అవధుల్లేని ప్రాధాన్యం ఆధార్ తో ఉన్నత స్థానం ప్రభుత్వ పత్రాల్లోనూ అగ్ర తాంబూలం అంటూ వి.నాగజ్యోతి రాసిన కవిత ' వేలిముద్ర ' ఇక్కడ చదవండి :
ఆస్తుల కొనుగోళ్లూ
అమ్మకాల పత్రాల
నిండా అక్షరాలున్నా
వేలిగుర్తు లేకుంటే
వేస్తాయి తెల్లమొఖం
అహంకారంతో
ఆస్తులాక్రమిస్తే
అడ్డుగోడయ్యేది వేలిముద్రే
దొంగతనం చేసి
దొరలా తిరిగినా
వేలిముద్రలే
సాక్షాలుగా మారుతాయ్
కటకటాల్ని కేరాఫ్ అడ్రస్ చేస్తాయ్
రక్తసంబంధం ఉన్నా
వేలిముద్రలో మాత్రం
ఎవరికి వారే
యమునాతీరే
అన్నిటికీ ఆధారం
రాతకోతలకూ మూలం
ఏకలవ్యుని గురుదక్షిణ
అవధుల్లేని ప్రాధాన్యం
ఆధార్ తో ఉన్నత స్థానం
ప్రభుత్వ పత్రాల్లోనూ
అగ్ర తాంబూలం