మొగ్గల కవితాప్రక్రియలో పివికి అక్షరనివాళి

By telugu team  |  First Published Jul 29, 2021, 2:03 PM IST

డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ రాసిన  మొగ్గలు  "అసాధ్యుడు" పైన  వేదార్థం మధుసూదనశర్మ చేసిన ‌సమీక్ష ఇక్కడ చదవండి


కొందరు వ్యక్తులు తమ ప్రతిభావ్యుత్పత్తులతో గొప్ప గొప్ప కార్యాలు చేస్తూ, దేశాభివృద్ధికి తోడుపడుతూ, పలువురికి మార్గదర్శకంగా నిలుస్తూ, చరిత్ర పుటల్లో చిరస్థాయిగా నిలుస్తారు.  అలాంటి వారిలో బహుభాషావేత్త, బహుగ్రంథ కర్త, ఆర్థిక సంస్కరణల రూపశిల్పి, రాజనీతిజ్ఞుడు, పరిపాలనాదక్షుడు, మేధావి, మాజీ ప్రధాని స్వర్గీయ పాములపర్తి వెంకటనరసింహారావు ఒకరు.

దక్షిణాది నుండి ముఖ్యంగా తెలంగాణ ప్రాంతం నుండి స్వయంకృషితో, తన ప్రతిభాపాటవాలతో అంచెలంచెలుగా ఎదిగి, భారత ప్రధాని పీఠాన్ని అధిష్టించిన మేధావి పి.వి.  అలాంటి పి.వి జాతికి చేసిన సేవలను స్మరించుకుంటూ ఏడాది కాలంపాటు వారి శతజయంతి ఉత్సవాలను రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ఘనంగా నిర్వహించడం జరిగింది.  ఈ సందర్భంగా పాలమూరు సాహితీ అధ్యక్షులు, సాహితీ చైతన్యశీలి, సాహితీ జిజ్ఞాసువులకు కామధేనువు, పరిశోధకులకు కల్పతరువైన డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ తాను సృజించిన "మొగ్గలు" కవితాప్రక్రియలో పి.వి బహుముఖీన మూర్తిమత్వాన్ని, దేశాభివృద్ధికి, సాహిత్యవికాసానికి వారు చేసిన కృషిని వందమొగ్గలలో ఆవిష్కరిస్తూ "అసాధ్యుడు" పేరుతో ఒక పుస్తకాన్ని వెలువరించడం చాలా గొప్ప విషయం.  అందుకు భీంపల్లి అభినందనీయులు. 

Latest Videos

తెలుగు సాహిత్యంలో "మొగ్గలు" కవితాప్రక్రియ అనతికాలంలోనే అరుదైన గుర్తింపును పొందిన విషయం కవిలోకానికంత తెలుసు.  ఎందరో కవులు ఈ "మొగ్గలు" కవితాప్రక్రియలో ఎన్నో రచనలు చేస్తూ పుస్తకాలు వెలువరించడానికి మార్గదర్శకులు అవుతున్నారు భీంపల్లి.   వచనకవిత్వంలో నేడు వస్తున్న అనేక నూతన ప్రక్రియలలో విశేషంగా ఆదరణ పొందుతున్న ప్రక్రియ ఇదే అంటే అతిశయోక్తి ఎంతమాత్రం కాదు.  ప్రేమ మొగ్గలు, బాలల మొగ్గలు, బతుకమ్మ మొగ్గలు మొదలైన కవితాసంకలనాలతో పాటు భారత జాతిపిత మహాత్మాగాంధీ, తెలంగాణ వైతాళికుడు సురవరం మొదలైనవారిని స్మరించుకుంటూ మొగ్గల ప్రక్రియలో కవితాసంపుటాలను వెలువరించిన దిట్ట భీంపల్లి శ్రీకాంత్.  పి.వి శతజయంతిని పురస్కరించుకుని "అసాధ్యుడు" అనే పుస్తకాన్ని వెలువరిస్తూ మొగ్గల రూపంలో వారికి అక్షరనివాళిని అర్పించారు డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్. 

పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అనే నానుడిని డాక్టర్ భీంపల్లి తన పాండిత్యంతో ఇలా మార్పుచేసి "పూవు పుట్టగానే సహస్ర దళాలతో పరిమళించినట్లుగా బాల్యంలోనే అసమాన పాండిత్యాన్ని ప్రదర్శించిన దిట్ట సామాజికతను ఒంటబట్టించుకున్న అపర దేశభక్తుడు పివి" అని పి.వి వ్యక్తిత్వాన్ని గొప్పగా ప్రకటించారు.

