"జవాబు కావాలి" పుస్తక ఆవిష్కరణ: ఇతర సాహిత్య వార్తలు

By Pratap Reddy Kasula  |  First Published Mar 16, 2022, 2:25 PM IST

సలీమా రాసిన జవాబు కావాలి కవిత్వ పుస్తకం ఈ రోజు విడుదల కానుంది. పాలపిట్ట - వాసా ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో డా. వాసా ప్రభావతి స్మారక కవితల పోటీకి కవితలను ఆహ్వానిస్తున్నారు.


అవసరాలు ఎలా అయితే ఆవిష్కరణలకు ప్రాణం పోస్తాయో ప్రశ్నలు అలాగే బుద్ధి వికాసానికి దోహదం చేస్తాయి. ఆదిమ కాలం నుంచి ఈ అత్యాధునిక యుగం దాకా అభివృద్ధి పయనించడానికి ప్రశ్న చేసిన కృషే కారణం.  సరే... ఇప్పుడు ఈ ప్రశ్నల ఉపోద్ఘాతం ఎందుకంటే సలీమా తన తొలి కవితా సంపుటిని 'జవాబు కావాలి' పేరిట మన ముందుకు తీసుకు వస్తోంది. ఉద్యమ నేపథ్యం ఉన్న సలీమా ప్రముఖ జర్నలిస్ట్, రచయిత్రి, కవయిత్రి.  అంతకుమించి గొప్ప మానవతావాది.  వాస్తవిక వాది కూడా.  నేల విడిచి సాము చేయడం తన తత్వం కాదు. 

ఎప్పుడూ సానుకూల దృక్పథంతో ముందుకు వెళ్ళే సలీమా కవిత్వంలోనూ అదే ప్రతిబింబిస్తుంది. ఎక్కడా నిరాశకు తావు ఉండదు. ఆమె కవిత్వం చదివిన వారికి కచ్చితంగా ఎంతోకొంత మనోధైర్యం లభిస్తుంది. 

Latest Videos

"ప్రశ్న మొదలవగానే
ఎద భారం కాస్త తగ్గి
మనసులోని భావాలకు
అక్షర రూపమిచ్చింది
తన అసలైన పాత్రను
తనే రచించుకుని
మనిషిగా బతకడం
ఇప్పుడిప్పుడే మొదలు పెట్టింది"

ఇవి ఓ కవితలోని పాదాలు.  జవాబు కావాలి సంపుటిని చదువుతున్నంతసేపూ   కవయిత్రి ఏవో ప్రశ్నలకు సమాధానాలు అన్వేషిస్తుందనే అనిపిస్తుంది.  పాఠకుల మదిలోనూ ఆ అన్వేషణకు బీజం పడుతుంది.  అది అలా కొనసాగుతూ వారిలో ఎంతోకొంత మార్పు తీసుకువస్తుందని చెప్పవచ్చు.  సాహితీ రంగంలో కచ్చితంగా మంచి పుస్తకంగా నిలబడే 'జవాబు కావాలి' ని తెలంగాణ సాహితి ఆధ్వర్యంలో ఇవ్వాళ సాయంత్రం (16/03/2022) 5గంటలకు బాగ్ లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం, షోయబ్ హాలులో ఎస్.కె. మస్తాన్ బి  ఆవిష్కరిస్తారు.  నస్రీన్ ఖాన్ అధ్యక్షతన కొనసాగే ఈ సమావేశానికి ముఖ్య అతిథి జూలూరి గౌరీశంకర్, అతిథులు శిలాలోలిత, గుడిపాటి, కె. ఆనందాచారి, అయినంపూడి శ్రీలక్ష్మి, మెర్సీ మార్గరెట్, మానస ఎండ్లూరి, జరీనా బేగం.  ఎం. విప్లవ్ కుమార్ పుస్తక పరిచయం చేస్తారు.


