పుస్తక సమీక్ష : "అరుగు" చెప్పిన కొత్త ముచ్చట్లు

By Pratap Reddy Kasula  |  First Published Mar 24, 2022, 9:32 AM IST

వాషింగ్టన్ డిసి నుండి నక్షత్రం వేణుగోపాల్ వెలువరించిన కథా సంపుటి "అరుగు" పై రావిరూకల నుండి ఎన్.నరేశ్ చారి చేసిన ఆసక్తికరమైన సమీక్షను ఇక్కడ చదవండి.


ప్రముఖ కథారచయిత నక్షత్రం వేణుగోపాల్ గారి పరిచయం నాకు ప్రతీ సోమవారం ఆన్లైన్లో జరిగే కవి సమ్మేళనంలో కలిగింది.  అమెరికాలో స్థిరపడిన తను మొన్ననే ఇండియాకు వచ్చారు.  ప్రముఖ కవి కందుకూరి శ్రీరాములు  గారిని పరామర్శించడానికి  మా ఊళ్ళోకి వచ్చిన తనను నేను కలుసుకోవడం, "అరుగు" కథా సంపుటి నాకు ఇవ్వడం యాదృచ్చికంగా జరిగిపోయాయి.

తన కథా సంపుటి నా చేతిలో పడగానే 20 సంవత్సరాల నుండి అమెరికాలో ఉంటున్న ఈ రచయిత ఎలాంటి కథలను రచించాడోననే ఉత్సుకత నాలో బయలుదేరింది. అదే ఉత్సాహంతో త్వరగా చదివేశాను.

Latest Videos

ఈ కథా సంపుటిలో మొత్తం పదకొండు కథలున్నాయి అందులో కొన్ని భారతీయ, ముఖ్యంగా తెలంగాణ గ్రామీణ వాతావరణాన్ని చిత్రీకరిస్తే, మరికొన్ని కథలు అమెరికా వాతావరణాన్ని చిత్రించాయి.  దేనికవే వస్తువైవిధ్యం కలిగిన కథలు ఇవి.

ఇక కథల్లోకి వెళితే...విలాసాలకు అలవాటుపడి ఇచ్చిన స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తూ తమ జీవితాల్ని నాశనం చేసుకున్న యువత గురించి తెలిపే కథ "రేస్".  ప్రస్తుతం పట్టణాల్లో యువత బైక్ రేసింగ్ పేరిట ప్రాణాలు పోగొట్టుకుంటున్న తీరును చూపిందీకథ.  ఇదే కథలో తల్లిదండ్రులు తమ ఇష్టాయిష్టాలను బలవంతంగా పిల్లలపై రుద్దితే వాళ్లు పడే మానసిక సంఘర్షణ, అంతేకాక అడిగినవన్నీ వాళ్లకు అవసరం ఉన్నా లేకపోయినా కోనిస్తే వాళ్లు ఎలాంటి జీవితానికి అలవాటుపడి తమ జీవితాలను దుర్భరం చేసుకుంటారో తెలిపింది. ఈ కథ పట్టణ వాతావరణాన్ని, ధనికుల ఇళ్ళల్లోని పిల్లల విలాస జీవితాన్ని , సంస్కృతిని చూపుతూనే యువతకు మితిమీరిన స్వేచ్ఛ ఇచ్చిన తల్లిదండ్రులకు కనువిప్పునూ కలిగిస్తుంది.
 
