ఈ నేలను కాపాడటం కోసం నిరంతరం పరితపించే ప్రాణం వెచ్చని వాసన కోసం వెతుకులాడుతున్నది అంటున్న బెల్లంకొండ సంపత్ కుమార్ కవిత " వీథి బతుకు " ఇక్కడ చదవండి :
ముసురు చలి చినుకు
ఒకతీరు
బల్లమై గుచ్చుతుంటది
మండే మంచు శిల మీద
వణుకు కాగే ఇగం
కనికరం చూపదు
ముదురుకునే మూరెడు జాగ
వెళ్ళిపొమ్మని గోడు చేస్తది
సొమ్మసిల్లుతున్న కళ్ళకు
వీధి ఆకలిగా కనిపిస్తది
నాలుగడుగులే సుదూర తీరంగా
నడక భారమవుతది
కుక్క బతుకంటే ఇదేనేమో !
భూమి అర్థ భ్రమణమైపోయినట్టు
భూపాల గీతాలు మారిపోతుంటాయి
తెరుచుకొని తలుపులు
దైన్యాన్ని వెక్కిరించుకుంటూ
మూసుకపోతాయి
గాయంలోని గాయం
నొప్పిలో నొప్పై
ములుగులోని ములుగు
ముల్లై సలపరిస్తది
భూమి ఆకాశాల నడుమ
నిలుచున్న నేల మీద
నిజాయితీ విశ్వాసం
ఎల్లలు లేని రాజ్యాధినేతనే చేశాయి కాని
ఎంత బురద గాలించి
కడుపు కొక్క మెతుకంట లేదు
వాడలు పట్టిన తోబుట్టువులు
వాడిపోయిన వాత్సల్యాలు
ఒట్టిపోయిన ప్రేమలు
ఏ సందేశాన్నిస్తున్నాయి ?
స్థిరవాసులం కాదని తెలుసు
సంచారం గుర్తించలేము ?
శాశ్వతం కాదని తెలుసు
విషయ వాంఛలు వదులుకోలేము ?
ఈ నేలను కాపాడటం కోసం
నిరంతరం పరితపించే ప్రాణం
వెచ్చని వాసన కోసం
వెతుకులాడుతున్నది