కురువృద్దులు, రాయలసీమ కథకు చిరునామా కేతు విశ్వనాథరెడ్డి ఇక లేరు..

By SumaBala BukkaFirst Published May 22, 2023, 8:44 AM IST
Highlights

కురువృద్దులు, రాయలసీమ కథకు చిరునామా కేతు విశ్వనాథరెడ్డి ఇక లేరు. ఈ రోజు ఉదయం తుదిశ్వాస విడిచారు. 

తెలుగు సాహిత్యంలో ఇప్పుడున్నవాళ్ళలో కురువృద్దులు.. రాయలసీమ కథకు చిరునామా కేతు విశ్వనాథరెడ్డి మనకిక లేరు.
వారితో చాలా సన్నిహితమున్న వారికిది ఊహించని షాక్. కేతు విశ్వనాథరెడ్డి రెండ్రోజుల కిందటే ఒంగోలులో కూతురు దగ్గరికి వెళ్లారు. సోమవారం ఈ ఉదయం 5 గంటలకు హార్ట్ స్ట్రోక్ వచ్చింది. వెంటనే హాస్పిటల్ కు తీసుకువెళ్లారు. అక్కడ వైద్యులు వెంటిలేటర్ మీద వుంచారు. డాక్టర్లు యెంత ప్రయత్నించినా ఫలితం లేదు. చివరికి ఆయన తుదిశ్వాస విడిచారు. 

కేతు విశ్వనాథరెడ్డి ప్రసిద్ధ సాహితీవేత్త, విద్యావేత్త. కథా రచయితగా ప్రముఖులు. ఆయన కథలతో వేసిన కథా సంపుటి..  ‘కేతు విశ్వనాథరెడ్డి కథలు’ పుస్తకానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. తెలుగు సాహిత్యంలో కురువృద్ధుడిగా పేరుగాంచిన కేతు విశ్వనాథరెడ్డి ఆంధ్ర ప్రదేశ్ లోని వైఎస్ఆర్ జిల్లా కమలాపురం తాలూకా రంగశాయిపురంలో జూలై 10, 1939న జన్మించారు. 

పాఠశాల స్థాయి నుంచే కేతు విశ్వనాధ రెడ్డికి సాహిత్యం మీద ఆసక్తి ఎక్కువ. ఈ క్రమంలోనే పాఠశాల స్థాయి నుంచి విశ్వవిద్యాలయాల వరకు తాను పనిచేసిన ప్రతిచోట్ల అనేక పాఠ్యపుస్తకాలకు సంపాదకత్వం వహించారు. పాఠ్యప్రణాళికలను కూడా రూపొందించారు. తెలుగు వార్తాపత్రికల అయిన ఈనాడు, ఆంధ్రజ్యోతి, ఆంధ్రభూమి పత్రిక సిబ్బందికి శిక్షణలు కూడా ఇచ్చారు.

కేతు విశ్వనాథరెడ్డి తొలి కథ ‘అనాదివాళ్లు’. ఈ కథ సవ్యసాచిలో 1963 లో ప్రచురించారు. వీటితోపాటు కొడవటి కంటి కుటుంబరావు సాహిత్య సంకలనాలకు సంపాదకత్వం వహించారు. విశాలాంధ్ర తెలుగు కథ సంపాదకమండలికి అధ్యక్షుడిగా కూడా కేతు విశ్వనాథరెడ్డి ఉన్నారు. అభ్యుదయ రచయితల సంఘం (అరసం) అధ్యక్షుడుగా కూడా ఉన్నారు. 

కేతు విశ్వనాథరెడ్డి రాసిన సాహితీ వ్యాసాలు ‘దృష్టి’ అనే పేరుతో పుస్తక రూపంలో వచ్చాయి. ‘ఈ భూమి’ పత్రికకు సంపాదకుడిగా పనిచేశారు.  ఆధునిక తెలుగు కథ రచయితల గురించి.. వారిలో టార్చ్ బెరర్స్ అన దగ్గ ప్రసిద్ధుల గురించి రాసిన మరో పుస్తకం ‘దీపధారులు’ ఆయన రాసిందే.  కేతు విశ్వనాథరెడ్డి కథలు (1998 - 2003), జప్తు, ఇచ్చాగ్ని లాంటి కథా సంపుటాలు తెచ్చారు. 

కేతు విశ్వనాథరెడ్డి రాసిన కథలు వివిధ భాషల్లోకి అనువాదమయ్యాయి.  హిందీ, మలయాళం, బెంగాలీ, కన్నడ, ఇంగ్లీష్, మరాఠీ, రష్యన్ భాషల్లోకి అనువాదమయ్యాయి. రిజర్వేషన్లకు సంబంధించిన క్రీమీ లేయర్ మీద వెలువడిన మొట్టమొదటి నవల ‘వేర్లు’.. కేతు విశ్వనాథరెడ్డి రాసిందే. దీంతోపాటు ‘బోధి’ అని నవల కూడా ఆయన రాశారు. పోలు సత్యనారాయణతో విశ్వనాధ రెడ్డి కలిసి చదువు కథలు అనే కథల సంపుటిని సంకలనం చేశారు.

కేతు విశ్వనాథరెడ్డి సాహిత్య కృషికి గాను అనేక అవార్డులు, పురస్కారాలు ఆయనను వరించాయి. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డుతో పాటు భారతీయ భాషా పరిషత్తు (కలకత్తా), తెలుగు విశ్వవిద్యాలయం హైదరాబాద్ ఇచ్చే పురస్కారాలు ఆయన అందుకున్నారు. వీటితోపాటు రావిశాస్త్రి అవార్డు, రితంబరీ అవార్డు.. ఆంధ్రప్రదేశ్ అభ్యుదయ రచయితల సంఘం, గుంటూరు జిల్లా శాఖ వారిచే అమరజీవి పులుపుల వెంకట శివయ్య సాహితీ పురస్కారం ఆయనను వరించాయి. అధ్యాపకుడిగా కూడా ఆయన  ఉత్తమ అధ్యాపక పురస్కారాన్ని రాష్ట్ర ప్రభుత్వం నుంచి అందుకున్నారు.

click me!