మనకు రానిదాని కోసం బాధ పడక్కర్లేదు…మనం ఎందులో రాణించగలమో అనేది తెలుసుకోవాలి అనే సందేశాన్ని అందిస్తూ వేములవాడ జిల్లా చెందుర్తి మండలం నర్సింగాపూర్ గ్రామానికి చెందిన అనిల్ కంటే రాసిన "మొదటి బహుమతి " కథ ఇక్కడ చదవండి.
వృత్తిరీత్యా ఎక్కడున్నా సెలవులు రాగానే వెంటనే మా ఊరికి వచ్చి చేరుతాను. అలాగే ఖచ్చితంగ నేను పదో తరగతి వరకు చదువుకున్న స్కూల్ దగ్గరికి మిత్రులతో లేదా ఒంటరిగానైనా వెళ్ళి కూర్చోవడం నాకు అలవాటు. అలా కూర్చుండి నా చిన్నప్పటి సంఘటనలను, మిత్రులను, ఉపాధ్యాయులను యాది చేసుకుంటూ కొన్ని గంటలు సంతోష పడిపోతుంటాను.
ఎప్పటిలాగా మా బడి వరండాలో కూర్చున్నాను. ఆ వాతావరణం, ఆ రోజులు,ఆ దోస్తులు, టీచర్లు మల్లొక సారివస్తేఎంత బాగుండో అని ఆలోచిస్తున్నాను. అంతలో అక్కడికి కొందరు పిల్లలు వచ్చి క్రికెట్ ఆడుతున్నారు. ఒక పిల్లవాడుమాత్రం తనను ఎవరు కోరుకోలేదు అని ఏడుస్తున్నాడు. అది చూడగానే నా చిన్నప్పటి సంఘటన ఒకటి యాదికొచ్చింది. బడిలో జరిగే ప్రతి సంఘటన కూడా మనల్ని నవ్వించేది, ఏడిపించేది లేదా ఏదోకటి నేర్పించేది.
* * *
ఆరోజు సాయంత్రం మా బడిలో అందరు గ్రౌండ్ లో ఆటలుఆడుతున్నారు. నేను తరగతి గదిలోనే కిటికీ పక్కన కూసొని వాళ్ళను చూస్తూ నా బొమ్మల పుస్తకంలో మెగాస్టార్ చిరంజీవి బొమ్మ గిస్తున్నాను. అంతలో మా తరగతి గదిలోకి మా లెక్కల సార్ రాజేంద్రప్రసాద్ వచ్చారు. సార్ నన్ను చూసి “అరేయ్ అనిల్... ఏంట్రా నువ్వు ఆడుకోవడానికి పోలేదా?” అన్నాడు. “లేదు సర్ పోలేదు“ అన్నాను. “ఎందుకురా?” సార్ అన్నాడు. నేను కొంచెం మెల్లగా “సర్ ఏం ఆడుతాం సర్. ఈ ఆటలు నాకు పెద్దగా ఆడబుద్ది కాదు సార్, వట్టిగా దెబ్బలు తాకుతాయి'' అన్నాను.
సర్ చిన్నగా నవ్వుతూ నా దగ్గరికి వచ్చి, పక్కన కూర్చొని బొమ్మల పుస్తకం తీసుకొని చూస్తూ, నా భుజం మీద చెయ్యివేసిండు. నాకు పట్టరానంత సంతోషంగా ఉంది. కొంచెం దూరంగా ఉన్న ఇద్దరు అమ్మాయిలు మమ్మల్నే చూస్తున్నారు. వారిద్దరు మా తరగతిలోనే అందరికంటే అందంగా ఉంటారు. అందరు వాళ్ళను చూస్తే వారు మాత్రం నన్నుచూసేవారు, చదువులో నాతో పోటిపడేవారు.
నాకు ఎందుకంత సంతోషం అంటే రాజేంద్రప్రసాద్ సర్ అంటే మా బడిలో, మా ఊరిలో అందరికి చాల ఇష్టంతో కూడినగౌరవం వల్ల వచ్చిన భయం ఉండేది. ఎందుకంటే సర్ మా బడిలో చదువు చెప్పవట్టి ఎనిమిది, తొమ్మిదేండ్లు అయితుంది.
సర్ క్లాస్ చెపుతుంటే ఎవ్వరు మెడలుకూడా పక్కకు తిప్పరు, కొందరు గజగజవణుకుతారు. సర్ అంటే అందరికి చాల ఇష్టం. కాని, సర్ కి నేనంటే ఇష్టం. సర్ నా బొమ్మల పుస్తకం పూర్తిగా చూసి “అరేయ్ అనిల్ నీకు డ్రాయింగ్ లో కూడా మంచి టాలెంట్ ఉందిరా... బొమ్మలు చాలా మంచిగా గీసావు... వెరి గుడ్'' అన్నాడు. నేను ”తాంక్స్ సర్”అన్నాను.
