కవిత్వపు తోటలోని వర్ణ చిత్రాలు ఫైజ్ కవిత్వం

By Pratap Reddy Kasula  |  First Published Mar 21, 2022, 11:21 AM IST

అందుకున్నాను శీర్షికలో భాగంగా ఈ వారం   ఫైజ్ అహ్మద్ ఫైజ్ 'హృదయపు వర్ణాలు' (COLOURS OF MY HEART) అందిస్తున్నారు వారాల ఆనంద్.


ఆ మధ్యనే ఫైజ్ అహ్మద్ ఫైజ్  'హృదయపు వర్ణాలు' అందుకున్నాను. ఆయన కవిత్వం ఒక భావ చైతన్యం. ఒక ప్రేరణ. కవి అయిన వాడికి ఆయన కవిత్వం ఒక ఊరట. ఒక ఆలంబన.  ఫైజ్‌ అహ్మద్‌ ఫైజ్‌ తన కాలపు ప్రజా చైతన్య కవి.  సాహిత్యం పై నోబుల్‌ ప్రైజ్‌ కోసం ఆయన పేరు నాలుగు సార్లు నామినేట్‌ అయింది. ఉర్దూ భాషలో మహాకవి. తనకి సోవియట్‌ యూనియన్‌ 'లెనిన్‌ శాంతి పురస్కారం' 1962లోనే ఇచ్చారు.  'నిషాన్‌-ఎ-ఇంతియాజ్‌ 'ఉన్నత బిరుదును పాకిస్తాన్‌ ప్రభుత్వం 1990లో ఫైజ్ మరణాంతరం ప్రకటించింది. మన దేశంలో ఫైజ్‌ 'జన్మ శతాబ్ది'ని (1911-2011) ఘనంగా జరుపుకున్నాం.

సమాజంలో ఎప్పుడయితే మాట, పాట, గీత రాత ప్రమాదంలో పడతాయో, ఎప్పుడయితే మనిషి గౌరవం ఇరుకునపడుతుందో, ప్రజాస్వామ్యం మరుగున పడుతుందో, ఎప్పుడయితే భిన్న అభిప్రాయాల వ్యక్తీకరణ  సాధ్యంకాదో అప్పుడు సరిగ్గా ఫైజ్ అహ్మద్ ఫైజ్ కవిత్వం అవసరమవుతుంది, అర్థవంతమవుతుంది, మరింత ఔచిత్యాన్ని సంతరించుకుంటుంది. ఉర్దూ సాహిత్య ప్రపంచంలో ఫైజ్ ది విశిష్ట స్థానం. ఆయన చివరంటా విప్లవాత్మక భావాలతో సృజన చేశాడు. ఉర్దూ భాష ప్రత్యేకతను కాపాడుతూనే  తన ఆలోచనలకు కవితా రూపమిచ్చి  అక్షరీకరించారు.

