కవి గోపగాని రవీందర్ కవితా సంపుటి 'దూరమెంతైన'పై లక్షేట్టిపేట నుండి రాజేశ్వరరావు లేదాళ్ళ అందించిన సమీక్ష.
ఊరికో చరిత్ర ఉన్నట్టే మా ఊరికో చరిత్ర ఉందంటూ, సొంత ఊరిని ప్రేమించడమే కాకుండా, ఉన్న ఊరిని మొత్తంగా ఆదివాసీ గ్రామాల అమాయక గిరిజనుల ప్రేమ పరిమళాల్ని ప్రేమించిన కవి గోపగాని రవీందర్. దూరమెంతైనా వచన కవిత్వ పుస్తకంలో ఎంత దూరమైనా తన ఇజాన్ని కోల్పోకుండా, నిజాల్ని నిష్పాక్షికంగా వెల్లడించే ధైర్యమున్న కవి గోపగాని రవీందర్ అని అనవచ్చును.
2015 నుండి 2019 వరకు వివిధ సందర్భాల్లో స్పందించి రాసిన 55 కవితల సంపుటి ఇది. పాలపిట్ట బుక్స్ ద్వారా వెలువడిన ఈ కవితా సంపుటి అందరూ చదవదగ్గ ఒక మంచి కవిత్వం. తెలంగాణ పల్లెల అందాలు, మట్టి వాసనను వెదజల్లుతూ బతుకమ్మకు నీరాజనాలిడే తొలి కవితతో ఆరంభమై యాభై ఐదవ కవిత వరకూ ఆగకుండా చదివిస్తాయి పాఠకున్ని.
undefined
ఇంద్రవెల్లిని దాటుతూ, గిరిజన గ్రామాల గుండా ప్రయాణిస్తూ, ఆదివాసుల బేల ముఖాలపై చెమటని తుడుస్తూ, అద్భుత దృశ్యా వరణాన్ని పరిచయం చేస్తూ, వన జనవాహినుల గుండా సాగుతుంది గోపగాని కవిత్వం. జోడేఘాట్ ఉప్పొంగే గుండెల్ని, నినాదమై ముద్దాడి రేపటి ఊపిరికై దూరం ఎంతైనా విరామమెరుగక సాగే ప్రయాణం గోపగాని కవిత్వం.
"మా వనరులు మాకేనని నినదిస్తూ/దూసుకుపోతున్న తెలంగాణ నాది"అంటాడు "బతికించే తెలంగాణ" కవితలో.
కోట్ల వత్సరాల మనుగడకు సజీవ సాక్ష్యం/ప్రశ్నల ప్రవాహమే/అక్షరాల జవసత్వాలు పటుత్వమై ప్రశ్నల జల్లు లవుతాయి అంటాడు "ప్రశ్నకు మరణం లేదు"అనే తన కవితలో. " లెక్క పెట్టలేదు కానీ ఎన్ని వందల సార్లు తిరిగానో/చూసిన ప్రదేశమే సరికొత్తగా ఆహ్వానిస్తుంది ప్రతిసారీ అంటూ భవనాల్ని, చెరువుల్ని, గ్రామాల్ని, దాటుతూ పరుగులు తీసే బస్సు ప్రయాణం ఆదివాసి పల్లెల ముఖచిత్రాల్ని మనోఫలకంపై లిఖిస్తూ సాగుతుంది "ఇంద్రవెల్లిని దాటుతూ" అనే కవితలో .
మలి వయసులో వృద్ధుల రోజువారి జీవన క్రమాన్ని, గుండెల్లో దాచుకున్న దుఃఖాన్ని, చింతల్ని, అవమానాల్ని, ఆనందాల్ని "గుమ్మం ముందర పండుటాకుల చిరునవ్వులంటూ" కవి గొప్పగా అభివ్యక్తీకరిస్తాడు. మాటల్ని, మాటల్లోని మాధుర్యాన్ని, మాటలు భావాలకు ఆధారాలు అంటూ మాటల పూల సువాసనల్ని చుట్టూర్తా పరిమళింప చేస్తూనే "మాటలతో జాగ్రత్త!" కవితలోమాటల్ని అదుపులో ఉంచుకోమంటారు.
"మహా గుర్తింపుల కాలం" కవితలో శ్రమైక జీవన క్లిష్టత గ్రహించకుండానే/సంక్షేమ పథకాల్ని ఎలా రూపొందిస్తారు? అధికారులు' అని అర్హత లేకున్నా
గుర్తింపు పొందుతున్న మోసగాళ్లను నమ్మొద్దని సామాన్యుడికి జాగ్రత్తలు చెబుతాడు. "నాన్నకు అక్షరాంజలి" లో తన ఎదుగుదలకు మార్గదర్శిగా, స్నేహశీలిగా, వెన్నెముకగా నిలిచిన తీరును వర్ణిస్తూ" ఇకపై మీరు నాకు మరో బిడ్డ..." అంటూ తన కర్తవ్యాన్ని తానే నిర్దేశించుకున్న స్ఫూర్తిదాయకుడు గోపగాని రవీందర్.
