ఎల్లుండి స్వగ్రామంలో కేతు విశ్వనాథరెడ్డి అంత్యక్రియలు

By Arun Kumar P  |  First Published May 22, 2023, 4:31 PM IST

ప్రముఖ కవి, రచయిత కేతు విశ్వనాథరెడ్డి ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. ఆయన అంత్యక్రియలు ఎల్లుండి(బుధవారం) స్వగ్రామంలో జరగనున్నాయి. 


కడప : ప్రముఖ సాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ గ్రహీత   కేతు విశ్వనాథరెడ్డి(88) ఇవాళ తెల్లవారుజామున గుండెపోటుతో మృతిచెందారు. వైఎస్సార్ కడప జిల్లా ఎర్రగుంట్ల  మండలం రంగసాయిపురం గ్రామానికి చెందిన విశ్వనాథరెడ్డి ఒంగోలులోని కూతురు ఇంట్లో వుండగా గుండెపోటు వచ్చింది. చికిత్స నిమిత్తం స్థానికంగా వున్న ఓ ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు.  

విశ్వనాథరెడ్డి అంత్యక్రియలు ఎల్లుండి(బుధవారం) స్వగ్రామం రంగసాయిపురం జరగనున్నాయి. అమెరికాలో వున్న ఆయన కొడుకు వచ్చాక మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించి అంత్యక్రియలు చేపట్టనున్నట్లు సమాచారం. ఇప్పటికే విశ్వనాథరెడ్డి మృతికి తెలుగు రాష్ట్రాలకు చెందిన ప్రముఖులు నివాళులు అర్పించి కుటుంబసభ్యులకు సానుభూతి ప్రకటించారు. 

Latest Videos

Read More  కురువృద్దులు, రాయలసీమ కథకు చిరునామా కేతు విశ్వనాథరెడ్డి ఇక లేరు..

మంగళవారం మధ్యాహ్నానికి విశ్వనాథరెడ్డి మృతదేహాన్ని కడపకు చేర్చనున్నారు. అక్కడ సింగపూర్ టౌన్ షిప్ లోని ఆయన సొంత ఇల్లు 'అపేక్ష'లో అభిమానుల సందర్శనార్థం వుంచనున్నారు. బుధవారం స్వగ్రామం రంగసాయిపురం కు తరలించి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

 భార్య పద్మావతికి గుండెకు సంబంధించిన పరీక్షలు చేయించేందుకు విశ్వనాథరెడ్డి ఒంగోలుకు వెళ్లారు. ఆయన కూతురు తల్లివద్ద హాస్పిటల్లో వుండగా అల్లుడితో కలిసి విశ్వనాథరెడ్డి ఇంటికి వెళ్లారు. తెల్లవారుజామున ఛాతి నొప్పితో బాధపడుతున్న విశ్వనాథరెడ్డిని అల్లుడు సంఘమిత్ర హాస్పిటల్ కు తీసుకువెళ్ళాడు. ఇలా భార్య చికిత్స పొందుతున్న హాస్పిటల్లోనే విశ్వనాథరెడ్డి తుదిశ్వాస విడిచారు. 

తిరుపతి, హైదరాబాద్ తదితర ప్రాంతాల్లో అద్యాపకుడిగా పనిచేయడమే కాదు అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం డైరెక్టర్ గా కూడా విశ్వనాథరెడ్డి పనిచేసారు. ఉద్యోగ విరమణ అనంతరం పుట్టిన గడ్డపై మమకారంతో కడపకు చేరుకుని భార్యతో కలిసి నివాసముండేవాడు. ఈ క్రమంలోనే తాజాగా గుండెపోటుతో ఆయన మృతిచెందారు. 

click me!