కవితా లతలే నర్తనమాడే అంబరమైన సంబరంలో డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత "ఓ ఆల్కేమీ" ఇక్కడ చదవండి:
ఓ ఆల్కేమీ
కనులు వాల్చని రెప్పలలో
విద్యావైద్యం పిలుపు చూపులు
తొణికే పచ్చని కరుణ భావనలు
హృదయం నింపిన కవిత్వతత్వం
లయలో దొరకని లోయల లోతులు
పూలుగా పూచిన పరిమళ చలనం
మనసు మాయని ధవళ వర్ణం
మమతలు పెరిగిన స్వర రాగం
భావావేశంలో కరిగే నవీన తేజం
చేతులు చేసేది రాసేటి పనులు
కవితలై మెరిసే చిరునవ్వులు
బలపం పట్టి రాసిన పలకలుగా
కాళ్ళకు వినిపించు అందెల రవళి
నడకల పూసెను పూవుల పుప్పొడి
కవితా లతలే నర్తనమాడే
అంబరమైన సంబరంలో
గీతాలాపనలో శుభ్రపడే వదనమే
జిహ్వచంచలమే కట్టడి చేసే గాత్రం
నవ నాడులే స్పందించే రమ్య రసం
చూపులు చూసిన అందాలు
కనులకు తెలియని రాగాలు
సరిగమలైన మధుర మంజుల గీతం
ఉదయ భావనలో ఊగెను మౌనం
కావ్యమే కదిలే కన్నుల ఊహలుగా
రస రాగమే రమణీయమై ఆడీపాడే
విశ్వ విపంచి తీగలు మీటి కొనగోట
మృదు మధుర స్వనములుగా
భావగీతాల ఊగేను కొత్తగా అక్షరం
రస వేదమే స్వర భావమైనది
రంగుల వేదిక సర్వం సారంగమైనది
సుందర స్వప్నంలో అలలు ఎగిసిన
అంతరంగమే విరిసే ఆమనియై అవనిపై