స్వేచ్ఛ కోసం పలవరిస్తున్న మరం అల్ మస్రీ కవిత్వం

By Pratap Reddy KasulaFirst Published Mar 14, 2022, 10:27 AM IST
Highlights

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం   మరం అల్ మస్రీ – సిరియన్ కవి -  కవిత్వం అందిస్తున్నారు వారాల ఆనంద్.

ఇన్ని రోజులుగా అనేక పుస్తకాలు అందుకున్నాను. అనేక మంది కవుల్నీ రచయితల్నీ అందుకుని అక్కున చేర్చుకున్నాను. పలకరించాను, పలవరించాను. ఇక ఇప్పుడు ఆయా కవులను మాత్రమే కాకుండా జాతీయ, అంతర్జాతీయ కవుల కవితల్ని అందుకుని వారి కవితాత్మని, స్పూర్తిని పంచుకుందామని ప్రయత్నం. వారి వారి క్లుప్త పరిచయ వాక్యాలతో పాటు కొన్ని కవితల్ని అనువదించి అందించాలని, నేనుందుకున్న భావ చైతన్యాన్ని పంచుకుందామని ఈ “అందుకున్నాను”

మొదటగా మరం అల్ మస్రీ.  పారిస్ లో నివసిస్తున్న సిరియన్ కవి. ఆమె తన తరానికి చెందిన గొప్ప స్త్రీ వాద కవయిత్రి.  ఆమె కవిత్వం సరళంగానూ సున్నితంగా సాగుతుంది. అత్యంత సాధారణ ప్రతీకలతో తాను చెప్పదలుచుకున్న భావాన్ని ప్రభావవంతంగా చెప్పడం ఆమె కవిత్వ సరళి.  దాంతో ఆమె రాసిన కవిత్వానికి ప్రపంచ వ్యాప్తంగా విశేషమయిన ఆదరణ లభించింది.  

‘లతాకి’ నగరంలో జన్మించిన మారం అల్ మస్రీ డమాస్కస్ లో ఆంగ్ల సాహిత్యం చదువుకుని పారిస్ లో స్థిరపడ్డారు.  చాలా చిన్నతనం నుండే కవిత్వం రాయడం ఆరంభించారు.  ఆమె ‘ఐ అల్టర్డ్ యు విత్ అ వయిట్ డోవ్’ అన్న సంకలనంతో 1984 లో అందరి దృష్టినీ ఆకర్షించారు.  తర్వాత ‘ఎ రెడ్ చెర్రీ ఆన్ ఎ వయిట్ ఫ్లోర్’ సంకలనంతో విశేష ప్రాచుర్యాన్ని పొందారు.  తర్వాత ‘ఐ లుక్ ఎట్ యు,’  ‘వల్లడా’స్ రిటర్న్’,  ‘ఫ్రీడం' , షి కంస్ నేకెడ్’, ‘ది అబ్డక్షన్’ లాంటి పుస్తకాలతో ప్రపంచ వ్యాప్త పేరు ప్రతిష్టల్ని అందుకున్నారు.  ఆమె కవితలు అరబ్ మరియు అనేక అంతర్జాతీయ కవిత్వ జర్నల్స్ లో ప్రచురితమయ్యాయి. యూరోప్, ఆసియా, ఆఫ్రికా, లాటిన్ అమెరికా లాంటి అనేక చోట్ల జరిగిన కవిత్వోత్సవాల్లో ఆమె పాల్గొన్నారు.  మారం ఫ్రెంచ్ లోనూ రాసారు.  తన కవిత్వం ఫ్రెంచ్, ఇటాలియన్, స్పానిష్, ఇంగ్లిష్, గ్రీక్ తదితర అనేక భాషల్లోకి అనువదించబడింది. మారం అల్ మస్రి 1998లో అద్నోస్ బహుమతిని, 2007 PREMIO CITTAA DI CALOPEZZATI,  PRIX D’AUTOME తదితర అంతర్జాతీయ పురస్కారాలు అందుకున్నారు. ఆమె సిరియాలోని అసద్ పాలనను తీవ్రంగానూ బహిరంగంగానూ వ్యతిరేకిస్తారు. మంచి మనుషులంతా విప్లవాన్ని సమర్థిస్తారని అంటారామె.

