మనలోని జ్ఞానాన్ని అజ్ఞానాన్ని తెరిచి చూసుకుంటే సంధ్య వేళలు ఎప్పటికీ ముగింపు కావనే వాస్తవాన్ని వారాల ఆనంద్ రాసిన 'సంధ్యాకాలం' కవిత తెలియజేస్తుంది.
సాయంకాలమయింది
అవును
వెలుగునీ వయసునీ
ఎవరుమాత్రం పిడికిట్లో
బంధించి ఉంచగలరు
undefined
కిరణాలు వాలిపోతాయి
మసక మసకగా
చీకటి కమ్ముకొస్తుంది
వయసు వెనక్కి నడుస్తుంది
కళ్ళ కింద నలుపు చారలు మెరుస్తాయి
ముఖం మీది ముడుతలు ముచ్చటేస్తాయి
సహచరులు కొందరు
తొందరపడి సెలవు తీసుకుంటారు
చీకటి వెలుగుల సంధి కాలమిది
అనుభవాల తోరణం ధరించిన
అందమయిన వయసిది
పగలు ముగిసి రాత్రి
ఆవహిస్తున్నట్టనిపిస్తుంది
కానీ
ఒక్కసారి బయట కెళ్ళి
ఆకాశంకేసి చూడు
చీకటి వేళ విచ్చుకుంటున్న
తొలి నక్షత్రం సౌందర్యాన్ని చూడు
ఒక్కసారి నీ లోకి చూడు
జ్ఞానమూ అజ్ఞానమూ
దుఖమూ సంతోషమూ
పెనవేసుకున్న పరిమళాన్ని చూడు
సాయంకాలమయితే ఏమిటి
నక్షత్రాల వెలుగునీ నా అనుభవాన్నీ
స్వీకరించి ఆనందించే
కోట్లాది కళ్ళున్నాయి
వాటిలో వెలుగులు నిండుతాయి
కలలు విచ్చుకుంటాయి
సంధ్య ఎప్పటికీ ముగింపు కాదు.