బిల్ల మహేందర్ తెలుగు కవిత: జోహార్ మనీషా

By telugu team  |  First Published Oct 12, 2020, 3:56 PM IST

బిల్ల మహేందర్ అనే కవి జోహార్ మనీషా అనే కవిత రాశారు. బిల్ల మహేందర్ కవిత్వ రంగంలో ఎన్నదగిన కవి. ఆయన కవితను చదవండి.


అర్ధరాత్రి
ఎక్కడనుంచో కాలుతున్న శవం వాసన..
సన్నని పొగ మెల్లగా ఊపిరితిత్తుల్లోకి చేరి ఉక్కిరిబిక్కిరి చేస్తోంది!

దగ్గరికి వెళ్లి నిలబడ్డాను
నిల్చోబోయింది
విరిచివేయబడ్డ వెన్నముక తనను కుప్పకూల్చింది
ఏదో చెప్పబోయింది
సగం తెగ్గోయబడ్డ నాలిక తన మాటల్ని మింగేసింది

Latest Videos

దుఃఖం దుఃఖం 
దుఃఖం దుఃఖం
దుఃఖిస్తూనే దేహంలోంచి వెన్నెముకను వొలిచి 
నా చేతికి అందించింది

కన్నీళ్లు కన్నీళ్లు 
కన్నీళ్లు కన్నీళ్ళు
కన్నీళ్ళను రాల్చుతూనే చితిమంటల్లో దగ్ధమై
అనంతవాయివును చేరింది

*

ఉదయాన్నే నిద్రలోంచి మేల్కొని,
బాల్కానివైపు నడుస్తూ కిందకు తొంగి చూసినప్పుడు
రోడ్డు మీద వేలాది వెన్నెముకలు ఒక నినాదమవుతూ
దేశాన్ని సరిగ్గా నిలబెట్టేందుకు సాగుతున్నాయి..

click me!