ఈ కథాసంపుటానికే మకుటాయమానమైన కథ "అరుగు".  ఇది  పట్టణంలో స్థిరపడ్డ కొడుకు దగ్గర ఉంటూ, అందరు ఉన్నా ఒంటరి జీవితాన్ని అనుభవిస్తూ, తన ఊరి జ్ఞాపకాలను నెమరువేసుకుంటూ జీవించే వృద్ధురాలు రత్నమ్మ కథ.  ఈ కథలో తెలంగాణ సాయుధ పోరాటం నాటి దుర్భర పరిస్థితులు రత్నమ్మ భర్త పరిచయం ద్వారా రచయిత వెల్లడించాడు. చదువుతున్నంతసేపు మనం రజాకార్ల కాలానికి వెళ్ళిపోతాం. అంతేకాకుండా పల్లెల్లో ఉండే అనుబంధాలు, ఆహ్లాదకరమైన వాతావరణం, స్వచ్ఛమైన ప్రేమను రుచిచూస్తాం.  రత్నమ్మ అనారోగ్యంగా ఉన్నప్పుడు ఏ ఆస్పత్రికి వెళ్లినా తగ్గదు. ఆమె మనసంతా తన పల్లె చుట్టూ తిరుగుతుంది. చివరకు తన కొడుకులు తనని తమ గ్రామానికి తీసుకువెళ్తారు.  అలా వెళ్లారో లేదో ఇరుగుపొరుగు మొత్తం అందరూ రత్నమ్మను పలకరిస్తారు. రత్నమ్మ మనసు తేలిక పడుతుంది. మనసుకు సంబంధించిన రుగ్మతలు మనసు ప్రశాంతంగా ఉన్నప్పుడే పోతాయి. అది రత్నమ్మ వి‌షయంలో  తెలిసిపోయింది. తన భర్త చెప్పిన మాటల్ని గుర్తుంచుకొని తను ఇంకెవ్వరికీ  బరువు కాకూడదని ఆక్సిజన్ పైపుని తొలగించుకుంది.  ఇలాంటి రత్నమ్మలు మనకు నిత్యం తారసపడుతుంటారు. నిజానికి వృద్ధులు మానసికంగా ప్రశాంతంగా ఉండగలిగేది వాళ్లు పుట్టి పెరిగిన సొంత ఊరిలోనే,తమను ఆప్యాయంగా పలకరించే మనుషుల మధ్యే.

మనిషి ఉన్నదానితో తృప్తిపడక అందని దానికోసం ఆశపడి భంగపడతాడని చెప్తూనే సమాజంలో వివిధ రుగ్మతలను ఎత్తి చూపిన కథ "ఎక్కడ పుడతావ్?"
కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో  మొదటిసారిగా మనదేశంలో 2020 మార్చి 24న దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించారు.  ఇది కొద్ది రోజుల వరకు బాగానే ఉంది. తర్వాత కాలంలో దాని ప్రభావం మెల్లి మెల్లిగా అందరిపైనా చూపింది.  దీని ప్రభావం ప్రధానంగా వలస కార్మికుల పైన అధికంగా పడింది. బతుకుదెరువు కోసం ప్రాంతం మారిన వలస కార్మికులు లాక్ డౌన్ విధించడంతో వాళ్ల సొంత ఊళ్లకు వెళ్లడానికి నానా అవస్థలు పడ్డారు. చాలా మంది కొన్ని వందల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్లారు.  మానవత్వం కలిగిన కొందరు వారికి దారి పొడుగునా తోచిన సహాయం చేశారు.  అప్పటి పరిస్థితిని మనకు కళ్ళకు కట్టినట్టు ఒక డాక్యుమెంటరీలా చూపిన కథ "ఒంటికి రెండు-రెంటికి ఒకటి".   ఇది ఆర్థికంగా చితికిపోయిన వలస కార్మికుల కథ.  ఇందులో అప్పటి గడ్డు పరిస్థితులను వివరిస్తూనే ఏ ప్రాంతం వారైనా సరే మంచితనంతో స్నేహితులు కావచ్చు అనే విషయాన్ని కూడా చక్కగా తెలిపారు.  అంతే కాకుండా మనదేశంలో టాయిలెట్ల సౌకర్యం లేని దయనీయ పరిస్థితులను కళ్లకు కట్టినట్లు చూపించారు.

