అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం అనిల్ బత్తుల “పిల్లల సినిమా కథలు” అందిస్తున్నారు వారాల ఆనంద్.
నిజాలు మాట్లాడుకుంటే పిల్లలంటే మనకు అసలు పట్టింపు లేదు, ప్రేమ అసలే లేదు. నేను ఇట్లా అంటే కొంచం కష్టం అనిపించొచ్చు. కానీ అది నిజం. మనం కేవలం 14 నవంబర్ రోజున మాత్రమే పిల్లల గురించి మాట్లాడతాం. గొప్ప గొప్ప మాటలు మాట్లాడతాం. భావి భారత పౌరులు అంటాం. భవిష్యత్తు నిర్మాతలు అంటాం. కానీ వాళ్ళ కోసం ఆలోచించం. ఏమీ చేయం. ప్రత్యేకంగా ఏమీ రాయం. కథలు లేదా కవితలు రాయడానికి ప్రోత్సహించం. పిల్లల్ని మార్కుల వెంట పరుగేత్తిస్తాం. మెరిట్ అంటూ హింస పెడతాం.ఇప్పుడు ఇంకా ఆన్ లైన్ క్లాసులు, డిజిటల్ తరగతుల పేర కనీస సంబంధాల్నుంచీ దూరం చేస్తున్నాం. అన్ని భారతీయ భాషల్లోనూ చూస్తే కేవలం బెంగాలీ, మలయాళం, కన్నడ, మరాఠీ భాషల్లో తప్ప మిగతా ఇతర భాషల్లో బాలసాహిత్యం తక్కువ. కొన్ని భాషల్లో నయితే శూన్యం. పిల్లల కోసం రాసేవాళ్ళు తక్కువ. రాసిన వాళ్లకు గుర్తింపు తక్కువ. పిల్లల పుస్తకాలకు మార్కెట్ తక్కువ. పిల్లల్ని చేరే సాహిత్యం తక్కువ. అంతేకాదు పిల్లల కోసం సృజనాత్మక కార్యక్రామాలు మరీ తక్కువ. దేశంలో పాలకులు అధికారులు చివరికి తల్లిదండ్రుల్లో కూడా (ఏ కొంత మందో తప్ప) పిల్లల గురించి మాట్లాడే వాళ్ళు ఎక్కువ కానీ వాళ్ళకోసం ప్రత్యేకించి చేసేది తక్కువే నంటాను.
ఇక మన దేశంలో బాల సాహిత్యం కంటే బాలల సినిమాలది దారుణమయిన పరిస్థితి. దాదాపు అన్ని భాషల నిర్మాతల్లోనూ పిల్లల సినిమాలు తీస్తే మార్కెట్ లేదు ఏమొస్తుంది అనే భావనే. మలయాళం, బెంగాలీ లాంటి కొన్ని భాషల్లో వేళ్ళ మీద లెక్కించే కొన్ని మంచి సినిమాలు మాత్రం తీసారు. ఇక ముంబైలోని బాలల చిత్ర సమితి ( CHILDREN FILM SOCIETY OF INDIA) నిర్మించిన వందలాది పిల్లల సినిమాలు ప్రదర్శనకు నోచుకోకుండా ముంబైలో పడి వున్నాయి. మేము కరీంనగర్ ఫిలిం సొసైటీలో క్రియాశీలకంగా వున్న కాలంలో అనేక ఏళ్ళ పాటు CHILDREN FILM SOCIETY OF INDIA నుండి సినిమాలు తెచ్చి బాలల చలన చిత్రోత్సవాలు నిర్వహించాం. CHILDREN FILM SOCIETY OF INDIA కూడా రెండేళ్ళకోసారి అతర్జాతీయ చలన చిత్రోత్సవాలు నిర్వహించి చేతులు దులుపు కుంటున్నది. ఆ ఉత్సవాలకు హైదరాబాద్ శాశ్వత కేంద్రం. కానీ రెండు దశాబ్దాలుగా హైదరాబాద్లో CHILDREN FILM SOCIETY OF INDIA కి మన రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం స్థలం ఇవ్వలేక పోయాయి.
పిల్లలంటే మనకు అంత ప్రేమ మరి....
ఈ పరిస్థితిలో ......
