దాసరాజు రామారావు కవిత : యుద్ధానికి హృదయముంటుందా••

By Pratap Reddy KasulaFirst Published Mar 24, 2022, 8:56 AM IST
Highlights

మనిషంటే ఒక నమ్మిక ఒక వేడుక ఒక  విలువ ఒక  నిలువ మరి హృదయం లేని యుద్ధం మనిషిని ఏం చేస్తుంది !? దాసరాజు రామారావు కవిత  "యుద్ధానికి హృదయముంటుందా••" లో చదవండి.

యుద్ధానికి ఆయుధం అవసరముంటుంది
ఆయుధానికి కర్కశత్వం అవసరముంటుంది 
రక్తాన్ని వొంటికి పూసుకొని నర్తించే గుణముంటుంది
ప్రయోగించిన తర్వాత  అది చేతిలో వుండనంటుంది
మనసు లేని ఆయుధాన్ని  మనసు వుండాల్సిన మనిషి  ప్రయోగించడమే యుద్ధ నీతి యిప్పుడు 

                                *
మనిషి పువ్వునో,  పాటనో ప్రేమించినట్లు మనిషిని ప్రేమించాలి గద మరి
బదులిచ్చే, చేతుల్జాపే మనిషి పక్కన మనిషి ఓలలాడడేమిటి?
తెలి తెలి నవ్వుల గంగా పొంగులై పోవడేమిటి?
ఆకాశంలో మబ్బుల దారుల వెంట పక్షుల గుంపులా 
నేలన మట్టి నంటి నడిచే మనుషుల సమూహం ఎక్కడనీ?
చూపుల్లోంచి చూపులు చూపుల్లోకి దూకినప్పుడు అగ్ని పర్వతాలు పేలుతున్నయే
మాటల్లోంచి మాటలు మౌనాల్ని వెలిగిస్తున్నప్పుడు తుఫానులు చెలరేగుతున్నయే

                              *

మనిషంటే కన్నీటి బిందువుల అనంత కారుణ్యాంబుధి 
మనిషంటే  చిరుజల్లులా కురిసి, హరివిల్లులా విరిసి, ఏకైక తెల్లరంగులా హసించే నిష్కల్మషి
మనిషంటే  మెట్టు మెట్టుగా, అడుగు అడుగుగా అధిరోహించే శిఖర సాహసి
మనిషంటే ఒక నమ్మిక ఒక వేడుక ఒక  విలువ ఒక  నిలువ
మనిషి వినా మనిషి ఊహించలేం
మనిషి మారణం  మనిషికే చేటు

                             *

చేతులెత్తేద్దామా 
నీతులు ఒంపి ఒంపి నూతుల లోతుల్లో దాగుందామా 
ఊహాగానాలు చేస్తూ  భ్రమావరణంలో గిరగిరల భ్రమరంలా స్వీయ తృప్తతలో తిరిగేద్దామా
అపోహల అపనమ్మకాల మౌఢ్యభావనల స్వలాభాస్వభావాల 
అనౌచిత్య రగడల మంటలు రగిలిద్దామా

                     •••

మనిషిలోంచి ఆయుధం
ఆయుధంలోంచి యుద్ధం
మరి ఎవరు విరిచేస్తరు?
ఆ యుద్ధం ఎవరు చేస్తరు?

click me!