డా॥ కొండపల్లి నీహారిణి కవిత : కడుపు తీపి

By Arun Kumar P  |  First Published Jun 25, 2023, 1:00 PM IST

ఎడతెగని నేటి పోటీల్లో కన్న ప్రేమ మాధుర్యమొక్కటే ప్రథమ బహుమతి గెలుచుకుంటుందంటూ  డా॥ కొండపల్లి నీహారిణి రాసిన కవిత  ' కడుపు తీపి ' ఇక్కడ చదవండి : 


ఎడతెగని తండ్లాటల చిత్రాలకు   
చూపు దారాలు కడదాం రండి
అక్కడేమీ తపనల మేళాలు వినిపించవు 
అక్కడ
మీ తడిసిన హృదయం 
కుప్పల మెప్పుల మోతలెత్తాల్సినంత పనేం లేదు 
కూలిపని ఇలా పచ్చని చెట్టుగూళ్ళకు బతుకు నెలవు 
ఆకలితీరే పిచ్చుక పిల్లల కువకువ పరవశమె 

మబ్బు కళ్లద్దాల నుండి డేగ కన్ను ఒకటి వీక్షిస్తుంటది 
ఏ కోడినీ కోడి పిల్లను దాటేసుకోదు
అయినా తల్లి కోడి తనను 
తన పిల్లలనూ కాపాడుకుంటూ 
బతుకుపని పాట పాడుకుంటూ  నిత్యశ్రమ గాయనిగా 
బిడ్డలను రెక్కల క్రింద చేర్చుకుంటుంది

Latest Videos

undefined

తట్టల కెత్తుకోగలిగే 
ఇటుకల పంట అనురాగ గాథగా
మన ఇంటి గోడలవుతాయి

పొదుగు పొదుగు ఇదే చెప్తుంది
లేగ పరుగులో తోక ఆడినట్టు
కోన కోనల్లో కూనల సజీవత సమన్వయమౌతుంది

లేత పిందెల పనులూ కోరే  చేతలకేమెరుక
అక్కడో బక్కజీవి తండ్లాట  బంతాటలాటలాడుతుంటాయి 

హృదయంలో బడబాగ్నులు చెలరేగకున్నా
రెండు కన్నీటి చుక్కలు నిత్య నక్షత్రాలను పూస్తూనే ఉంటాయి 

తల్లి తపనల తమోన్నతత అంతా 
ఊసుల ఊయలలవుతున్న  సుందర దృశ్య మాలికలో పువ్వులన్నీ చూపులే అయినప్పుడు
శూన్యం నుండి సురలోకపు కబుర్ల వరకు 
వెన్నెల నిచ్చెనలు వేసినట్టు
ఇక్కడో అమ్మ బొమ్మై మనను అట్లా అచేతన స్థితిలో పడవేస్తుంది

పేదతనం పొట్టకి గాని పసిపాపల  పాలనకు కాదని 
ఒకానొక పంక్తిని  సహృదయుల గుండె గట్టు మీద   
పరుగు పందేరానికి జత కట్టిస్తుంది

ఎడతెగని నేటి పోటీల్లో 
కన్న ప్రేమ మాధుర్యమొక్కటే 
ప్రథమ బహుమతి 
గెలుచుకుంటుందని 
ఢంకా బజాయించి చెప్తున్నాను
 

click me!