రండి .. అక్షరాల్లో సినిమాలు చూద్దాం! అంటూ మిత్రుడు అనిల్ బత్తుల తాను రాసిన పిల్లల సినిమాల కథలు పుస్తకం పంపించారు. వివిధ ప్రపంచ భాషల్లోని ఉత్తమ బాలల చిత్రాల్ని పరిచయం చేయాలనే ఉద్దేశ్యంతో ఈ పుస్తకం రాసానని తన ముందు మాటలో రాసారు. ఏ సినిమాకయినా కథే ప్రాణం కనుక ఆయా సినిమాల కథల్ని మాత్రమే చెప్పటానికి ప్రయత్నించానని కూడా చెప్పారు.
అయితే కథ వినడం, చదవడం, చూడడంలోనూ తద్వారా కలిగే ప్రభావంలోనూ చాలా తేడాలుంటాయి. పిల్లల మనోఫలకంపై దృశ్యం చూపించే ప్రభావం అమితం. అయినప్పటికీ అనిల్ తను చెప్పిన సినిమా కథల్లో మంచి కథనం వుంది. అవి చదువరుల్ని ఆకట్టుకునేలా వున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా పేరు ప్రతిష్టలు కలిగిన 25 సినిమాల కథల్ని మంచి బొమ్మలతో చూడముచ్చటగా పుస్తకంగా తీసుకొచ్చిన అనిల్ బత్తులను మొదట మనసారా అభినందిస్తున్నాను. ఇవ్వాళ పిల్లల గురించి వాళ్ళకోసం ప్రత్యేక సినిమాల గురించి ఆలోచించే వారే దాదాపు కరువయిన స్థితిలో అనిల్ పిల్లల మీద ఎంతో ప్రేమతో బాధ్యతతో ఈ పుస్తక ప్రయత్నం చేసారు. తాను స్వయంగా ఆ కథలు చదివి ఆయా సినిమాలు చూసి తిరిగి ఆ కథల్ని సరళ మయిన రీతిలో పరిచయం చేయడంలో అనిల్ బత్తుల తీసుకున్న శ్రమ పుస్తకాన్ని చూస్తే అర్థమవుతుంది.
ఈ పుస్తకం చేరగానే ఆసక్తిగా విషయసూచిక చూసాను. అందులో తాను పరిచయం చేసిన సినిమాల పేర్లు చూడగానే నా మదిలో అనేక జ్ఞాపకాలు ముప్పిరిగొన్నాయి. మూడు నాలుగు దశాబ్దాలుగా ప్రతి ఏటా నవంబర్లో కరీంనగర్ లోనూ ఇతర గ్రామాల్లోనూ నిర్వహించిన “బాలల చిత్రోత్సవాలూ”, నేను జ్యూరి గానూ ప్రేక్షకుడి గానూ పాల్గొన్న అనేక అంతర్జాతీయ బాలల చిత్రోత్సవాలూ అన్నీ సినిమా రీలులాగా కళ్ళముందు కదలాడాయి. ఇంకా 1999 లో నేను రాసిన “బాలల చిత్రాలు” దాని ఆంగ్లానువాదం ‘CHILDREN’S CINEMA’ (Tr.By A.Saiprasad) అప్పటి అనుభవాలూ అన్నీ గుర్తొచ్చాయి.
నిజానికి ‘జీవన రాగంలో మధురమయిన ఆలాపనే బాల్యం’. ఆ “బాల్యం మనిషికి తండ్రి లాంటిది” అని ఓ మహాకవి అన్నాడు. ఇంకో గజల్ కవి నా యవ్వనంతో సహా సమస్తాన్నీ తీసుకో కానీ నా బాల్యాన్ని ఆనాటి కాగితప్పడవనీ ఆనాటి వాననీ తిరిగి ఇవ్వమన్నాడు. అంత గొప్పదీ మధురమయిందీ బాల్యం. మానవ జీవన వికాసంలో బాల్యం అత్యంత ప్రభావ వంతమయిన పాత్రని పోషిస్తుంది. ఆ బాలల మనోవికాసంలో కథ,సంగీతం, చిత్రలేఖనంతో పాటు అన్ని సృజనాత్మక రంగాలూ ప్రముఖ పాత్రని పోషిస్తాయి. అమ్మ పాడే జోల పాట, పంచతంత్ర కథలు, కాశీమజిలీ కథలు జాతక కథలూ పిల్లల మీద ఎంతగా ప్రభావాన్ని చూపుతాయో మనకు తెలుసు. అదేక్రమంలో ఇవ్వాళ సినిమా విశ్వవ్యాప్తమయిన దృశ్య మాధ్యమంగా పిల్లల మానసిక స్థితి పైన తీవ్రమయినప్రభావాన్ని చూపిస్తున్నది.