ఆదాయానికి మించిన ఖర్చు గల విలాసవంతమైన జీవితం కోరుకుంటే కలిగే నష్టాలు ఏమిటో చెప్పిన కథ    " ధీమా ".   ఈ కథ అమెరికాలో నివసిస్తున్న భారతీయుల కథ.  ప్రాంతం ఏదైనా సరే ఆదాయానికి మించి ఖర్చు చేస్తే మానసిక ఒత్తిడితో ప్రాణం కూడా పోతుందని అందరి కళ్లు తెరిపించిన కథ ఇది.   ఇందులోని పాత్రలు అనురాధ-ప్రశాంత్ , గీత-కిరణ్.   వీళ్లు భార్యాభర్తలు. నైబర్ హుడ్స్ కూడా.  ఇందులో  కిరణ్ విలాసవంతమైన ఇల్లు తీసుకోవాలని రాత్రి,పగలు కష్టపడతాడు.  డబ్బు మొత్తం భవిష్యత్తు ఆలోచన లేకుండా ఇల్లుపైనే ఖర్చు పెడతాడు.  దాంతో ఒకరోజు మానసికపరమైన ఒత్తిడికి గురై గుండెపోటుతో మరణిస్తాడు.  కథ మొదట్లో మనం కూడా కిరణ్ వాళ్ళ ఇల్లు లాంటి ఇల్లు తీసుకోవాలని  పోరుపెట్టిన అనురాధ కిరణ్ మరణంతో పరివర్తన చెందుతుంది.  భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఖర్చు చేయకపోతే దాని పరిణామాలు మన పైనే కాకుండా మన ముందు తరాలపై కూడా పడుతుందని రచయిత హెచ్చరిస్తాడు.  "ఫండ్ రేజర్" అనేది అమెరికాలోని భారతీయులు తమకుతాము చేసుకునే సాయమని నాకు ఈ కథ ద్వారానే తెలిసింది.

వైవాహిక సంబంధాలను కూడా ఆర్థికపరమైన అంశాలతో ముడిపెట్టి తమ స్వలాభం కోసం తనను నమ్మివచ్చిన జీవిత భాగస్వామిని కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారని చెప్పిన కథ 'నయా' వంచన.  ఇందులో గ్రీన్ కార్డ్ త్వరగా వస్తుందని అమెరికా అమ్మాయి  క్రిస్టినాను వివాహం చేసుకుంటాడు అవినాష్.  తర్వాత కాలంలో క్రిస్టినాకు అసలు విషయం అర్థమై తనలో తాను కుమిలిపోతుంది. కానీ ఆమె అందరమ్మాయిల్లా ఊరుకోలేదు.   తను  ఎలాగైనా ఇండియాకి వెళ్లి తన మామను నిలదీయాలని బయల్దేరడంతో ఈ కథ ముగుస్తుంది.  నిజానికి ఈ కథ ఇంకా పొడిగిస్తే బాగుండేదనిపిస్తుంది.  కానీ స్త్రీలలో కూడా చైతన్యం వచ్చింది అనే విషయాన్ని తెలపడమే రచయిత ప్రధాన ఉద్దేశమై ఉంటుంది.  ఇదులోని కథా,కథనం మనల్ని భావోద్వేగానికి గురిచేస్తుంది.  గొప్ప సంస్కృతికి పుట్టిల్లుగా పేరొందిన మన దేశం నుండి వెళ్లి తన స్వార్థం కోసం మోసం చేయడం మనకి చాలా బాధనిపిస్తుంది.

అమెరికాలో ఉండే తెలుగు వాళ్లకి తానా సభలు పెద్ద పండుగ.   ఎందుకంటే ఇక్కడ ఉన్న తెలుగు వాళ్ళు అందరూ ఒకచోట చేరి జ్ఞాపకాల్ని పంచుకుంటారు. దూరమైన మిత్రులు కూడా కలుసుకుంటారు.  అలా కలుసుకున్న ఇద్దరు మిత్రుల కథే "ఫ్రెండ్".  బహుశా ఇది రచయిత అనుభవం కావచ్చు ఇందులో ప్రధాన పాత్రలు అవినాష్, విక్రమ్ వీళ్లిద్దరూ ఒకే దగ్గర కెరియర్ ప్రారంభించినా విక్రమ్ ముందుగా అమెరికా వచ్చి జాబ్ చేస్తాడు.  తర్వాత కాలంలో  అవినాష్ వెళ్తాడు.   అక్కడ రెండునెలలు జాబ్ చేస్తాడు.  కానీ, డబ్బు సమయానికి అందదు.  దాంతో ఎంతో ఇబ్బందికి గురవుతాడు అవినాష్ .  తన పరిస్థితిని విక్రమ్ కు చెప్పి కొంత డబ్బు అప్పు అడుగుతాడు.  విక్రమ్ సహాయం చేయకపోగా సరైన సమాధానం కూడా ఇవ్వకుండా తప్పించుకుంటాడు. ఆ గడ్డు కాలంలో ఏం చేయాలో తోచదు.  విక్రమ్ ఎందుకలా ప్రవర్తిస్తున్నాడో  అవినాష్ కు అర్థం కాదు. ఓవైపు తన భార్య అమెరికా రావడానికి గడువు దగ్గరకొస్తుంది.  కానీ సమయానికి  చిల్లిగవ్వ కూడా చేతిలో ఉండదు. ఆ సమయంలో ఊహించనివిధంగా అవినాష్ యొక్క కాంట్రాక్టు పొడగించబడుతుంది. దానిపై సంతకం చేయగానే రెండు నెలల జీతం అడ్వాన్స్ గా వస్తుంది.  దాంతో  ఊపిరి పీల్చుకుంటాడు అవినాష్.  ఇది జరిగిన కొన్ని సంవత్సరాలకు తానా సభల్లో విక్రమ్ ను చూస్తాడు అవినాష్. ఆ సభలో అద్భుతమైన ప్రసంగం ఇద్దరూ వింటారు.  సభ అనంతరం  అవినాష్ భుజం పైన వెనక నుండి ఒకరు చేయివేస్తారు.  ఎవరని చూస్తే విక్రమ్. విక్రమ్ అవినాష్ ను చూసి మొదటగా సారీ చెప్తాడు.  ఒక రోజు ప్రసంగం  తన మిత్రునిలో మార్పు తీసుకువచ్చినందుకు సంతోషపడతాడు అవినాష్.  ఈ కథ చదువుతున్నంతసేపు మనం అమెరికాలో ఉన్నట్టుగానే అనిపిస్తుంది.