ఆమె రాసిన కవితలు కొన్ని మీకోసం....                   

1)

పాఠశాల క్రీడా మైదానం గోడమీద
తెల్లటి సుద్దముక్కలతో 
చిన్నపిల్లలు తమ ముని వేళ్ళతో
‘స్వేచ్ఛ’ అని రాసారు

 చరిత్ర గోడల మీద  రక్తంతో
‘స్వేచ్ఛ’
వాళ్ళ పేర్లను రాసింది 

             **   **   **

2)

నేను మనిషిని
జంతువును కాను
తన బొంగురు గొంతుతో
అహ్మద్ అబ్దుల్ వాహద్
అన్న పౌరుడు బిగ్గరగా అరిచాడు
జైలు నుంచి తప్పించుకున్న ఖైదీలా
భయ నిశబ్దాల గొలుసుల్ని తెంచుకున్న వాడిగా
అన్ని టెలివిజన్ వార్తల్లోకి ఎక్కాడు
అతని గొంతులో రక్త నాళాలు ఉబ్బిపోయాయి
కళ్ళు కోపంతో మండిపోయాయి
అతను తన జీవితకాలంలో ఎప్పుడూ
బాల్జాక్ ని, విక్తర్ హ్యుగో ని చదవలేదు
అతనికి లెనిన్ మార్క్స్ లు తెలీదు
ఆ క్షణం
ఓ సాధారణ పౌరుడు
అసాధారణుడయ్యాడు

                **     **     **

౩)

నువ్వతన్ని చూసావా
తన బిడ్డని చేతుల్లో మోస్తున్నాడు
తలపైకెత్తి
వెన్నెముక నిటారుగా పెట్టి
తన దారిలో తాను వేగంగా నడుస్తున్నాడు  
ఆ బిడ్డ
ఎంత సంతోషంగా గర్వంగా భావించేదో
తనని చేతుల్లో ఎత్తుకున్న
తండ్రి
సజీవంగావుండి వుంటే


                 **    **     **

4)

నా కొడుకు అందగాడు
నా కొడుకు కథానాయకుడు
కానీ
హీరో లను చూస్తే నియంతకు ఈర్ష్య
నా కొడుకు కథానాయకుడు
నా కంటి వెలుగు
నా ఆత్మ
ఆమె చుట్టూరా నడుస్తుంది
దిగజారిన మనుషులకు
తన చేతుల్లో వున్న కొడుకును చూపిస్తుంది
 నవ్వుతూ ఫోటో ఫ్రేములో వున్న
తన ‘కొడుకు’ని చూపిస్తుంది

                **    **    **

5)

ఆ బిడ్డని
మాతృ గర్భంలోంచి కాదు
భూమి గర్భంలోంచి వెలికి తీసారు
అతను చరిత్ర పూర్వపు విగ్రహం కాదు
అతనొక బాబు
తెల్లటి కవర్లో చుట్టిన బాంబు
తొలిసారి తన తల్లి పాల రుచి చూసే
అవకాశమే రాని వాడు

              **    **     **

6)

తీపి చాక్లెట్లను కవర్లల్లో చుట్టేసినట్టు
సిరియన్ బాలలు శవ పేటికల్లో చుట్టేయబడ్డారు
కానీ వాళ్ళు శర్కరతో తయారు కాలేదు
కలలూ రక్త మాంసాలతో రూపొందించబడ్డారు
 సిరియన్ పిల్లలకోసం
రహదారులు ఎదురుచూస్తాయి
తోటలూ ఎదురు చూస్తాయి  
పాఠశాలలు ఉత్సవ చౌరాస్తాలూ ఎదురుచూస్తాయి
కానీ వాళ్ళు
స్వర్గపు పక్షులై ఆకాశంలో ఆడడానికి
చాలా త్వరపడుతున్నారేమో 

 స్వేచ్చానువాదం: వారాల ఆనంద్

click me!