కొన్ని చిక్కటి వాక్యాల్ని మూటగట్టుకుని ఆకుపచ్చని కవితై కొత్తగా మొలకెత్తుతున్న వసంతాలక్ష్మన్ కవిత చదవండి.
ఒక్కోసారి నా
మనసులోని మెత్తదనాన్ని ఎవరో పీల్చేసినట్లనిపిస్తుంది
ఎండిన చెట్టుకింద నిలబడి
రాలుతున్న
చివరి ఆకులను
ఏరుకొని వాటికి
పచ్చదనాన్ని నింపాలనే
వెర్రి ఆలోచనలతో జీవిస్తున్నానా
అనే ప్రశ్న వెంటాడుతున్నప్పుడు
నా లోపలికి తొంగి చూసుకుంటాను
నా హృదయపు తడి
ఇంకిపోయిందా
ఎప్పుడు వసంత గీతమై
పలకరించే నా భావాల
మధురిమ నేడు
శూన్య గీతాన్ని
ఆలపిస్తుందా
పచ్చటి సాహితి వనాల
మధ్య ఇప్పుడిపుడే
నడక నేర్చుకుంటున్న
నా అడుగులను
ఎవరో ఏమారుస్తున్నారనే
ఆలోచనలు నను
నిలువననీయనపుడు
మొదటి పాఠం
నేర్చుకుంటున్న
పిల్లాడిలా తడబడ్తున్న
అక్షరాల్ని సరిదిద్దుకొని
నన్ను నేను కొత్తగా
ఆవిష్కరించుకోవాలనిపిస్తుంది
నేనిన్నాళ్లు
నా మదిలోని
గాయాల్ని
చెదలకొద్ది తోడి
అంతటా శూన్యాన్ని నింపుతున్నానని
ఎవరో
హెచ్చరించినట్లనిపించి
అంతరంగంలో
గూడుకట్టుకున్న ఆత్మన్యూనతను
పక్కన పెట్టి
పాత
అనుభూతులకు
కొత్త స్పర్శలద్దుకొని
నన్ను నేను వెతుక్కోవాలనిపిస్తుంది
ఆ నిమిషాన
నాలోని నైరాశ్యపు
నీడల్ని చెరిపేసి
అరుణారుణ కాంతులతో
నన్ను నేను
దిద్దుకోవాలనుకోలనిపిస్తుంది
అవును
నాలో నిండిన మూస
భావాల్ని బద్దలుకొట్టుకుని
కొన్ని చిక్కటి వాక్యాల్ని
మూటగట్టుకుని
ఆకుపచ్చని కవితనై
కొత్తగా మొలకెత్తాలని
ఉంది....