Latest Videos

అలాంటి ఫైజ్ అహ్మద్ ఫైజ్  తన జీవిత కాలంలో 8 కవితా సంపుటాలు ప్రచురించారు. నఖ్స్ ఎ ఫర్యాది, దస్ట్ ఎ సభా, జిందా నామా, దస్త్ ఎ తాహ్ ఏ సంగ్, సర్ ఎ వాది ఏ సీనా, షాన్ ఎ షహర్ ఏ యారాన్, మేరే దిల్ మేరే ముసాఫిర్ , ఘుబార్ ఏ అయ్యాన్. ఫైజ్ కవిత్వం, గజల్స్ పొందిన ప్రాచుర్యం అమితమయింది. ఆయన ఎనిమిది కవితా సంపుటుల్లోంచి ఎంపిక చేసిన కవితలతో వెలువడ్డ సంకలనం " ద కలర్స్ ఆఫ్ మై హార్ట్ ". బారన్ ఫరూకీ అనువదించిన ఈ సంకలనంలో 57 కవితలున్నాయి. వాటికి తోడు ఆ కవితల ఉర్దు లిప్యాంతరీకరణ కూడా జత చేశారు.  ఫైజ్ రాసిన ఉత్తమ కవితల్ని ఈ సంపుటిలో చూడొచ్చు.  ఫైజ్ భారత్ - పాకిస్థానీ ప్రగతిశీల కవిగా, వామపక్షవాద కవిగా విశ్వవ్యాప్త గౌరవం పొందివ కవి. ఆయన 1911 లో అప్పటి బ్రిటిష్ ఇండియాలోని పంజాబ్ లో జన్మించాడు. మంచి స్థితిమంతమయిన కుటుంబంలో పుట్టాడు. కానీ అది సామాజికంగా, రాజకీయంగా అత్యంత సంక్షోభ కాలం. ఆ సంక్షోభం సమాజంలోనే కాదు వ్యక్తులుగా మనుషులందరిలోకి ప్రసరించింది. ఆ పరిస్థితుల్లో పెరిగిన ఫైజ్ ఉన్నత వర్గాలకు చెందిన అందరిలాగా పై చదువులకు విదేశాలకు వెళ్లకుండా లాహోర్ లో ఇంగ్లిష్ సాహిత్యం, తత్వశాస్త్రం, అరబిక్ లతో చదువు పూర్తిచేశాడు. అమృత్సర్ లో కాలేజీ అధ్యాపకుడిగా ఉద్యోగ జీవితాన్ని ఆరంభించాడు. క్రమంగా కమ్యూనిస్టు భావాలతో ప్రభావితుడయిన ఫైజ్ పేదల పక్షాన జరిగే పోరాటాలకు మద్దతుగానూ, కాపిటలిస్టులకు వ్యతిరేకంగానూ తన గలమెత్తడం ఆరంభించారు. ఆయన కవితల నిండా మనిషి అంతరంగ ఆవిష్కరణం కనిపిస్తుంది. మొదట ఫైజ్ కవిత్వం విక్టర్ కెర్నన్ చేసిన అనువాదాలతో అందరినీ ఆకర్షించింది. ఆయన  ప్రపంచ వ్యాప్తంగా ప్రగతిశీల కవిగా ప్రశంశలు అందుకున్నారు.  Indian progressive writers ఉద్యమంలో ముల్క్ రాజ్ ఆనంద్, సజ్జద్ జహీర్, కిషన్ చందర్ లాంటి అనేక మంది సాహితీ మూర్తులతో పాటు ఫైజ్ ప్రధాన భూమికను పోషించాడు.

ఫైజ్ ' నా కవిత్వం లో నేనెప్పుడూ 'మేము' అని రాయడానికే ఇష్టపడతాను' అని ఒక చోట రాసుకున్నాడు.   ఫైజ్ అహ్మద్ ఫైజ్  'హృదయపు వర్ణాలు' సంకలనం కవిగా ఫైజ్ అహ్మద్ ఫైజ్ శాశ్వత విలువని, గొప్ప వారసత్వాన్ని అర్థం చేసుకునేందుకు వీలవుతుంది.

'నాకు తెలుసు, నా జీవితం పట్ల నాకూ భయం వుంది/ కానీ ఏంచేయను/ నేను వెళ్లాలనుకున్న దారులన్నీ/ మరణ శిక్షల నెల మీదుగా వెళ్తున్నాయి' అని అంటాడు ఫైజ్ అహ్మద్ ఫైజ్ ఒక చోట.