పాలపిట్ట - వాసా ఫౌండేషన్‌ సంయుక్త ఆధ్వర్యంలో
డా. వాసా ప్రభావతి స్మారక కవితల పోటీ

తెలుగు కవిత్వ ప్రపంచం వైవిధ్యమైంది.  కొత్తగా అనేకమంది  కవిత్వ రంగంలోకి వస్తున్నారు. విభిన్న కవితా వస్తువులతో, విలక్షణ  అభివ్యక్తితో కవిత్వం రాస్తున్నారు. కనుకనే కవిత్వంలో నూతనత్వాన్ని, ప్రామాణికమైన రచనల్ని ప్రోత్సహించాలనే సంకల్పంతో సుప్రసిద్ధ సాహితీవేత్త డా. వాసా ప్రభావతి సంస్మరణార్థం కవితల పోటీ నిర్వహించాలని పాలపిట్ట - వాసా ఫౌండేషన్‌ సంకల్పించాయి.  వర్తమాన సమాజంలోని అంశం ఏదైనా కవితా వస్తువుగా స్వీకరించవచ్చు. సమాజంలో మంచిని పెంచడం, స్త్రీ పురుష సమానత్వాన్ని ప్రోది చేయడం, మనుషుల్లో మానవీయ సంస్కారం మేల్కొల్పడం లక్ష్యంగా ఈ కవితల పోటీ ఉంటుంది. కనుక పాఠకుల్లో ఉత్తమభావాలను పెంపొందించే కవితలకు ప్రాధాన్యం లభిస్తుంది.

మొదటి బహుమతి: రూ. 3000
రెండో బహుమతి: రూ. 2000
మూడో బహుమతి: రూ. 1000
ఎనిమిది కవితలకు ప్రత్యేక బహుమతులు
(ఒక్కొక్క కవితకు రూ. 500)
నియ‌మ నిబంధ‌న‌లు
- సమాజాన్ని జాగృతం చేసే అంశాలు కవితా వస్తువులుగా ఉండాలి.
- స్త్రీ పురుష  సమానత్వాన్ని ప్రబోధించే సరికొత్త కంఠస్వరాలకు ప్రాధాన్యం
- వస్తుశిల్పాల మధ్య సమన్వయం ఉండాలి. బలమైన అభివ్యక్తి గల కవితలకే పోటీలో ప్రాముఖ్యం ఉంటుంది.
- కవితల నిడివికి సంబంధించి ఎలాంటి నిబంధనలు లేవు. అయితే దీర్ఘకవితలు పోటీకి పరిశీలింపబడవు. వచన కవితలు ఎన్ని లైన్లయినా ఉండొచ్చు. మీరు చెప్పాలనుకున్న విషయం పరిపూర్ణంగా కవితలో వ్యక్తమయినదో లేదో పరిశీలించుకుని పంపించండి.
- కవితలు తిప్పి పంపడం సాధ్యం కాదు. కనుక ఒక కాపీని మీ వద్ద ఉంచుకోండి. ఎవరయినా ఒకటి లేదా రెండు కవితలు మాత్రమే పోటీకి పంపించాలి.  
-  కవితలు ఈమెయిల్‌ చేయండి లేదా పోస్టు చేయండి. వాట్సాప్‌  చేస్తే పరిశీలించడం కుదరదు.
-  మీ పేరు, చిరునామా విడిగా రాయండి. కవితతోపాటు మీ అడ్రసు ఉండాలి.
- పోటీకి పంపించే కవితలు ఎక్కడా ప్రచురితం, ప్రసారమై ఉండ కూడదు. సోషల్‌మీడియాలో పోస్టు చేసి వుండకూడదు.
- పోటీలో బహుమతులు గెలుచుకున్న కవితలనీ, సాధారణ ప్రచురణ కింద ఎంపికయిన కవితలని పాలపిట్ట పత్రికలో ప్రచురిస్తాం.
-  పోటీకి వచ్చే కవితల ఎంపికలో పాలపిట్ట - వాసా ఫౌండేషన్‌ నియమించే న్యాయనిర్ణేతల బృందానిదే తుది నిర్ణయం. దీనిపై ఎలాంటి  ఉత్తర ప్రత్యుత్తరాలకీ, వాదవివాదాలకీ తావు లేదు.

