అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం రచయిత పుల్లూరి జగదీశ్వర్ రావు పిల్లల కథా సంకలనం “చిలుక సాయం” ను పరిచయం చేస్తున్నారు వారాల ఆనంద్
“From your parents, you learn love and laughter and how to put one foot before the other. But when books are opened, you discover you have wings.” – Helen Hayes.
ఎంత గొప్ప మాట చెప్పారు. నిజమే ఈ రెక్కలొచ్చే అనుభవం అందరమూ చవి చూసిందే. నా వరకు నాకయితే బాల్యంలో మాటలు సరిగ్గా రాక మౌనమే ఆలంబనగా వున్న నాకు పాఠ్యపుస్తకాలకు తోడు కథలు, గొప్ప పాటలే కొత్త దారులు తెరిచాయి. సరికొత్త లోకాలని చూపించాయి. అయితే నాకు చదవడం గొప్ప పాటలు వినడం ఎప్పుడూ తప్పనిసరి వ్యవహారం కాలేదు. అదొక ఆనందమయిన పనిగా స్వేచ్చా వ్యవహారంగా సాగడంతో నా ఎదుగుదలలో చదవడం అంతర్భాగామైపోయింది.
‘జీవన రాగంలో మధురమయిన ఆలాపనే బాల్యం’ అని భావించే నేను ఆ ఆలాపన మధురమయిన రాగం కావాలంటే పిల్లల్లో చదివే తత్వం అలవాటు పెరగాలని కూడా అనుకుంటాను. భారతీయ సాహిత్య రంగంలో ఎందరో గొప్ప రచయితలు తమ సృజనాత్మక జీవితంలో కేవలం పిల్లలకోసం రచనలు చేసినవారున్నారు. పిల్లలకోసం గొప్ప సినిమాలు తీసిన వాళ్ళున్నారు. అంటే రచయితలు పెద్దల కోసమే కాకుండా పిల్లలకోసం ప్రత్యేక రచనలు చేయాల్సిన అవసరాన్ని వాళ్ళు అప్పుడే గుర్తించారన్న విషయం ఆశ్చర్యం కలిగిస్తుంది. టాగోర్, సత్యజిత్ రే, గుల్జార్ లాంటి ఎందరొ పిల్లలకోసం కథలు రాసారు సినిమాలు తీసారు. అయితే అవి పిల్లలకు నీతి బోధలు చేయడానికి మాత్రమే కాకుండా పిల్లల సంపూర్ణ వ్యక్తిత్వం వికసించే క్రమంలో వారి జీవితాల్లో అంతర్భాగంయి పోయే రచనలు చేసారు. అదే క్రమంలో తెలుగులో కూడా సంఖ్యాపరంగా కొంత తక్కువ సంఖ్యలోనే అయినా బాలసాహిత్య రంగంలో కృషి కొనసాగుతూనే వుంది. ఆ క్రమంలోనే మిత్రుడు పుల్లూరి జగదీశ్వర్ రావు తన రచనలు కొన సాగిస్తున్నాడు. ఇటీవలే ఆయన వెలువరించిన పిల్లల కథల సంకలం ‘చిలుక సాయం’ అందుకున్నాను.
పిల్లల్లో రీడింగ్ హాబిట్ పెరగాలని అనడమే కాకుండా వారికి అవసరమయిన అద్భుతమయిన కథల్ని రాసి అందిస్తున్న మిత్రుడు శ్రీ పుల్లూరి జగదీశ్వర్ రావు. పిల్లలు అందమయిన పువ్వులలాంటి వారని వారు కూడా పువ్వుల్లా అందంగా వికసించాలని భవిష్యత్తులో వారంతా విలువలతో జీవించాలని, విలువలు కలిగిన సమాజ నిర్మాణంలో భాగస్వాములు కావాలని నమ్మే జగదీశ్వర్ రావు పిల్లల కోసం ‘చిలుక సాయం’లో సరళమయిన అద్భుతమయిన కథల్ని అందించాడు. అవి కూడా కేవలం తెలుగులోనే కాకుండా తెలుగు ఇంగ్లిష్ రెండు భాషల్లో రాసి ద్విభాషా కథా సంకలనంగా తీసుకొచ్చాడు. ఆలవోకగా చదివించే సరళత ఈ కథల్లోవున్న ప్రధాన బలం. అంతే కాదు ఎంపిక చేసిన కథాంశాలు కూడా భారమయినవి కావు. పూలు పక్షులు జంతువులు వీటిల్లో ప్రధాన పాత్రలు. వాటి ద్వారానే నైతిక విలువల్ని, శాస్త్రీయ ఆలోచనల్ని ప్రోది చేయడం రచయితకున్న స్పష్టతను, రచనా ప్రతిభను సూచిస్తుంది.
గతంలోనే జగదీశ్వర్ రావు తన ‘లిటిల్స్’ కథా సంపుటితో మళ్ళీ మళ్ళీ చదివించే కథల్ని అందించాడు. అదికూడా తెలుగు ఆంగ్ల భాషల్లో ద్విభాషా సంకలనంగా వెలువడింది. మంచి సమీక్షలని ప్రశంసల్నీ అందుకుంది. ఇక ప్రస్తుత ‘చిలుక సాయం’ సంకలనంలో చిలుక సాయంతో పాటు జల కాలుష్యం, మర్రి చెట్టు , కుందేలు చెవులు, సహజీవనం, అసూయ వద్దు లాంటి కథలు పిల్లల్ని పెద్దల్ని ఆకట్టుకునేవిగా వున్నాయి.
ఇట్లా ఉభయ భాషల్లో చేయి తిరిగిన జగదీశ్వర్ రావు పెద్దపల్లి జిల్లా జూలపల్లి మండలంలోని వడుకాపూర్ గ్రామంలో జన్మించారు. ఉన్నత విద్యను అభ్యసించిన జగదీశ్ గతంలో ఉపాధ్యాయుడిగా పనిచేసారు. ప్రస్తుతం రామగిరిలో మండలస్థాయి అధికారిగా వున్నారు. అంతే కాదు అనేక తెలుగు ఆంగ్ల పత్రికల్లో విస్తృతంగా రచనలుచేసారు. ఇక ముందు కూడా పిల్లకోసం మరిన్ని రచనలు చేయాలని కోరుకుంటూనే సృజన కారుడిగా పెద్దల కోసం కూడా తాను రాయగలిగిన కథలు రాయాలని కోరుకుంటున్నాను
మంచి పిల్లల కథల పుస్తకాన్ని అందించిన మిత్రుడిని మనసారా అభినందిస్తున్నాను.
ప్రతులకు :
పుల్లూరి జగదీశ్వర్ రావు, 9-4-460/3, సప్తగిరి కాలనీ, కరీంనగర్ Sapthagiri - 505001. (సెల్: 9441538797).