అప్పటివరకు కొనసాగుతున్న చాందస ఆచారాలను పక్కకునెట్టి, అందరినీ ఎదిరించి తన తండ్రి చివరి కోరిక(తలకొరివి పెట్టడం)ను నెరవేర్చిన కథే " బిడ్డా...నువ్వుగెలవాలి".   ఇందులో  ప్రధాన పాత్రధారులు నారాయణ, తన పెద్ద కూతురు కవిత.  నారాయణ తన ఇద్దరు కూతుళ్లను కష్టపడి చదివిస్తాడు. వాళ్లు కూడా తమ తండ్రి పేరు నిలబెట్టేలా ఉద్యోగాలు సంపాదిస్తారు. అవసాన దశలో నారాయణ తన పెద్ద కూతురైన కవిత వద్ద "నా తల కొరివి నువ్వే పెట్టాలి బిడ్డా" అని మాట తీసుకుంటాడు.  కొంతకాలం తర్వాత అనారోగ్యంతో బాధపడతాడు నారాయణ.  తన తండ్రి సమయానికి ఆక్సిజన్ అందక మరణిస్తాడు.  అప్పుడు కవిత తన తండ్రి కోరికను నెరవేర్చడానికి ముందుకు వస్తుంది.  కానీ అక్కడున్న కుల పెద్దలు తాతగారి బంధువులు ఎవరూ కవిత తలకొరివి పెట్టడానికి ఒప్పుకోరు.   దాంతో కవిత తన తండ్రి తమకోసం పడ్డ కష్టమెంతో చెప్పి ఆడవాళ్ళకు కూడా సమాన హక్కులుంటాయనే విషయం గుర్తుచేస్తుంది.  చివర్లో తనమాటలతో అందరికీ కనువిప్పు కలిగించి తన తండ్రి చివరి కోరికను నెరవేరుస్తుంది.  ఈ కథలో కరోనా సమయంలో ఆస్పత్రుల యొక్క దయనీయ పరిస్థితులను తెలపడంద్వారా మనం కూడా ఈ కథలో భాగమవుతాం.

మనుషుల్లో ఇంకా మానవత్వం, భూతదయ ఉంది అని చెప్పే కథ "మన నరకమే మనకు స్వర్గం".  ఈ కథా సంపుటిలోని కథలన్నీ అద్భుతమైన శిల్పంతో పరిస్థితులను మనకు దృశ్యమానం చేస్తాయి.   అలాగే మనిషిలోని సున్నితత్వాన్ని కూడా తట్టి లేపుతాయి.  గత కాలాన్ని దర్శింప జేస్తాయి.  కొన్ని అమెరికాకు తీసుకెళతాయి.  ఇవి అందరూ చదవదగ్గ కథలు.

click me!