డా. కొండపల్లి నీహారిణి కవిత : వర్ణాల ఒడిలో…

By Siva Kodati  |  First Published Jun 11, 2022, 9:24 PM IST

గళ వైభవమూ కంటి విన్యాసమూ తప్పిదాల తరగతిని దిద్దే ఒప్పుల కానుకలే అంటూ వాషింగ్టన్ డిసి నుండి డా॥ కొండపల్లి నీహారిణి రాసిన కవిత  "  వర్ణాల ఒడిలో… " ఇక్కడ చదవండి.


ఇటుకల పేర్పులే ఇళ్లైపోవు
నలభై గోడల రూపులే బళ్లైపోవు 

అతుకుల బొంతగాకున్నా 
మనస్సు బ్రతుకు నడకతో పెనవేసుకునే సస్యగామి అయినప్పుడు
కాలం నిత్య వేగి అని తెలిసీ 
ఆమె అక్షర యోధురాలు అవుతుంది
సరిహద్దు రక్షణ ఆయుధమంటి హ్యాండ్ బ్యాగ్ ను తగిలించుకుని ఆటోలో అడుగేసిందంటే 
నేలకు పచ్చని పరిమళాన్ని పంచే నది ఉరికినట్టే

Latest Videos

స్కూల్ స్ట్రెంన్త్ కు అభివర్థిత రూపంగా ఆమె 
కర్ర చేత బట్టని నియంత 
ఎన్ని వాక్యాలు చేర్చిరాయలోగాని
అన్ని విభాగాలలో గురుదక్షిణ కోరని నవ నిర్మాత

పేపర్ మేట్ పేరుతో పెన్ను 
క్లాస్మేట్ పేరుతో విద్యార్థి 
లైఫ్ అచీవ్మెంట్ పేరుతో ఆమె
దశాబ్దాలను ఒడిసిపట్టి 
ధ్రువ తారలుగ పిల్లలు వెలగాలని
దేశదేశాల కీర్తి కాంతుల భాషా చాతుర్యం అంతా బడిలో ధారపోస్తుంది
గళ వైభవమూ కంటి విన్యాసమూ 
తప్పిదాల తరగతిని దిద్దే ఒప్పుల కానుకలే
పుడమి పులకింతలన్నీ ఏదో మౌన ముడి వేసినట్టు
గణాంకాల పిల్లల హృదయాల్లో బెస్ట్ టీచర్ బిరదుగ నిలబడుతుంది 

లెక్కలెరుగనితనమో లెక్కలెక్కువ వచ్చిన ధనమో 
ఎన్ని ప్రశ్నపత్రాల గుణాంకమవుతుందో ఏమి చెప్పగలం
ఆమె సజీవ చాతుర్యం
బాగా చదివే తలల వేదికలపై ప్రతిష్ఠించిన మూల విగ్రహం

గతానుగతం భావ జగత్తుకు ఊపిరులూదే చరిత్ర పాఠాలలో
ప్రతి అక్షరం ఆమె తీర్పు ఇచ్చే సాక్ష్యం
బ్రతుకు పోరాటాల ఫీట్స్ కు తొలి అడుగు అయ్యే పి ఇ టి
అస్త్ర శస్త్రాల వంటి శాస్త్ర విజ్ఞానాల సైన్స్ టీచర్
పేరు ఏదైనా విషయం ఏదైనా ఆమె పాత్రలో లీనమైందంటే అపాత్రదానం చేయాల్సి వచ్చినా
సమత్వ భావాన్నే పంచే అధ్యాపిక

సాయంత్రం అయ్యిందంటే చాలు బడి గేటు దాటి 
బస్సెడు బాధల్ని మరచి పొమ్మని మనసుకు సర్ది చెప్పి 
తన ఇంటి గేటు తీస్తుంది 

అక్కడ మరో సౌందర్య నిర్మాణం కోసం 
ఇల్లాలు అవతారమెత్తినా
మరుసటి రోజు మామూలు బడిపంతులమ్మయ్యి
వర్గాల వడితో ఎగరాల్సిందే
ఆమె వర్ణాల ఒడిలో అడవి వృక్షంలా ఎదగాల్సిందే !!

click me!