మంచీ చెడూ - గెలుపూ ఓటమీ మనసు పొరల్లో మరుగున పడడమే లేదు ' నా కన్నీ గుర్తే.. ' అంటూ వారాల ఆనంద్ రాసిన కవిత ' నా కన్నీ గుర్తే.. ' ఇక్కడ చదవండి :
వరమో శాపమో ఎందుకోమరి
నాకన్నీ గుర్తుంటాయి
అలలు అలలుగా లోనెక్కడో ప్రవహిస్తాయి
సుళ్ళు తిరుగుతాయి
ఉప్పొంగుతాయి సల్లబడతాయి
సుఖాలూ దుఃఖాలూ
అభినందనలూ అవమానాలూ
ఆదరణ నిరాదరణ
అన్నీ అన్నీ మెదుళ్తూనే వుంటాయి
మనసులో మెసుళ్తూనే వుంటాయి
undefined
నిజమే మరి
నేనేమీ పిల్లాడి చేతిలో
‘పలక’ను కాను
అ..ఆ.. లు దిద్ది
పాత బట్టతో తుడిచేస్తే మలిగి పోవడానికి
మరుపు ఒక వరం కదా అన్నారెవరో
జ్ఞాపకం ఒక శిక్ష అని కూడా అన్నారు
కానీ ,
వర్షానికి చెత్తా చెదారం కొట్టుకు పోయినట్టు
కాలప్రవాహానికి ఏదీ చెరిగిపోవడం లేదు
కనీసం
ధారగా పారే కన్నీళ్ళకీ కరగడం లేదు
శిలలమీద చెక్కిన పురా రాతల్లా
నిలబడే వుంటున్నాయి
అవును మంచీ చెడూ
గెలుపూ ఓటమీ
మనసు పొరల్లో మరుగున పడడమే లేదు
నాకన్నీ గుర్తే వుంటున్నాయి