కెఎస్ అనంతాచార్య కవిత : ఆయన కోసం !!

By Arun Kumar PFirst Published May 14, 2022, 4:09 PM IST
Highlights

రైతే లేకుంటే జీవజాలపు భాషలో కొత్త కావ్యం పుట్టదంటూ కరీంనగర్ నుండి కె ఎస్ అనంతాచార్య రాసిన కవిత  " ఆయన కోసం !! " ఇక్కడ చదవండి :

ఆయన కోసం !!

ఎన్నో జీవన రైళ్లకు పచ్చజండా ఊపే మాస్టరయినా 
రిజర్వేషన్ దొరకని ప్రయాణికుడతడు!   
మంచే మీదనే కరిగిపోయే యవ్వనం
పొలంగట్టు మీద అరిగే  పాదాలు
ఋతు రేఖల మీద  వాన చుక్కకై ఎదురుచూసే దిగులు కళ్ళు 
ఒంటి నిండా మక్క కర్రల గరుకు ఆనవాళ్లే 
తలపై వేప పూల వ్యర్థ పూజ! 
 
ఎరువుల బరిలో నిలబడి 
డిపోజిట్ కోల్పోయిన నాయకుడు  
అహరహం  పొలం మీదే బెంగపడే పక్షి 
వాగ్దానాల మిడతల దండు దాడిలో
ఒరిగి పోయే విగతజీవి! 

కవి కలాన్ని కదిపే  అరుణ పుష్పం   
భావాల కొమ్మల మీద కోయిల స్వరం! 
తరతరాల తాతల బడిలో నారు,నీరు,
మందుల  మర్మాన్ని నేర్చిన సృజన కారుడు
గుండె కోతను పట్టించుకోక పంటను కోతలతో 
గిడ్డంగులు నింపి  అన్నం పెట్టే  ఆకుపచ్చని జీవదాత ! 
 
ఎప్పటికీ  ఆయన 
రైతుకులపతే
లోకం ఆకలి తీర్చు జగత్పతి
పచ్చగడ్డి కోటును వేసుకొని పంట కాలువ పక్కన నడిచొచ్చే  రవి బింబం

మెతుకు మన 
బతుకు పుస్తకానికి 
ముఖ చిత్రం 
పంటల భారతానికి హరిత వ్యాసుడు

రైతే లేకుంటే అడవి దుక్కి మీద ఆకుపచ్చని రాత ఉండదు!  
జీవజాలపు భాషలో 
కొత్త కావ్యం పుట్టదు.


 

click me!