సర్ అలాగే నా భుజం మీద చేయివేసి తీసుకు వెళ్తున్నాడు. వరండాలో నుండి నడుస్తూ “అరేయ్ అనిల్ నువ్వు ఏం పరీక్ష పెట్టినా అన్నిట్లో ఫస్ట్ వస్తావు. కాని ఆటలంటే భయపడుతావు ఏందిరా?” అన్నాడు. “సార్ భయం కాదు నచ్చదు అంతే!” అన్నాను. అప్పుడు సర్ “అరేయ్ ఎప్పుడైనా నువ్వు గ్రౌండ్ లో దోస్తులతోని ఆడితే కదా! నచ్చుతుందో,లేదో తెలిసేది. అరేయ్ మన జీవితంలో కేవలం చదువు ఒక్కటే ఉంటే చాలదు... చదువుతో పాటు ఇంకా చాల ఉంటాయి.ముఖ్యంగా పిల్లలకు శారీరక, మానసిక బలం అభివృద్ధి అయ్యేది ఆటలు, పాటలవల్లనే... ఖచ్చితంగా చదువుతో పాటు ఆటలు కూడా ఉండాలి... సరేనా... ఆడుదాం పా“ అని నన్ను క్రికెట్ మైదానంలోకి తీసుకుపోయిండు.
అక్కడ నా పైతరగతి వారు,నా దోస్తులు క్రికెట్ కోసం టీంలు కోరుకుంటున్నారు. ఇద్దరు కెప్టెన్ లు వరుసగా అందరిని కోరుకుంటున్నారు. నన్ను మాత్రం ఎవరు కోరుకోవడం లేదు. చివరివరకు నా వైపు కూడా ఎవ్వరు చూడటం లేదు. బ్యాటింగ్ టాస్ కూడా వేస్తున్నారు. అక్కడ ప్రసాద్ సర్ వెళ్లి బ్యాటింగ్ పట్టి ట్రయల్ బాల్స్ అడుతున్నారు. నన్నుకోరుకోని విషయం సర్ కి తెలియదు. టాస్ గెలిచి కొందరు ఫీల్డింగ్ సెట్ చేస్తున్నారు.
నాకు ఇజ్జత్ పోయినట్టు అనిపించింది. అప్పుడు అర్థమైంది ‘నేను క్లాస్ రూమ్ లో హీరో కానీ మైదానంలో జీరో’ అని... ఇక అక్కడ ఉండకూడదు అనుకుని అటుపక్కనున్న చింత చెట్టు కిందకి వెళ్లాను.అక్కడ ఆట చూడటానికి చాల మంది ఉన్నారు. నేను వాళ్ళతో కూర్చుందాం అని వెళ్తుండగా మా ప్రసాద్ సర్ “అరేయ్ అనిల్ నువ్వు ఎంట్రా? అడుతా అని వచ్చి పోతున్నావు... అరేయ్ వాన్ని ఎవరు కోరుకోలేదా? రారా అడుదువు రా“ అని పిలవడంతో నేను వెళ్లి ఫీల్డింగ్ చేస్తున్నాను.
ఆట మొదలైంది. ఒక ఓవర్ అయిపోయింది. నా వైపు ఒక్క బాల్ కూడా రాలేదు. నేను బీరిపోయి నిల్చున్నాను అంతలో బాల్ వేగంతో నా వైపు దూసుకువచ్చింది. అది నేను ఆపలేకపోయాను ఫోర్ పోయింది. వెంటనే ఇంకో బాల్ కూడా మిస్ అయ్యి బౌండరీ దాటింది. ఇక నా వైపు అందరు కోపంగా చూసారు. అప్పుడు “ఫర్వాలేదురా అనిల్... మంచిగానే ఆడుతున్నావు“ అని దగ్గరికి వచ్చి ఎలా ఆడాలో నాకు కొన్ని సలహాలు ఇచ్చారు ప్రసాద్ సార్. తరువాత మొత్తం ఒక్క బాల్ కూడా మిస్ చేయలేదు. ఆట ఆసక్తిగా సాగుతున్నది, అందరితో పాటు నా తరగతి అమ్మాయిలు కూడా చూస్తున్నారు. హోరాహోరీ పోరు తర్వాత ఆట ముగిసింది. కేవలం రెండు పరుగుల తేడాతో మా టీం ఓడిపోయింది. అందరు నేను చేయబట్టే ఓడిపోయింది అన్నట్టు చూసారు, కొందరు తిట్టారు. కాని నేను బాధపడలేదు, ఎలాగైనా సరే క్రికెట్ ఆట నేర్చుకోవాలని నిర్ణయించుకున్నాను.
