కూటికి గతి లేనోళ్ళు ఏదైనా చేస్తారని చులకన చేస్తూ మాట్లాడే కొంత మంది పెద్దమనుషుల మాటలను నిరసిస్తూ హన్మకొండ నుండి రావుల కిరణ్మయి రాసిన కథ " సుదతి " ఇక్కడ చదవండి.
ఒళ్ళో బిడ్డను పెట్టుకొని ఆలోచనల్లో మునిగి ఉంది సుదతి. భర్త ఈ రోజైనా పొయి మీదకు, కిందకు ఏమైనా తెచ్చి కడుపులోని ఆకలి మంటను చల్లార్చుతాడని ఎదురు చూస్తున్నది. గతంలో హాయిగా కోడి కూయగానే లేచి పాచి పనంతా చేసుకొని తోటి అమ్మలక్కలతో వ్యవసాయం పనులకు, అవి లేనప్పుడు కూలి పనులకు పోయి ఏనాడూ ఎవరి దగ్గరా చెయ్యి చాపకుండ సంసార నావ సాగిపోయేది. ప్రేమావేశం, వయసు దుడుకుతనం, పెద్దల మాటలను లెక్కచెయ్యని నిర్లక్ష్యం వెరసి పెళ్ళిగా మారి ఇద్దరూ వారి వారి కుటుంబాలకు దూరంగా వచ్చేసి బ్రతుకుతున్నారు.
వారికి దొరికితే ఎక్కడ పరువు కోసం విడదీయటమో, చంపడమో చేస్తారనే భయంతోనే కొన్నాళ్ళు అజ్ఞా తంగా బతకడానికి నిర్ణయించుకొని తమ సమాచారం ఏ మాత్రం తమ వారికి తెలియకుండా జాగ్రత్త పడుతున్నారు.
రెండు సంవత్సరాల కాలం కష్టం తెలియనీయలేదు. తమ లాంటి వారెందరో అండగా ఉండగా ఏటి ఒడ్డున చిన్న పాక, ఒకటి రెండు వంట పాత్రలు, ఒక చాప ఒక రెండు జతల బట్టలు. ఇంతే వారి సంసారనావను నడిపిస్తున్న సామాగ్రి. వీటన్నిటికీ మించిన ఆత్మతృప్తి, ఒకరిపై ఒకరికున్న అనురాగం ధనవంతులకైనా దొరకని సౌఖ్యాన్ని ఇస్తున్నది.
అలా ప్రశాంతంగా సాగుతున్న తమ జీవితంలోకి ఒక మహమ్మారి చేరి కల్లోలం సృష్టించింది. తమ లాంటి వారెందరినో నీటి లోని చేపలను వలవేసి పట్టి ఒడ్డుకు పారేసినట్టుగా చేసి గిల గిలా తన్నుకునేలా చేస్తున్నది. ఇదివరకైతే కమ్మని కబుర్లు కలబోసుకొని ఎంతటి ఆకలినైనా, దుఃఖాన్నైనా దిగమింగుకొని మైమరిచి పోయేవారు. కానీ ఇప్పుడు తమ పాలు తాగే పసి బిడ్డ ఆకలితో అల్లాడుతుంటే ఓదార్చటం వారి వల్ల కావడం లేదు. లాక్ డౌన్ తో పనులన్నీ ఆగి పోయాయి. తమ బతుకు చక్రం ఆగి పోయింది. కొద్దో గొప్పో మిగిలింది తిని తోటి వాళ్ళు బతుకీడుస్తున్నారు. తమకు అదీ లేదు. ఎంతో కొంత రేపటికి దాచుకోవాలనే జీవిత సత్యం తెలిసివచ్చింది. కానీ ఈ పరిస్థితి గట్టెక్కేదెలాగో అర్థం కావడం లేదు సుదతికి. వారం పైనే అయింది అన్నం తిని. అది కూడా సహాయ సంస్థలు మానవత్వంతో పెట్టినవే. ఎవరైనా ఎంతకాలమని పెడతారు? అలా పెట్టేవారూ..... కరువై, పస్తు పడుకోవడం వారానికి వచ్చింది.
పసిబిడ్డ పాలకు ఏడుస్తున్నది. తిండి లేక పాలు రాక బిడ్డ...గుక్క పట్టి ఏడుస్తున్నది. ఆత్మాభిమానం చంపుకొని తమ లానే పాకలోనే ఉండే ఒక బాలింతను బ్రతిమిలాడుకొని రోజూ గుక్కెడు పాలు పట్టిస్తున్నది.
