వేముగంటి మురళీకృష్ణ తెలుగు కవిత: పొద్దుకొప్పులో కల

By telugu team  |  First Published Oct 13, 2020, 12:32 PM IST

వేముగంటి మురళీకృష్ణ తెలుగు సాహిత్యంలో పేరెన్నిక గన్న కవి. మురళీకృష్ణ రాసిన పొద్దుకొప్పులో కల అనే కవితను మీ కోసం అందిస్తున్నాం, చదవండి


1.

ఎడతెగని ఎండధార
ముక్కలవుతూ, అతుక్కుంటు
ఒక్కతీరుగ ఆ చెల్క మీదనే పర్చుకుంటూ

Latest Videos

undefined

మట్టి శకలం నిద్రలో, మెలుకువలో
నీడలా నడిచి, నడిచి
పడావు పడ్డది అక్కడ

చీకటి చిక్కుముళ్లలోంచి జారిన
గింజల కలజల
వెన్నెల పొగల్లో కాటకల్సింది

రెక్కలుకొట్టుకుంటూ ఎగిరే సీతాకోకచిలుకలా
వాలిన ప్రతిచోటా
ఒక వరిమడికి రంగులద్దాలనే ఆరాటం
రైతుది

2.

రైతు చూపుకు 
ఆకాశం ఆత్మ

నల్లమబ్బులు 
దుఃఖాన్ని కలుపుతీసే స్నేహితం

అతని అనుభవం 
పొరొచ్చిన కండ్లలా గుడిసెచూరుకు వేలాడే మసకచూపు అప్పుడప్పుడు

3.

దున్నినంత 
సులభం కాదు,

నడుములు నలిగి నాట్లేసిన ప్రతీసారీ 
ప్రశ్నే మిగలొచ్చు

బాధ ఒరంగట్టుమీద నిలబడి,
పగిడిమీద చేతులుపెట్టుకొని
వెక్కి వెక్కి ఏడ్వవొచ్చు

బాయి తడారిపోయి నాలుకతో
పిడచగట్టుకోవచ్చు

ముసురు తీగల్ని జాగ్రత్తగా
కమ్మకత్తితో తెంపి పొలాన్ని కప్పాలి

కౌగిట్లో కొడుకును దాచుకున్నట్టు
కలచుట్టూ కంచెనల్లుకోవాలి


పొద్దును దాయాలి,
ఎద్దును నిమరాలి,

చెమటబాసిగంతో చేను ముఖాన్ని
సింగరించాలి

4.

అతని కండ్లకు, వడగండ్లు 
బద్ధశత్రువు

వరిగొలుసులు కట్టిన వేళ,
ప్రకృతి విధ్వంస హేళ
కష్టం చేసిన రెక్కలు
మంచు పెళ్ళల్లో కూలబడిన
ఆశ

అప్పుపత్రం 
ఉరితాడుకు చుట్టుకున్న అవమానమే

5.

దాటాల్సినయి దాటి,
దుఃఖాన్ని తూర్పారబట్టినాక

రాశులు పోసినపంట వెదజల్లే
పరిమళం

సంతోషం పావురాలగుంపై
గుడిసెమీద వాలినంత సంబురం

click me!