భారత రైతు ఉద్యమానికి సంఘీభావంగా శ్రీరామోజు హరగోపాల్ కవిత "ఆ నలుగురి కోసం..." ఇక్కడ చదవండి.
పచ్చటి ఆకులమీద వెచ్చటి నెత్తురు చిమ్మింది
అప్పటిదాకా తీగెలువారిన తియ్యటి రుతువు ఏమైందిరా, క్షణభంగురం
మేఘాల మెరుపుతీగెలు మీటి వినిపించిన ప్రాణలీన గీతాలు
ఆ నాలుగు దివ్యముఖాల మీద వాలిపోయే సీతాకోకచిలుకలు
జర్జరీభూతమైనదే మనిషి జీవితం, అయితే ఇట్లనే తొక్కేస్తరా?
డప్పులై మోగిన గొంతులు,
కత్తులై కాపలాకాసిన వీరులు
ధిక్కారమై ఎగిరిన జెండాలు
ఆకలికి బువ్వైన బతుకువిత్తులు
ఎసొంటి చావులు అవి, ఎట్లపోయిరి నరికిన పంటమెదలై
ఒరేయ్, కథచెప్పమంటవ్
రోజుకొకటి,
ఈ కథ చెప్పి ఏడిపించాల్నా, ఈ కథ చెప్పి పొడిపించాల్నా?
నేను స్మశానంలోనే బతుకుతున్ననని ఎరికైంది
అయితేంది నా చావు నాకు తెలిసి రాదుకదా
అయితేంది నేను ఆ నలుగురి కోసం చచ్చే టైమొస్తుందని కూచున్న
ఈ నాలుగు గీతలు రాసి,
పోతానేమో
రేపు నన్ను కూడా ఆ నలుగురితో కలిపిచెప్పండి
ఐ ఫీల్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దట్