తెరపైన బొమ్మలు కదలడం మొదలయిన నాటి నుండీ సినిమా పిల్లల్ని ఏదోరకంగా తనలో ఇముడ్చుకుంటూనే వుంది. అయితే సినిమా ప్రధానంగా వ్యాపారమయి పోయిన స్థితిలో స్వల్పంగానే అయినా వ్యక్తులుగా కొందరు దర్శకులు, కొన్ని సంస్థలు ప్రత్యేక బాలల సినిమా కోసం ప్రయత్నాలు చేసాయి చేస్తున్నాయి. వివిధ దేశాల్లో ప్రత్యేక నిర్మాణ సంస్థలూ, చిత్రోత్సవాల నిర్వహణ కొనసాగుతున్నది. అయితే పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందినవి బాల సినిమాలా, పిల్లలు నటించినవి బాలల సినిమాలా, పిల్లలే రూపొందించినవి పిల్లల సినిమాలా అన్న వాదన కొనసాగుతూనే వుంది. ఇక ఫీచర్ సినిమాలూ, అనిమేషన్,డాక్యుమెంటరీ ల్లాంటి అనేక రూపాల్లో పిల్లల సినిమాలు వస్తున్నాయి. ప్రపంచ సినిమా రంగంలో పిల్లల సినిమాలు ఓ ప్రత్యేకమయిన అంశం.
అదట్లా వుంచి ప్రస్తుత “పిల్లల సినిమా కథలు” పుస్తక అంశానికి వస్తే అనిల్ బత్తుల ఎంపిక చేసుకుని పరిచయం చేసిన దాదాపు అన్ని సినిమాలూ ప్రపంచ వ్యాప్త మన్ననల్ని అందుకున్నవే. తాను పరిచయం చేసిన రెడ్ బెలూన్, చిల్ద్రెన్ ఆఫ్ హెవెన్, ద కార్ట్, ద మిర్రర్, రన్నర్ లాంటి సినిమాలు గొప్ప బాలల సినిమాలు, అత్యంత సున్నితమయిన అంశాల్ని ఇతివృత్తాలుగా తీసుకుని దృశ్య కావ్యాలుగా రూపొందిన సినిమాలవి. ఇరాన్ సినిమాల్లో ముఖ్యంగా విషయం పిల్లలదే అయినా అంతర్లీనంగా దర్శకులు స్పృశించే అంశాలు చాల ప్రధానమయినవి. అత్యంత తీవ్రమయిన వ్యతిరేకమయిన వాతావరణంలో ఆయా దర్శకులు రూపొందించిన సినిమాలు గొప్ప చారిత్రక ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఆయా సినిమాల కథల్ని అనిల్ మంచి కథనంతో చాలా బాగా చెప్పారు.
అయితే సత్యజిత్ రే ‘పథే ర్ పాంచాలి’, విత్తోరియా డెసికా ‘బైసికల్ తీవ్స్’ సినిమాల్ని పిల్లల సినిమాలుగా పరిచయం చేయడం కొంత ఇబ్బందిగానే అనిపించింది. ఎందుకంటే ఆ సినిమాలు హ్యూమన్ డాక్యుమెంట్లు. పిల్లలు పాత్రదారులుగా వున్నారని పిల్లల సినిమాల కోటాలో వేశారేమో కానీ రే పిల్లలకోసం ‘హిరక్ రాజర్ దేశే’, ‘గోపి గైనే బాఘా బైనే’, ‘సోనార్ ఖేల్లా’, ‘పెకూస్ డే’ లాంటి అనేక సినిమాలు నిర్మించారు.
అయినప్పటికీ అనిల్ బత్తుల వెలువరించిన ‘పిల్లల సినిమాల కథలు’ ఆహ్వానించ దగ్గ పుస్తకం. వర్తమాన డిజిటల్ యుగంలో “దునియా ముట్టీమే” అంటున్న స్థితిలో కుప్పలు తెప్పలుగా పిడికిట్లో పడిపోతున్న సినిమాల్లోంచి పిల్లల కోసం వున్నకొన్ని మంచి సినిమాలని వాటి కథల్ని మన ముందుంచడం ఎంతో ఉపయోగకరమయిన ప్రయత్నం. పిల్లలు ఏ సినిమాలు చూడాలి అన్న ప్రశ్న వచ్చినప్పుడు ఇగో ఈ 25 తప్పకుండా చూపండి అని అనిల్ బత్తుల తెలుగు వారి ముందుకు తెచ్చారు. ఆయాన్ని మనసారా అభినందిస్తున్నాను.
(పుస్తకం కోసం హైదరాబాద్ నవోదయ వారిని
కాని, అనిల్ బత్తుల @9676365115 సంప్రదించవచ్చు)