మా ఇంటి వెనుక పెరట్లోనే క్రికెట్ గ్రౌండ్ చేసుకొని, నేనే డబ్బులు జమ చేసుకోని ఒక బ్యాట్, బాల్ కొనుక్కొని మా పెరట్లోనే క్రికెట్ ఆట ప్రారంభించాను. రోజు సాయంత్రం ప్రాక్టిస్ చేసేవాన్ని , మా స్కూల్లో ఎప్పుడు క్రికెట్ ఆడినా వెళ్లి నిల్చునేవాడిని, అయినా నన్ను ఏదో చివర్లో ఎక్స్ట్రా ప్లేయర్ లెక్క తీసుకునేవారు.
నేను ఎంత ట్రై చేసిన ఒక్క ఆటలో కూడా ఒక్క రన్ కూడా తీయలేకపోయాను. రాత్రి , పగలు ప్రాక్టీస్ చేసి బౌలింగ్ వేయడం నేర్చుకున్న కానీ ఆటలో ఆన్నీ వైడ్ బాల్లె పడేటియి. ఎప్పుడు చాంపియన్ అనుకునే నేను ఈ క్రికెట్ ఆటలో కొందరితిట్లు, కొందరి ఉచిత సలహాలు, కొందరి అవమానాలు అన్నీ భరిస్తూ మొత్తానికి ఆట నేర్చుకున్నాను.
జనవరి 26 సందర్భంగా మా పాఠశాలలో ఆటల పోటీలు జరుగుతున్నాయి. ఎలాగూ నన్ను ఎవరూ కోరుకోరు అని నేనే కెప్టైన్ గా ఉండి టీం కోరుకున్నాను. క్రికెట్ మ్యాచ్ ప్రారంభమైంది, నేను ఎంత గట్టిగా ప్రయత్నించినా నా టీం చిత్తుగా ఓడిపోయింది. అందరు నవ్వారు, ఆఇద్దరు అమ్మాయిలు అయ్యో పాపం అన్నట్టు చూసింరు.
నేను ఒక్కడినే నా తరగతి గదిలోకి వెళ్లి చివరి బెంచ్ లో కూర్చుని ఏదో కోల్పోయినట్టు ఎక్కి ఎక్కి ఏడుస్తున్నాను. బయట ఆటల పోటీలు జరుగుతున్నాయి. అప్పుడు నా దగ్గరికి మా సర్ వచ్చి నా పక్కన కూర్చుని ఓదార్చాడు. “అనిల్ ఎప్పుడైన అన్ని చాలెంజ్ గా తీసుకునే నువ్వు ఈ చిన్నదానికి ఏడుస్తున్నవా ” అన్నాడు. అప్పుడు నేను “సర్ నేను చాల కష్టపడి నేర్చుకున్నాను, చాల ప్రాక్టీసు కూడ చేసాను సర్. మరి నాకెందుకు ఈ క్రికెట్ అబ్బలేదు” అని బోరున ఏడ్చాను. అప్పుడు సర్ “ అరేయ్ నిన్ను ఆటలు అడుమని చెప్పిన కాని కేవలం క్రికెట్ మాత్రమే కాదు.... అయినా నువ్వు అన్నిట్లో ఫస్ట్ ఉంటావు, ఏదైనా పట్టుబట్టి నేర్చుకుంటావు. అలాగే క్రికెట్ కూడా నేర్చుకున్నావు. కాని అందులో సరిగ్గా రాణించలేదు అంతేగా! అందుకు ఏడవాల? నీవు ఏ ఆటలో రాణించగలవో తెలుసుకో… ఒక్క క్రికెట్ ఆటనే కాదు కబడ్డీ, కోకో, వాలీబాల్ ఇంకా చాలా ఉన్నాయి. ఆ ఆటలనన్నీ ఆడిచూడు. ఒక్కొక్కలకు ఒక్కో దాంట్లో ప్రతిభ ఉంటది. సరేనా” అన్నాడు. నేను “సరే సర్” అని ఇంటికి వెళ్ళాను.
మరుసటి రోజు బడికి వచ్చి కబడ్డీ టీం తీసుకున్నాను. అట మొదలైనప్పటి నుండి నేను ఆగలేదు ఆడుతూనే ఉన్నాను,గెలుస్తూనే ఉన్నాను. తర్వాత కోకో ఆటలో కూడా గెలిచాను. ఆ తర్వాత వాలీబాల్ ఆటలో కూడా నేనే గెలిచాను. ఇంకా ఇండోర్ గేమ్స్ చెస్, క్యారం బోర్డ్ , మెమరీ టెస్ట్ లాంటి అన్ని గేముల్లో నాదే “మొదటి బహుమతి. ఒక క్రికెట్ లో తప్ప!” “మనకు రానిదాని కోసం బాధ పడక్కర్లేదు…మనం ఎందులో రాణించగలమో అనేది తెలుసుకోవాలి” అనితెలుసుకున్నాను.