నిజమైన మనుషులు నిజంగానే మాయమవుతున్న వేళ వర్ధమాన కవి పెనుగొండ బసవేశ్వర్ ఆవేదన ఈ కవితలో చదవండి.
బతికున్నామన్న పేరేగాని జీవం వాసనలేని జిందగీ మనది
జరుగుతున్న తతంగమంతా జగద్విదితమే అయినా
జాగృతం అవ్వాల్సిన చైతన్యానికి లోలోపలే చితి పేర్చి
జారేసిన జబ్బలను చరుచుకుంటూ కాలాన్ని జరిపేద్దాం
ఊచల వెనుక జరగబోయే తంతు ఊహించిందే అయినా మబ్బుల చాటున నక్కి రాడార్ ను తప్పించుకున్నట్లు నటించడంలో జీవిస్తున్న మన నిర్లజ్జ అమాయకత్వానికి ప్రభువుల నుండి తేరగా అవార్డులు అందుకుందాం
అడవిలో మసలే ఆదివాసీల హక్కుల కోసం
ఆజన్మాంతం ఆరాటపడిన ఒక్క బక్క ప్రాణాన్ని
ఆటవిక న్యాయం గద్దలా తన్నుకు పోతే
రాజ్యానికి హక్కులన్నీ కట్టగట్టి కట్టపెడదాం
వణుకుతున్న ఎనిమిది పదుల ఎముకల గూడుకి
నీళ్లు తాగే సాధనాన్ని కూడా నిస్సిగ్గుగా నిరాకరించి
ఆయుధ సంస్కృతిని అరికట్టామని గొప్పలు పోయిన
ఏలినవారి రక్షణ సన్నద్ధతకు చప్పట్లు కొడదాం
పీడితుల పక్షాన నిలబడిన ఎలాంటి ప్రశ్ననయినా
పీడించి పీడించి పీక పిసకడమే ఎజెండా అయిన వేళ
కళ్ళు చెవులు మనసునూ ఇనుప వస్త్రంలో మూటగట్టి పాతాళంలోకి విసిరేసిన పాపాన్ని మూటగట్టుకుందాం
తప్పుని తప్పు అని చెప్పలేని తండ్లాట
పోనీ ఓర్చుకుని ఒప్పు అని ఒప్పుకోలేని యాతన
గొంతుకి మనసుకి మధ్య పూడ్చలేని గొయ్యి
అప్రకటిత ఎమర్జెన్సీలో ఆత్మరక్షణా ఘర్షణ
నిజమైన మనుషులు నిజంగానే మాయమవుతున్న వేళ
మూతికి బిగించిన మాస్క్ చూపి మౌనం పాటిద్దాం
'ప్రాణ్ జాయే పర్ వచన్..' సూత్రానికి అర్థాన్ని
ఇతరుల ప్రాణంపోయినా మాట్లాడేది లేదని మార్చేద్దాం!