పాపం ..! ఆ తల్లే లేకుంటే తన బిడ్డ బతకడం కూడా కష్టమే. ఇలా ఉన్న సుదతి దగ్గరకు చిక్కెంటికలు కొనుక్కుంటూ వ్యాపారం సాగించే జానమ్మ వచ్చి మాటలు కలిపింది. "భోజనం చేశావా ? పిల్లా ?" అంటూ.
" లేదత్తా " అని లాక్ డౌన్ వచ్చినప్పటి నుండీ తమ వెత వెళ్ళగక్కింది.
"నీ ఒక్కదానిదే కాదే అందరి పరిస్థితి అంతేనాయే. కాకుంటే ఉన్నయో..లేనియో ..అమ్ముకొని ,అప్పో సప్పో తెచ్చుకొనైనా బతుకుతాండ్రు. నీకు అవీ లేక ఈ తిప్పలు. అయినా నిన్నియ్యాల సంది లాక్ డౌన్ ఎత్తేసిండ్రు, కొందరు పనులకు కూడా పోతున్నరు కదా!" అంది జానమ్మ.
"అవునత్త! కానీ, నా ఒంట్లో శక్తి, ఓపిక ఏ మాత్రం లేవు. రెండు రోజులు ఇంత ఏమన్నతిని కుదుట పడ్డంకనే సత్తువ వస్తదేమో కానీ, ఇప్పుడు మాత్రం చాలా నీరసంగా ఉంది" సుదతి నీరసంగా ఉన్న గొంతుతో సమాధానం ఇచ్చింది.
"సరేలే! నాదగ్గర ఇవ్వే ఉన్నాయి అంటూ వంద రూపాయల నోటు తీసిచ్చి, ఇయ్యాల్టికి సర్దుకోవే" అంది జానమ్మ.
" వద్దత్తా !" అభిమానంగా తిరస్కరించింది సుదతి.
"ఊరికే కాదు లేవే అప్పుగానే తీసుకో !" అనునయంగా జానమ్మ అంది.
"అప్పు చేసి పప్పు కూడు తినలేనత్తా! నీవూ ఎదో చిన్న బేరంతో పొట్ట పోసుకుంటున్నావు. నిన్ను ఇబ్బంది పెట్టలేను" అని ...కాసేపు ఆలోచించి వెంటనే ..
"అత్తా !నా జుట్టు కత్తిరించి ఇస్తాను తీసుకుంటావా ?" హుషారుగా అడిగింది సుదతి.
"నీ అవసరానికి నువ్వు జుట్టు కత్తిరించి ఇస్తానన్నా, నేనుఒప్పుకోను. రాలిన జుట్టు మాత్రమే సేకరించి అమ్ముకొనే నేను ఆ పని చేయలేను" జానమ్మ సమాధానం.
మొదటిసారి సుదతికి తమ లాగే ఆత్మాభిమానం, ఆత్మ గౌరవం కలిగిన జానమ్మ కనిపించేసరికి ఇంకా మారు మాట్లాడకుండా డబ్బులు బదులుగా తీసుకొని, తొందరలోనే తిరిగి ఇచ్చేస్తానని చెప్పింది.
అలా ఆ ఇద్దరూ తాము పేదవారిమే అయినా గుణానికి మాత్రం కాదని. అప్పనంగా ఎవరైనా డబ్బులు ఇచ్చినా ఆత్మాభిమానం చంపుకొని తీసుకోలేమని తెలియచెప్పారు. కూటికి గతి లేనోళ్ళు ఏదైనా చేస్తారని చులకన చేస్తూ మాట్లాడే కొంత మంది పెద్దమనుషుల మాటలకు చెక్ పెట్టారు.
జానమ్మ బేరానికి వెళ్లిపోయింది. సుదతి వంట చేసి కడుపునిండా తిని తన బిడ్డకు కూడా కడుపునిండా తన పాలు ఇచ్చింది. భర్తకు జరిగిన విషయం చెప్పి, తను తెచ్చిన కూలీ డబ్బుల్లో రోజూ కొంత పక్కకు పెట్టాలని నిర్ణయించుకొని గల్లా పెట్టె లాంటిది ఏర్పాటు చేసింది. ఇద్దరూ మునుపటిలా రేపటి గురించి దిగులు లేక గువ్వల్లా ఒదిగిపోయారు.