హృదయపు లోతుల్నుండి ప్రవహించిన IN OTHER WORDS

By Pratap Reddy Kasula  |  First Published May 16, 2022, 12:34 PM IST

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం జావేద్ అఖ్తర్ రాసిన కవితల సంపుటి IN OTHER WORDS ను అందిస్తున్నారు వారాల ఆనంద్.


ఇవ్వాళ మన దేశంలో అత్యంత ప్రభావవంతమయిన స్వతంత్ర లౌకిక స్వరం జావేద్ అఖ్తర్.  ఆయన రాసిన కవితల సంపుటి IN OTHER WORDS ని అందుకున్నాను. భావుకుడూ, ప్రగతిశీల వాది అయిన జావేద్ అఖ్తర్ ప్రధాన స్రవంతి హిందీ సినిమాలకు ఒక సరికొత్త దారి చూపిన వాడు. మిత్రుడు సలీం ఖాన్ తో కలిసి ఆయన రాసిన స్క్రీన్ ప్లే లు 70వ దశకం మధ్య నుండి ఒక కొత్త ఒరవడిని సృష్టించాయి. ఆ జంట రాసిన మొదటి సినిమా ‘హాతీ మేరె సాథీ’.  ఒక రోజు రాజేష్ ఖన్నా వారి దగ్గరికి వెళ్లి దక్షిణాది సినీ నిర్మాత అయిన దేవన్ ఒక స్క్రిప్ట్ ఇచ్చాడు..మంచి అడ్వాన్స్ కూడా ఇచ్చాడు..దాంతో పెద్ద ఇంటికి అడ్వాన్స్ ఇచ్చాను.. కానీ స్క్రిప్ట్ ఘోరంగా వుంది.. అది చేస్తే ఇక దాంతో నా ఫిలిం కెరీర్ అంతే  సంగతులు..అందుకే దాన్ని సరిచేయండి.. అని కోరాడు. ఆ సినిమా సూపర్ హిట్.  దాంతో సలీం జావేద్ ల జంట హిందీ సినీ రంగంలో హాట్ కేక్ గా మారింది.  ఫలితంగా అందాజ్, సీతా అవుర్ గీతా, యాదోన్కీ బారాత్, జంజీర్, దీవార్, షోలే..డాన్ క్రాంతీ, మిస్టర్ ఇండియా.. ఇట్లా విజయాల పరంపర దిగ్విజయంగా సాగింది.  వాళ్ళు రాసిన 24 సోనోమా స్క్రిప్తుల్లో 20 హిట్లు. ఆ తర్వాత ఆజంట విడిపోయింది.

తర్వాత జావేద్ అఖ్తర్ ఫిలిం లిరిక్స్ వైపు కదిలాడు. ఆయన రాసిన సినీ గీతాలు అత్యంత ప్రాచుర్యం పొందాయి.  అయితే కైఫీ ఆజ్మీ ఒక చోట ఇట్లా అంటాడు..’మొదట సమాధి తవ్వి తర్వాత దానికి సరిపడే శరీరాన్ని వెతకడం సినీ గేయ రచయితల పని’ అయితే జావేద్ అఖ్తర్ తన సినీ గీతాలతో అద్భుతమయిన రూపాల్ని చిత్రించాడు. సినీ గీత రచయితగానే కాకుండా జావేద్ అఖ్తర్ గొప్ప కవి. ఆయన రాసిన కవితలు, గజల్స్ సూటిగా స్పష్టంగా మనసుకు హత్తుకుంటాయి. ఆయన కవితా సంకలనాలు ‘టర్కష్’ 1995 లో వచ్చింది, తర్వాత ‘లావా’ 2012 లో వెలువడింది.  లావాకు ఆయనకు కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డు వచ్చింది. ఈ రెండు సంకలనాల్లోంచి ఎంపిక చేసిన కవితల సమాహారమే ఇన్ ఆదర్ వర్డ్స్. అందులో ఆయన కాలాన్ని గురించి..

Latest Videos

కాలమంటే ఏమిటి,
అలుపూ విరామమూ లేకుండా
సాగిపోతున్నది
అదట్లా ప్రయాణించకుండా వుండి వుంటే
అదేక్కడుండేది
ఎక్కడో ఒక చోట వుండేది కదా...
అంటూ గొప్ప తాత్వికత తో రాస్తాడు.

జావేద్ అఖ్తర్ కేవలం తన దుఃఖం గురించే కాదు, అందరి దుఃఖాల గురించీ స్పందిస్తాడు.

