వారాల ఆనంద్ కవిత : ఒంటరితనం-విడిగా రాదు

By Arun Kumar P  |  First Published Aug 1, 2022, 10:38 AM IST

ఒంటరితనం ఊరికే వచ్చి కూర్చోలేదు  హృదయం లోతుల్ని చూసే లోచూపునీ ఇచ్చింది అంటూ వారాల ఆనంద్ కవిత రాసిన కవిత " ఒంటరితనం-విడిగా రాదు " ఇక్కడ చదవండి :
 


ఒంటరితనం
ఎప్పుడూ విడిగా రాదు
దుఖాన్ని ముసుర్లా వెంటేసుకొస్తుంది

దుఖం ఊరికే పోదు
కన్నీరయి చెంపల్నీ గుండెల్నీ
ముంచెత్తుతుంది

Latest Videos

రెండు దృశ్యాలూ నాలుగక్షరాలూ
నా లోకమేమో చాలా చిన్నది

నేను పుట్టిన ఇల్లు ఇప్పుడు లేదు
ఆ ఇంట్లోని బాదం చెట్టూ లేదు
నేను పెరిగిన ఇల్లూ లేదు
ఆ ఇంటి ముందరి వేప చెట్టూ లేదు
కటిక ఈరమ్మా, బుక్క శంకరమ్మా లేదు
పూసవేర్ల దుకాణమూ లేదు
....
నేను నడిచొచ్చిన దారి ఇరుకిరుకు
దారి పొడుగుతా మలుపులు మలుపులు
తిన్నగా లేదు అంతా ఎత్తుపల్లాలు

నిలువలేక నడుస్తూనే వున్నా
ఒంటరితనంలోంచి సమూహంలోకి
సమూహంలోంచి ఒంటరితనంలోకి

ముందుండి నడిపించిన వారు
మూల మలుపుల్లో జారిపోయారు
వెంటుండి నడిచిన వాళ్ళు
చౌరస్తాలో కాటగల్సిపోయారు    
 
ఏం చేయను
నేనూ నా నడకా ఒంటరిదయిపోయింది
అట్లని
ఒంటరితనం ఊరికే వచ్చి కూర్చోలేదు  
వేదనలో ముంచిన కొత్త చూపును వెంట తెచ్చింది
హృదయం లోతుల్ని చూసే లోచూపునీ ఇచ్చింది

ఒంటరిదనం ఒంటిగా రాదు మరి!!
 

click me!