నిన్న రాత్రి 'నవాబ్ షా ఆలం ఖాన్ స్మారక జాతీయ ఉర్దూ ముషాయిరా' జరిగింది. కాగా, దేవులపల్లి కృష్ణమూర్తి గారికి 82 సంవత్సరాలు నిండిన సందర్భంగా జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక 'బతుకుపుస్తకం' అభినందన సంచిక ఆవిష్కరణ సభను నిర్వహిస్తోంది.
హైదరాబాద్ లోని ప్రతిష్టాత్మక అన్వర్ ఉల్ ఉలూమ్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహణలో నిన్న రాత్రి 'నవాబ్ షా ఆలం ఖాన్ స్మారక జాతీయ ఉర్దూ ముషాయిరా' జరిగింది. కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఎడ్యుకేషన్ సొసైటీ చైర్మన్ నవాబ్ మహబూబ్ ఆలం ఖాన్ ఈ ముషాయిరాలు నిర్వహించడం ద్వారా ఉర్దూ భాష ఔన్నత్యాన్ని, అందులోని సాహిత్య పరిమళాన్ని లోకానికి చాటిచెప్పడం ఉద్దేశ్యమని అన్నారు. ఉర్దూ షాయరీ ప్రపంచ వ్యాపితంగా ఎంతటి ప్రాచుర్యంలో ఉందో వివరించారు. మొయిషాదా స్వాగతోపన్యాసం ఇస్తూ ఉర్దూ భాష గొప్పతనాన్ని, అది సమాజానికి అందించిన విలువైన సాహిత్యం గురించి వివరించారు.
ఈ ముషాయిరాల వరసలో ఇది ఐదవది. పేరెన్నికగన్న ఉర్దూ కవిత్వానికి సంబంధించిన జాతీయ కవులు లతా హయ, మన్జర్ భోపాలి, ఇక్బాల్ అషహర్, షైక్ అజ్మి, ముక్తార్ యూసుఫ్, సునిల్ కుమార్ తంగ్, అజమ్ షకిరి, మషర్ అఫ్రిది, కుష్బూ శర్మ, నదీమ్ షాద్, మొయిన్ షాదాబ్, శబ్నం అలీ, ఫరూఖ్ షకీల్, సర్దార్ సలీం, కౌకబ్ జకి ఇందులో పాల్గొని తమ షాయరీ వినిపించారు. సుమారు తొమ్మిది గంటలకు మొదలైన ఈ కార్యక్రమం రాత్రి రెండు గంటలవరకూ సాగింది. నాలుగు వేలమందికి పైగా కవితాప్రియులు పాల్గొన్న ఈ కార్యక్రమం వారి స్పందనలతో, కేరింతలతో అద్భుతంగా సాగింది.
ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యాశాఖ కమీషనర్ నవీన్ మిట్టల్, ఇంటర్మీడియట్ కమీషనర్ ఉమర్ జలీల్, వికారాబాద్ ఎస్. పి. నారాయణ , నగర ప్రముఖులు పాల్గొన్నారు.
"బతుకు పుస్తకం " ఆవిష్కరణ
ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి గారికి 82 సంవత్సరాలు నిండిన సందర్భంగా జయమిత్ర సాహిత్య సాంస్కృతిక వేదిక 'బతుకుపుస్తకం' అభినందన సంచిక ఆవిష్కరణ సభను నిర్వహిస్తోంది. అంతర్జాల వేదికలో ఈ నెల 28 వ తేదీ సోమవారం సాయంత్రం ఆరున్నరకు జరిగే ఈ సభకు వేదిక అధ్యక్షులు ఆచార్య జి.చెన్నకేశవరెడ్డి అధ్యక్షత వహిస్తారు. ప్రముఖ రచయిత, కాళోజీ తొలి పురస్కార గ్రహీత డా.అమ్మంగి వేణుగోపాల్ సభకు స్వాగతం పలుకుతారు. ప్రముఖ కవి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా అదనపు కలెక్టరు డా. ఏనుగు నరసింహారెడ్డి గ్రంథాన్ని ఆవిష్కరిస్తారు. హైదరాబాదు కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన ఆచార్య పిల్లలమర్రి రాములు ముఖ్యఅతిథి గా పాల్గొంటారు. డా. రాయారావు సూర్యప్రకాశ్ రావు, డా. వి. జయప్రకాశ్ సభను నిర్వహిస్తారు.
ప్రముఖ రచయితలు డా. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి, సంగిశెట్టి శ్రీనివాస్, కె. పి. అశోక్ కుమార్, డా. తిరునగరి దేవకీదేవి, ఆడెపు లక్ష్మీపతి, బి. నర్సన్, డా. వెల్డండి శ్రీధర్, కాసుల ప్రతాప్ రెడ్డి, డా. బెల్లంకొండ సంపత్ కుమార్, డా. నోముల రాహుల్, నర్సిం, డా. కె. నాగేశ్వరాచారి, అందోజు పరమాత్మ, డా. సిహెచ్. ఆంజనేయులు గౌరవ అతిథులుగా హాజరవుతారు. ప్రముఖ రచయిత దేవులపల్లి కృష్ణమూర్తి ప్రతిస్పందిస్తారు.
జూమ్ మాధ్యమంలో 281 858 9873 ఐడిని, 223344 పాస్ కోడును ఉపయోగించి ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా నిర్వాహకులు కోరుతున్నారు.