ఒక సందర్భంలో ఫైజ్ నాలుగు పాదాల కవితని 30 మంది కవులచేత ఇంగ్లీష్ లోకి అనువాదం చేయించి four corners పబ్లిషర్స్ Last Night పేర పుస్తకం ప్రచురించారు. మూలంలోని నాలుగు పాదాలు ఇవి

“రాత్ యూ దిల్ మే తెరీ ఖొయీ హుయీ యాద్ ఆయీ
జైసే వీరానే మే చుప్కే సే బహార్ ఆజాయే
జైసే సహారన్ మే హౌలెసే చలే బాద్-ఇ-నసీం
జైసే బీమార్ కో బెవజా కరార్ ఆజాయే”

దానికి ౩౦కి పైగా వచ్చినప్పటికీ తెలుగులో స్థూలంగా ఇట్లా చెప్పుకోవచ్చు...

“రాత్రి నీ జ్ఞాపకాలు సవ్వడి చేసాయి,
గాలయినా దూరని నిశ్శబ్ద అవనిలా వసంత వీచికలా,
ఎడారిలో వూహించని పిల్ల గాలిలా,
ఏ మందూ లేకుండానేే ఓ రోగి స్వస్థుడైనట్లుగా..”

 ఇక ఫైజ్ రాసిన 'ముజ్‌ సే పహలీ సి ముహబ్బత్‌... లోని చివరి పంక్తులు ఇట్లా వుంటాయి..

  ''దుమ్ములో చుట్టబడి, రక్తమోడుతున్న దేహాలు
 కష్టాల కొలుముల్లో నుంచి ఉబికి వస్తున్నాయి
 రసి కారుతున్న మానని పుండ్లతో
దృష్టి అటే పోతూంది.. ఏం చేయాలి?
ప్రపంచంలో ప్రేమే కాదు ఇంకా దు:ఖాలున్నాయి
ప్రేమికుల కలయికే కాదు, ఇంకా సంతోషాలున్నాయి
ప్రియా, మునుపటి ప్రేమను నా నుంచి కోరవద్దు''- అని ముగిస్తాడు. గొప్ప కవిత్వ వారసత్వాన్ని అందించి ఫైజ్  తన 73వ యేట తనువు చాలించాడు.

 ఫైజ్ అహ్మద్  ఫైజ్మ మరోరెండు కవితలకు స్వేచ్చానువాదాలు:

దుఃఖానికి మాటలొస్తే  (ఉర్దూ కవిత)

నా దుఖం, నిశ్శబ్ద సంగీతం 
నా ఉనికి, పేరు లేని అణువు
నా దుఃఖానికి మాటలొస్తే 
నా పేరేమిటో నేనెక్కడివాణ్ణో 
నాకు తెలిసేది
నా ఉనికి ఆనవాళ్ళు నాకు తెలిస్తే 
ఈ లోకపు రహస్యం నాకు తెలిసేది
నేనా రహస్యాన్ని గనుక తెలుసుకోగలిగితే
నా మౌనానికి ఓ ఉచ్ఛారణ లభించేది 
నేనీ విశ్వానికి యజమానిని అయ్యేవాణ్ని
నాకీ రెండు లోకాల సంపదా లబించేది
మాట్లాడు మిత్రమా మాట్లాడు
మాట్లాడు
నీ పెదాలు స్వేచ్ఛగ వున్నాయి
మాట్లాడు
నీ నాలుక ఇంకా నీదే
నిటారుగా నిలబడ్డ నీ శరీరమూ నీదే
చూడు
కమ్మరి  దుకాణంలోని కుంపట్లో
నిప్పులు మండుతూనే వున్నాయి
ఇనుము వెలుగుతూనే వుంది
తాళాలు తెరుచుకుంటున్నాయి
సంకెళ్ళు తమ పరిధిని పెంచుకుంటున్నాయి
మాట్లాడు               
నీకున్న స్వల్ప సమయం సరిపోతుంది
గొంతు మూగ పోకముందే
శరీరం మృతి చెందకముందే
మాట్లాడు
ఇప్పటికీ సజీవమయిన సత్యం కోసం
మాట్లాడు మిత్రమా మాట్లాడు
చెపాల్సినదంతా చెప్పేయి 

(స్వేచ్చానువాదం: వారాల ఆనంద్)

click me!