అమ్మకానికి దుఖాలు

అంగట్లో దుఃఖాలు అమ్ముతారు
వ్యాపారం హాయిగా సాగితే
దుఃఖాలు మంచి ధరకే అమ్ముడవుతాయి
వినియోగదార్లు ఉద్వేగంలో
చిన్నవో పెద్దవో దుఃఖ బొమ్మల్ని
ఏ ధరకయినా కొంటారు
నేనెప్పుడూ నా దుఃఖాల్ని
మంచి ధరకే అమ్మాను
కానీ ఇవ్వాళ
నాకు కలిగిన దుఃఖాన్ని
ఏ దుఖానపు షో కేసులో వుంచలేను
నా దుఃఖాల్ని అమ్మలేక పోతున్నందుకు
మొట్టమొదటి సారిగా
సిగ్గుపడుతున్నాను.. అంటాడు

ఇట్లా ఆయన కవిత్వమంతా ఆయన ఆత్మనుండి ఒక ప్రవాహంలా సాగుతుంది. హృదయపు లోతుల్నుండి పెల్లుబుకుతుంది.
ఈ సంకలనం నిండా వర్తమాన అవ్యవస్థ గురింఛి తన కోపమూ, తన తాత్వికత, వేదన దుఃఖం, ప్రశ్న జవాబు ఇట్లా అనేకానేక స్థితులు ఆవిష్కరించాడు జావేద్ అఖ్తర్. తన కవిత్వం నిండా వర్తమాన మత చాందస వాదం గురించీ ఖండిస్తూ రాసాడు.  మాట్లాడాడు.  ప్రశించడమే తన తత్వమని అనేక సందర్భాల్లో నిరూపించాడు జావేద్.

ఇక పార్లమెంట్ సభ్యుడిగా ముందుండి మేధో హక్కుల గురించి, కాపీ రైట్ చట్టం గురించీ పోరాడి సాధించాడు.
ఆయన ‘ఇన్ ఆదర్ వర్డ్స్’ లోంచి కొన్ని కవితలకు నేను చేసిన స్వేచ్చానువాదాలు కొన్ని....

నా ప్రాంగణం - నా చెట్టు

మా ప్రాంగణం
ఎంతో పెద్దగా మరెంతో విశాలంగా వుండేది  
అప్పుడు నేను నా ఆటలన్నీ అందులోనే  ఆడేవాణ్ణి
ఆ ప్రాంగణానికి ఎదురుగా
నా కంటే ఎంతో ఎత్తుగా
ఓ చేట్టుండేది
నేను పెద్దవాడినయ్యాక
ఎప్పటికయినా
ఆ చెట్టు చివరి అంచును తాకుతానని
నాకెంతో నమ్మకం వుండేది
ఏళ్ళు గడిచాక
ఇంటికి తిరిగొచ్చి చూస్తే
మా ప్రాంగణం ఎంతో చిన్నగా అనిపించింది
కాని
ప్రాంగణం ఎదురుగా వున్న చెట్టు మాత్రం
అప్పటికంటే మరెంతో పెరిగి పెద్దదయింది

*****
పజిల్

ఒకప్పుడు
మనిద్దరం కేవలం రెండక్షరాలం
ఒకరోజు ఇద్దరం కలిసాక
పదంగా రూపొందాం
దానికి మనమో అర్థాన్ని కనుగొన్నాం
అప్పుడు ఎదో జరిగింది
ఇప్పుడు
ఓ చతురస్రంలో
నువ్వో అక్షరానివి
మరో చతురస్రంలో
నేను ఇంకో అక్షరాన్ని
ఇద్దరి నడుమ  
ఎన్ని చతురస్రాల క్షణాలు
ఖాళీగా వున్నాయో
మళ్ళీ ఓ పదం రూపొందవచ్చు
దానికి మనం ఓ అర్థాన్నీ కనుగొనవచ్చు
కానీ
ఈ ఖాళీ చాతురస్రాల్ని ఎట్లా పూరించాలో
ఆలోచించాలి

******

ప్రకీర్ణకం (మొంతేజ్)

నిద్ర మబ్బుల వెనకాల
ఓ నవ్వుతున్న ముఖం
ఆ ముఖం మీద జాలువారిన
పట్టు దారాల్లాంటి ముంగురులు
మంద్రంగా శబ్దించే వస్త్రాలు
కలవరపడుతున్న రెండు కళ్ళు
ఓ సమావేశం
ఓ ఆహ్లాద క్షణం
నిలకడగా సరస్సులో నీరు
చెట్టుపై కిచ కిచలాడుతున్న పక్షి
గడ్డిపై విచ్చుకుంటున్న చిన్న మొగ్గ
అందమయిన పెదాల పై సున్నితమయిన మాటలు
పసుపువర్ణపు పగలు
మంచు లాంటి చల్లని స్వరం
పగిలిన అద్దం
గాలిలో తేలుతున్న కాగితం ముక్కలు
కూలిన వంతెన
పూర్తికాని రహదారి
విచ్ఛిన్నమయి చీలిపోతున్న దృశ్యం
కనురెప్పలపై మెరుస్తున్న కన్నీళ్లు
నిద్ర మబ్బుల వెనకాల
లోతయిన నిశ్శబ్దం ధ్వనిస్తున్నది

మూలం: జావేద్ అఖ్తర్
అనువాదం: వారాల ఆనంద్

click me!