వారాల ఆనంద్ కవిత : అందరమూ..... శరణార్థులమే

By Arun Kumar P  |  First Published Apr 5, 2022, 2:45 PM IST

గ్యాసు బండ నుంచి పీల్చే గాలి దాకా అన్నీ యుద్ధ ఖైదీలే...' అందరమూ..... శరణార్థులమే' అంటూ వారాల ఆనంద్  రాసిన  యుద్ద ప్రభావ కవితను ఇక్కడ చదవండి.
 


అందరమూ..... శరణార్థులమే  

దేశమేదయితేనేం దేహమేదతేనేం
చంపడమూ ఓ చావడమే  

Latest Videos

వాడెవడో యుద్ధం మొదలెట్టాడు 
వాడికి తెలీదులా వుంది 
వినాశనం వెయ్యికాళ్ల జెర్రి 

‘బాంబులు’ వేసిన వాన్నీ బలితీసుకుంటాయి 

మనుషులెప్పుడూ మనుషులే   
యుద్ధం వాళ్ళని విడదీస్తుంది 

ఒక్కోసారి 
నిరాయుధులయిన ప్రజలు 
యుద్ధాన్ని నిలువరిస్తారు 
ఒక్క క్షణమయినా 

కానీ ఇవ్వాళ 
నా కనురెప్పలు మూసినా తెరిచినా 
కను పాపల నిండా
కూలిన ఇండ్లూ చిధ్రమయిన దేహాలూ 
కుప్పలైన శవాలూ 

కనుకోనుకుల్లోంచి కలల్లోకి
ఒక కల నుంచి మరో కలలోకి 
ఒక యుద్ధంలోంచి మరో యుద్ధంలోకి  
నా గుండెలనిండా 
‘శిథిల’ చిత్రాలు 
. . .
యుద్ధం 
అటుతిరిగీ ఇటు తిరిగీ 
అన్ని హద్డుల్నీ సరిహద్దుల్నీ దాటి 
మా ఇంట్లోకీ దూసుకొచ్చింది   

గ్యాసు బండ నుంచి పీల్చే గాలి దాకా 
అన్నీ యుద్ధ ఖైదీలే 

అందరమూ 
శరణార్థులమే
 

click me!