రష్యా, ఉక్రెయిన్ యుద్ద నేపధ్యంలో వచ్చిన రెండు కవితలను ఇక్కడ చదవండి
అవనిశ్రీ కవిత : విషాదగీతం
యుద్దాన్ని స్వప్నించడం
మూర్ఖుల కలలోనే సాధ్యమౌతుంది.
ఆ విషాద స్వప్నంలో
కట్టుకున్న అద్దాల కలలమేడలు
కుప్పకూలిపోతాయి
నగరాలకు నగరాలు
రాత్రికిరాత్రే కనుమరుగైపోతాయి
దారులంత నిశ్శబ్దంతో నిద్రపోతుంటాయి
యేరులంత రక్తంతో పారుతుంటాయి
అమ్మ ఒడిలో నిద్రబోతున్న పసిబిడ్డకు
తూటా తగిలి శాశ్వతంగా నిద్రిస్తుంది
సాయంత్రానికి ప్రజలతో కళకళలాడే బజార్లు
శవాల గుట్టలతో కాలిపోతుంటాయి
తల్లిదండ్రులు కాలమైపోతే
ఓ పసిబిడ్డ
గడ్డితింటున్న దయనీయ దృశ్యాలు
కండ్లకు కన్నీళ్ళు తెప్పిస్తాయి
వాగు పక్కన సగంకాలిన యాజమాని దేహాన్ని
కుక్క పీక్కు తింటున్న
ఆకలి చిత్రం కనిపిస్తుంది
వందలేండ్లపాటు నిర్మించుకున్న పునాదులు
వేలయేండ్లనాటి చారిత్రక కాయిదాలు
బూడిదలో భగ్గుభగ్గున మండిపోతుంటాయి
ఏడేడు తరాలనాటి వారసత్వం
ఎన్నో జాతుల సాంస్కృతిక సంపద
మూలాలు ముల్లెలు భాషలు యాసలు
యుద్దం మంటలకు పరిసమాప్తం
యుద్దం ఈ నేలపై ఎక్కడ జరిగిన
విషాదగీతమే దాని రూపాంతరం.
కందాళై రాఘవాచార్య కవిత : పిచ్చివాడి యుద్ధ వాజ్ఞ్మూలం??
యుద్ధం మొదలైనాక
రెండు దేశాల అధ్యక్షులు
ప్రజల నుండి తోవ మరిచి
తమ్ము తాము మరిచి తప్పిపోయినట్లే
దేశంలో ఉన్న లేనట్లే దాక్కున్నట్లే!
సైనికులూ భార్య పిల్లల నుండి
సొంతురు నుండి సరిహద్దుల నుండి
దిక్సూచికి అందకుండా తప్పిపోయినట్లే
ఆయుధాలైతే అంధత్వంతో
జనావాసాలపై పడి
పాడుపడి పోతాయో ఎందరి పాలిటి గండాలో !
తప్పిపోతే అంతే మరి !
స్మశానం మాత్రం ఎక్కడికీ తప్పిపోకుండా ఉన్న చోటనే ఉండి
ఇంకా ఇంకా వృద్ధిక్రమమే
విజయం సాధించినట్లు ఏదో ఒక
దేశం జెండా ఎగరేయవచ్చు
కాని అది శవాల మీద పాతిన
అనవత పతాకమే పాతకమే
ఏమంది ! యుద్ధ వాజ్ఞ్మూలం !
పిచ్చివాడి లెక్క- అంతా తీసివేత
చరిత్ర క్షమించదు - క్షమ భిక్ష ఎవరికి ?