"హరితజన జాతర" కవితలో భూమాతకి పచ్చల హారమేసే ఉత్సవంలో" అంటూ పర్యావరణ ప్రేమికులకి వందనాలు తెలియజేస్తాడు. 'ప్రజల గోసకు అక్షర మిచ్చి/ఉద్యమాలకు గొంతు నిచ్చి/చైతన్యానికి ఊపిరినిచ్చిన ప్రజా వాగ్గేయకారుడతడు' అని గూడ అంజన్నకు నివాళి అర్పిస్తడు కవి. విశాలంగా పరుచుకున్న పంటచేల మధ్యన/ఎన్ని మార్లు తిరిగినా/అంతుపట్టని రహస్యమే' నని తన ప్రకృతి ప్రేమికత్వాన్ని చాటుకున్నారు. "సంతలే మా మాల్స్" అంటూ ఏమాత్రం కల్తీలు లేని కల్పవృక్షాల్లాంటి అంగడుల్ని దృశ్యమానం చేస్తాడు కవి. 'వందల ఏళ్ళ నాటి ఈ సంతలు/నిఖార్సైన అనుబంధానికి ఆనవాళ్లు అని హైటెక్కుల జిమ్మిక్కులకు తావులేని నిష్కపటత్వాన్ని మనముందుంచుతాడు కవి. గడిచిన వసంతాల మధురానుభూతుల్ని నెమరువేస్తూ, "ఆత్మీయ స్పర్శ"లో గతకాలపు జ్ఞాపకాల చెలిమెలలో కన్నీటిని తోడుకుంటాడు గోపగాని. జ్వలనమై సాగాల్సిన యువాలోచనలకు/ దిశను చూపే తెరచాప లాంటి కవిత్వ చరణాలతో అడుగులు వేస్తున్నా అంటారు. నిజం కవిత్వపు బావుటా నెత్తిన/ పథికులందరికీ సహస్ర బాహువులతో స్వాగతం అంటారు.
"కిరణాలనెవరు ఆపగలరు/పడిన కెరటాలు తిరిగి లేచి నట్టుగా అరణ్యమంతా కదిలింది/అడవి ఒడిలో పెరిగిన పోరుబిడ్డా/ఆశయం నెరవేర్చు/మరువదు నిన్నీ గడ్డ/అంటాడు తన హృదిలో ఉప్పొంగిన ఆవేశంతో "జోడెఘాట్" కవితలో. తల్లులందరికీ శతకోటి వందనాలంటూ, కొవ్వొత్తిలా కరిగిపోయే అమ్మను మలి వయసులో అక్కున చేర్చుకోమని, నేటి తరానికి సందేశాన్నిస్తాడు. ఊర్లోని పిల్లల ఆకలి కడుపులను, పొద్దున్నే ఆప్యాయంగా డబల్ రొట్టెలతో/ నింపడానికచ్చిన అమ్మలా ఉంది "సంచి"/అంటాడు కవి "సంచి" యొక్క బహుళ ప్రయోజనాల గురించి చెబుతూ.కవిత్వం రాయడం అందరికీ రాదు. అందంగా రాసే వాళ్ళు ఉండొచ్చు, కానీ ఆర్ద్రంగా రాసే వాళ్ళు అరుదు. ఏదైనా గుండెలోతుల్లోంచి ఉద్భవించే ఒక దృక్పథం కనిపిస్తుంది గోపగాని కవితల్లో. ఆయన వ్యక్తిత్వం లాగే కవిత్వమూ గంభీరంగా సాగుతుంది. ధైర్యపు పరిమళాల్ని విరజిమ్ముతుంది. సామాజిక కార్యకర్త మహాశ్వేతాదేవి గురించి రాసినా, సినారే కు కోటి దండాలు సమర్పించినా, తెలంగాణా అమరులకు జేజేలు పలికినా, ఆశయాలకై ప్రతిన బూనినా, సామల సదాశివ గారిని స్మరించినా, చెరువు గురించి రాసినా, కాలుష్యం గురించి కలత చెందినా అది గోపగానికే చెల్లింది. అశ్రు ధారలతో ఇంద్రవెల్లి అమరుల రక్తం నుండి ఉబికిన ఉత్తేజాన్ని నింపుకొని, కేస్లాపూర్ నాగోబా జాతర పరవశాన్ని పులుముకొని, గోండు రాజ్యపు జోడేఘాట్ కొమరం భీమ్ పోరాటాన్ని తలచుకొని, గమనంతో గమ్యాన్ని ముద్దాడే హృదయమున్న కవి గోపగాని రవీందర్.
'మా దారుల నిండా ఎరుపు చారల గుత్తులు/మోదుగులు రాల్చిన పువ్వులు' అని కెరిమెరి ప్రకృతి సౌందర్యం చూసి మైమరచి, హైమన్డార్ఫ్ స్మృతి చిహ్నాలను దాటి తరలుతూ, గోండుల సంస్కృతిని చదువుకుంటూ, ఆదివాసీలని పలకరిస్తూ, వారి బ్రతుకుల్ని చూసి పలవరిస్తూ, అక్షరాల్ని కొన్నింటిని తాను తిరుగుతున్న ప్రాంతాల్లో చల్లుతానంటాడు. ఏజెన్సీ ప్రాంత ఆదివాసి బ్రతుకు
"నిత్య జీవన్మరణ పోరాటం" అంటాడు కవి. అక్షర పరిమళాలకై వెదుక్కుంటూ, విశాల సాహితీ దారుల్లో దూరం ఎంతైనా సరే! పయనిస్తూనే ఉంటాను.
ఆగదు నా గమనం అంటూనే అవిశ్రాంత సాహితీ సేద్యం చేస్తూన్న కవి గోపగాని రవీందర్.