గుడిపల్లి నిరంజన్ కవిత : నలిపెడుతున్న భావమేదో..!

By Sairam Indur  |  First Published Mar 17, 2024, 5:13 PM IST

బరువును పెంచే మనుషులు ఎప్పుడూ ఉంటారు అంటూ నాగర్ కర్నూల్ నుండి గుడిపల్లి నిరంజన్ రాసిన కవిత  'నలిపెడుతున్న భావమేదో..! ' ఇక్కడ చదవండి :


ఏమీ తోచని స్థితి
ఎప్పుడో ఒకసారి
అందరికీ వస్తుంది

అమ్మ పోయినప్పుడో 
నాన్న ఊపిరి ఆగినప్పుడో
మనసు వెన్ను విరిగినప్పుడో
అనర్ధాలు ఎదురుపడ్డప్పుడో
అపార్థాలతో స్నేహాలు కూలినప్పుడో..
దారితప్పినప్పుడో...
ఎప్పుడో ఒకప్పుడు
ఊపిరాడని స్థితి
అందరికీ వస్తుంది

Latest Videos

undefined

పూర్వజ్ఞాపకాలు రోదించినప్పుడో..
కయ్యాలు కురిసినప్పుడో
గింజలు మొలువనప్పుడో 
కోసిన పంట తుఫాన్ లో కొట్టుకపోయినప్పుడో
ఆత్మకు నచ్చినవాళ్లు వెనక్కి గుంజి నప్పుడో..

అప్పుడే సొప్ప బెండులా
అల్కగా బరువు తగ్గిపోతాం
ఈనెపుల్లలా సన్నగా మారుతాం

ఒక్కోసారి మనసు లోపల 
కసిబిసితో నలిపెడుతున్న భావమేదో
బయటికి ఉసులుతుంది
అప్పుడే ఏమీతోచని స్థితి
వేడి శ్వాసల రూపంతో బయటకు వస్తుంది

నిన్నటి దాక నవ్వినట్టున్న ముఖాల్ని 
ఇవ్వాలే ఎవరో అపంహరించుకపోయాక..
కొన్నిసార్లు భలే ముసురుకుంటాయి
నలుపు మేఘాలు..!

బరువును పెంచే
మనుషులు ఎప్పుడూ ఉంటారు
కానీ ,
బరువు దించే మనుషులే
మహానుభావులై నిలిచిపోతారు.

click me!