డా.టి.రాధాకృష్ణమాచార్యులు కవిత : జీవ గుణం

By Siva Kodati  |  First Published Jun 11, 2022, 9:19 PM IST

సహజత్వంలేని జీవితం ఊపిరిలేని మృత కళేబరం అంటూ డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత  " జీవ గుణం " ఇక్కడ చదవండి : 
 


రక్తం పొదువుకున్నది గుడ్డులో
ఆ గుడ్డు మరో జీవమై పొటమిరించు
 
తన ధ్యాసంతా నా ఊపిరిపైనే
తనే మా అమ్మని నేనింకా చెప్పాలా..

మట్టి పొర దాచుకున్నది బీజాన్ని
ఆ విత్తనమే నవ్వింది 
తడి జల్లులో పచ్చని మొలకగా
కలవరించింది కొమ్మ పాటై కోయిల గొంతులా
పంచింది నీడను గొప్ప స్ఫూర్తితో చెట్టులా

Latest Videos

నేను నడిచిన ప్రవాహంమే ఓ నది
నీటి బిందువుల ధారగా జారింది 
నేలను పెనవేసుకొన్న జీవ గుణమై

జీవ గుణం ఉంటే
బతుకు లక్షణ సారం
విలువల లక్ష్యం దాని గమ్యం

ఉచ్ఛ్వాస నిశ్వాసాల 
 నడకా నడవడే జీవ గుణం 
సహజత్వంలేని జీవితం 
ఊపిరిలేని మృత కళేబరం

జీవ గుణం శూన్యమైన 
అది ఎండిన నది.. 
చెమ్మ లేని చెలిమె

ఒంటరి బతుకు 
తీగలు తెగిన వీణ రాగమే
ఏకాంత జీవనం
ఒక అక్షరమైన ఏక స్కంధం

ఒంటరైన ఏకాంతాలను 
ఏకాంత ఒంటరులను కలిపి
అక్కున చేర్చుకునేది 
సజీవ నదుల సాగే కలాలు రాసిన  'సామాజికాధ్యాయి' ఈ జీవ గుణం

click me!