కవితలు పంపించడానికి చివరి తేదీ: 30 మార్చి 2022

కవితలు పంపించాల్సిన చిరునామా:
ఎడిటర్‌, పాలపిట్ట
ఫ్లాట్‌ నెం: 2, బ్లాక్‌`6, ఎం.ఐ.జి`2, ఏపిహెచ్‌బి
బాగ్‌లింగంపల్లి, హైదరాబాద్‌`500 044
ఫోను: 94900 99327
Email: palapittamag@gmail.com

‘మయూఖ‘ వచన కవితల పోటీ :

మయూఖ  ఆన్ లైన్ ద్వైమాసిక  తెలుగు సాహిత్య పత్రిక ప్రథమ వార్షికోత్సవం  సందర్భంగా  ‘కవితా వేదిక ‘ నిర్వాహకులు, కవి నెల్లుట్ల నవీన్ చంద్ర  గారి( కెనెడా) సోదరులు స్వర్గీయ నెల్లుట్ల ఈశ్వర చంద్ర గారి స్మృత్యర్థం   ‘ కవితా వేదిక ‘ నిర్వాహకులు మరియు మయూఖ పత్రిక సంయుక్తాధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ ‘ వచన కవితల పోటీ‘ కోసం కవితలను ఆహ్వానిస్తున్నాము.
1.కవితలు ఏదైనా ఆధునిక సామాజిక అంశాన్ని ప్రతిబింబించేదై ఉండాలి.
2. అభివ్యక్తి శిల్పం- రచనా శైలి బాగుండాలి
3. అంశం, రచనా విధానం వివాదాస్పదంగా ఉండకూడదు
4.కవిత 30 లైన్ల కు తగ్గరాదు,40 లైన్ల కు మించరాదు
5. కవితలు చేరవలసిన చివరి తేదీ : 31-3-2022
6. ఒకరు ఒక కవితను మాత్రమే , యూనికోడ్ లో టైప్ చేసి పంపాలి
7. ఇదివరకు ప్రచురితమైన కవితలు పంపకూడదు. ఫేస్ బుక్ లోనో, వాట్సాప్ ల్లోనో ప్రచారం కాని కవితనే పోటీకి పంపాలి.
8. హామీపత్రం పైన మాత్రమే కవి పేరు ఉండాలి . పోటీకి పంపిన కవిత శీర్షిక , కవి పేరు, వాట్సాప్ ఫోన్ నెంబర్, ఈ మెయిల్ ఐడి, పూర్తి చిరునామా హామీ పత్రం పైన వ్రాయాలి . కవి ఫోటో కూడా పంపాలి .
9. బహుమతులు :- 
ప్రథమ బహుమతి -3000/--
ద్వితీయ బహుమతి- 2000/--
తృతీయ బహుమతి-1000/--
మూడు ప్రోత్సాహక బహుమతులు, ఒక్కొక్కటి 500/--
వీటితోపాటు 20 కవితలు 'మయూఖ' పత్రికలో సాధారణ ప్రచురణకు ఎన్నిక చేయబడతాయి. 
ఎన్నికైన ఏ కవితనూ ఇతర పత్రికలకు పంపకూడదు . సోషల్ మీడియాలకు పంపకూడదు. మయూఖ పత్రికలో ప్రచురితమైన తర్వాత కవి యిష్టం. 

10. తుది నిర్ణయం న్యాయనిర్ణేతలదే!! 

-- డా॥ కొండపల్లి నీహారిణి
మయూఖ సంపాదకులు

click me!