పాలమూరు సాహితీ అవార్డులకు వచన కవితా సంపుటాలను, రాయలసీమ మహాకవిసమ్మేళనం కోసం కవితలను ఆహ్వానిస్తున్నారు.
తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో "బహుళ" అంతర్జాల మహిళా పత్రిక నిర్వహణలో జ్వలిత సంపాదకీయం వహించిన రెండు సంకలనాల ఆవిష్కరణ రేపు (15 మే) ఉదయం 9.30 గంటలకు రవీంద్ర భారతి కాన్ఫరెన్స్ హాల్, హైదరాబాద్ లో జరుగుతుంది.డా. ఎస్. రఘు సభాధ్యక్షత వహించే ఈ సభకు ముఖ్య అతిథి అల్లం నారాయణ, ఆత్మీయ అతిథులు గోగు శ్యామల, ఏనుగు నరసింహారెడ్డి. గౌరవం అతిథులు బి.ఎస్. రాములు, డా. తిరునగరి దేవకీదేవి, సంగిశెట్టి శ్రీనివాస్. నస్రీన్ ఖాన్ సమన్వయంతో కొనసాగే ఈ సభలో శతాధిక చేతివృత్తుల కథా సంకలనం " మల్లెసాల " ను జూలూరి గౌరీశంకర్ ఆవిష్కరిస్తారు. నాళేశ్వరం శంకరం గ్రంథ సమీక్ష చేస్తారు. స్త్రీ వాద కవిత్వ సంకలనం " సంఘటిత " ను ఆకుల లలిత ఆవిష్కరిస్తారు. డా. వంగరి త్రివేణి పుస్తక సమీక్ష చేస్తారు.
పాలమూరు సాహితీ అవార్డు
తెలుగు సాహిత్యంలో ఉత్తమ వచన కవిత్వాన్ని ఆవిష్కరిస్తున్న కవులకు ప్రతి సంవత్సరం పాలమూరు సాహితీ అవార్డులను ప్రదానం చేస్తున్నారు. గతంలో ఈ అవార్డులను ప్రముఖ కవులు డా. రాధేయ, డా. కాసుల లింగారెడ్డి, డా. పెన్నా శివరామకృష్ణ, కందుకూరి శ్రీరాములు, అంబటి నారాయణ, ఎస్.హరగోపాల్, కోట్ల వెంకటేశ్వర రెడ్డి, డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి, చిత్తలూరి సత్యనారాయణ, తగుళ్ళ గోపాల్ లు పురస్కారాలు అందుకున్నారు. ఈ పురస్కారం కోసం 2021 సంవత్సరంలో ముద్రితమైన వచన కవితా సంపుటాలను మాత్రమే మూడేసి ప్రతులను పంపించాల్సిందిగా పాలమూరు సాహితి అవార్డ్ నిర్వాహకులు కోరుతున్నారు.
కావున కవులు తమ ప్రతులను డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్, ఇ.నం. 8-5-38, టీచర్స్ కాలని, మహబూబ్ నగర్ - 509001, తెలంగాణ రాష్ట్రం అనే చిరునామాకు మే 31 లోపున పంపాలని పాలమూరు సాహితి అవార్డ్ వ్యవస్థాపకులు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ కోరారు. బహుమతి పొందిన ఉత్తమ వచన కవితా సంపుటికి రూ.5,116/- నగదు బహుమతితో పాటు జ్ఞాపికను అందజేస్తారు.
ఆరవ రాయలసీమ మహాకవిసమ్మేళనం
రాయలసీమ సాంస్కృతికోద్యమంలో భాగంగా 'రాయలసీమ సాంస్కృతిక వేదిక' మరియు 'వేమన అధ్యయన & అభివృద్ధి కేంద్రం'ల ఆధ్వర్యంలో 'ఆరవ రాయలసీమ మహా కవిసమ్మేళనం నిర్వహిస్తున్నారు. రాయలసీమలోని దళిత, బహుజన, గిరిజన, మైనారిటీ, మహిళలు తదితర విభిన్న వర్గాల అస్తిత్వం నేపథ్యంగా మే 29 ఆదివారం నాడు అంతర్జాల వేదికన కవిసమ్మేళనం కొనసాగుతుంది. కవితలను మే 25 లోపు 99625 44299 వాట్సప్ నెంబర్ కు పంపాలి.
సూచించిన అంశాల పరిధిలో సంక్షిప్తంగా, కవితా లక్షణాలతో, కొత్తగా రాసిన కవితలను మాత్రమే స్వీకరిస్తారని రాయలసీమ మహాకవి సమ్మేళనం సమన్వయకర్త డా.అప్పిరెడ్డి హరినాథరెడ్డి అనంతపురము నుండి ఒక ప్రకటనలో తెలియజేశారు.
మరిన్ని వివరాలకు...99639 17187.