మాతృభాషాభిమానిగా, నిరుపేదలకు కూడా విద్యా ఫలాలు అందాలని తపనపడ్డ పి.వి గురించి శ్రీకాంత్ ఆయా సందర్భాలలో కవితాత్మకంగా వివరించే ప్రయత్నం చేసారు.  "దేశంలో నూతన ఆర్థికసంస్కరణలనే చెట్లను నాటి భవిష్యత్తుకు సరళీకరణ ఫలాలను అందించిన ఘనుడు భారతదేశ నూతన ఆర్థిక విధానాల రూపశిల్పి పివి" అంటూ భారత ప్రధానిగా పి.వి దేశాభివృద్ధికి సరళీకృత ఆర్థిక విధానాలను అమలుపరిచిన ధీశాలి అని, తన పరిపాలనా దక్షతతో దేశ దశ - దిశనే మార్చారని పేర్కొన్నారు.

మొగ్గలు ప్రక్రియలోని మూడు పాదాలలో మొదటి రెండు పాదాలలో చెప్పదలుచున్న విషయాన్ని మూడవపాదంలో వ్యక్తీకరించడం అనేది మొగ్గలు ప్రక్రియ కవితాలక్షణం.

"రాజకీయ జీవితంలో ఆటుపోట్లనెన్నెంటినో ఎదుర్కొని
తలపండిన మేధావిగా ప్రకాశించిన అసామాన్యుడు
సమయస్ఫూర్తితో నెగ్గుకొచ్చిన సహనశీలి మన పివి"

అని సామాన్యపదాలతో అసామాన్యమైన భావాలను వెలువరించడం అనేది మొగ్గల ప్రక్రియలోనే సాధ్యం. సూక్ష్మంలో మోక్షంలాగా మూడుపంక్తులలోనే ఒక విషయాన్ని చెప్పి పాఠకులను అలరింపజేయడం అనేది మొగ్గల ప్రత్యేకత.  అందుకే పి.వి సాహితీసృజనను, బహుభాషాపాండిత్యాన్ని అనువాదపటిమను భీంపల్లి ఇక్కడ ఇలా ప్రకటించారు.

"బహుభాషా గ్రంథాలను సృజనాత్మకంగా అనువదించి తెలుగుభాషానుపాద నైపుణ్యానికి నిదర్శనమై నిలిచాడుమరాఠి భాషాప్రావీణ్యానికి నిదర్శనం పివి అబల జీవితం"

విపత్కర పరిస్థితులలో స్వతంత్ర భారతదేశానికి పన్నెండవ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన పి.వి తన సహనంతో, రాజనీతిజ్ఞతతో పూర్తికాల ప్రభుత్వాన్ని నడిపిన పరిపాలనాదక్షుడు.  ఇదే విషయాన్ని భీంపల్లి చెప్తూ "ప్రతికూల ప్రభావాలను అనుకూలంగా నిర్దేశించుకుని స్వపక్షీయులను సైతం అబ్బురపరచిన అజేయుడు రాజకీయ రణరంగాన్ని ఏలిన విలక్షణ రాజనీతిజ్ఞుడు పివి"

ప్రశంసలకు పొంగక, విమర్శలకు కుంగక, మౌనమునిగా తనపని తాను చేసుకుపోయి, సర్వజనులకు హితం చేస్తూ, అసాధ్యాలను సుసాధ్యం చేసిన పి.వి జీవితంలోని విలువైన ఘట్టాలను, ప్రధానిగా వారు తీసుకున్న నిర్ణయాలను, సాహితీవేత్తగా వారు చేసిన కృషిని పేర్కొంటూ డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ చేసిన ఈ రచన సర్వులకు పఠనీయ గ్రంథం.  ''అసాధ్యుడు" అనే నామాంతరం చేసిన ఈ గ్రంథంలోని మొగ్గల ప్రక్రియలో ఉన్న కవితలు విద్యార్థులు సైతం తేలికగా చదివి, పి.వి బహుముఖీన వ్యక్తిత్వాన్ని అవగాహన చేసుకొనడానికి చక్కటి ఆధారం.   తెలంగాణ ప్రముఖులందరిపై కూడా సులభశైలిలో డాక్టర్ భీంపల్లి శ్రీకాంత్ ఇలాంటి గ్రంథాలను వెలువరింపజేయాలని కోరుకుందాం.

- వేదార్థం మధుసూదనశర్మ

click me!