమిటీ నివాళులర్పించింది. పాషా మరణం పట్ల విరసం వినమ్రంగా అక్షర నివాళి అర్పిస్తోందని ఒక ప్రకటనలో తెలిపింది.

జనగామ పట్టణంలో ఆంధ్రజ్యోతి  విలేఖరిగా గత ఇరవై ఏళ్లుగా పని చేస్తున్న ఎండి పాషా మరణం జనగామ సమాజానికి తీరని లోటు. విధి నిర్వహణలో నిరంతరం వార్త సేకరణలో సామాజిక ఉద్యమ సంఘాలకు గొప్ప ఊతాన్ని అందించే ఉన్నత వ్యక్తిత్వం గల సేవా తత్పరుడు ఎండి పాషా 1973లో కుందారం గ్రామంలో జన్మించారు. 1997 లో జనగామ తాలూకాలోని లింగాలఘనపురం మండల ప్రజాశక్తి పాత్రికేయుడిగా తన వృత్తి ప్రస్థానాన్ని ప్రారంభించారు. జనగామ ఏబీవీ డిగ్రీ కాలేజీలో 1994లో బీ.ఏ.పూర్తి చేశారు. ఆ రోజుల్లో వామపక్ష విద్యార్ది రాజకీయాలకు ఎండి పాషా సానుభూతి పరుడిగా తన వంతుగా సహకారం అందించేవారు.   

సామాజిక సేవ చేయాలనే తపనలో భాగంగా ఆంధ్రజ్యోతి దినపత్రికలో 2002లో  జనగామ పట్టణ విలేకరిగా కొత్త జీవితాన్ని మొదలు పెట్టారు. వృత్తి జీవితంలో ఎన్నో సంచలన వార్తలకు కేంద్రంగా ప్రజల వైపు నిలబడి వార్తలు అందించారు. జనగామ పట్టణంలో వివిధ అభివృద్ధి పనుల్లో జరుగుతున్న అక్రమాలు, అవినీతి తదితర అంశాలపై వందల వార్తలను సేకరించడానికి నీటి ప్రవాహంలో చేపలా నిత్యం ప్రజల మధ్యే తన పాత్రికేయ జీవన గమనాన్ని కొనసాగించిన నిబద్ధత, నిమగ్నత కలిగిన ఉత్తమ గ్రామీణ విలేఖరి పాషా.  అక్రమార్కుల అవినీతిపై అక్షర సమరం చేసిన పాషా మీద పలుసార్లు భౌతిక దాడులు జరిగినప్పటికీ ఏమాత్రం అధైర్యపడకుండా ముందుకు సాగిన ప్రజా పాత్రికేయుడు. దాడులకు గురైన సందర్భాలలో ఆంధ్రజ్యోతి యాజమాన్యం, జర్నలిస్టు యూనియన్లు కూడా ఆయనకు మద్దతుగా నిలిచి మరింత సమర్థవంతంగా వార్తలు రాయడానికి  ప్రోత్సాహం అందించాయి.  

అదే విధంగా 2006లో నవయువ చైతన్య యూత్ అసోసియేషన్ స్థాపించి జనగామ డివిజన్లో యువతను సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నులను చేశారు. అన్ని మండల కేంద్రాలలో యువతలో నూతన ప్రగతిశీల ఆలోచనలు రగిలించి ఉన్నతాశయాలు గల ఒక తరాన్ని తీర్చిదిద్దడంలో పాషా కృషి నేటి యువతరానికి ఆదర్శం. ఇరవై ఐదేళ్లుగా పాత్రికేయ వృత్తి జీవితంలో మునిగిపోయిన పాషా తను అవివాహితుడిగానే మిగిలి పోయారు. తన పెళ్ళి గురించి ఎవరు ఛలోక్తులు వేసినా తాను కూడ నవ్వుతున్నట్లు కనిపించేవారు.  

కుటుంబంలో తన సోదరీమణుల చదువు, పెళ్లిళ్లు తదితర అంశాలను తన బాధ్యతను ఎంతో క్రమశిక్షణతో నిర్వహించడంలో ఉత్తమ వ్యక్తిత్వ పాత్రను పోషించారు.  ఆంధ్రజ్యోతి జనగామ పట్టణంలో పెద్ద ఎత్తున సర్క్యులేషన్ తో  విస్తరించడంలో పాషా పాత్ర కీలకమైనదని తోటి విలేఖరులు కూడా గుర్తిస్తారు.   వార్తా సేకరణకు వెళ్లి  రోడ్డు ప్రమాదంలో మృత్యు ఒడిలో శాశ్వతంగా నిద్రించిన జర్నలిస్టు ఎండి పాషా కుటుంబాన్ని ఆదుకోవడానికి ఆంధ్రజ్యోతి యాజమాన్యం, తెలంగాణ మీడియా అకాడమీ, జర్నలిస్టులు, ప్రజాసంఘాలు  ముందుకు రావాలని ఉమ్మడి వరంగల్ జిల్లా విప్లవ రచయితల సంఘం కోరుతుంది. పాషా మరణం పట్ల విరసం వినమ్రంగా అక్షర నివాళి అర్పిస్తోంది.

 

- కోడం కుమారస్వామి, కన్వీనర్.
విరసం ఉమ్మడి వరంగల్ జిల్లా

click me!