అడవి ఓ గంభీర మాటలాంటి మౌనం స్వచ్ఛ స్వేచ్ఛా జీవన కావ్యం అంటూ డా.టి.రాధాకృష్ణమాచార్యులు రాసిన కవిత ' అడవి సింగిడి ' ఇక్కడ చదవండి :
పెల్లుబికిన చైతన్యం
పచ్చపచ్చని తీగల్ని తాకే ఆకాశం అడవి
ఆకులు రాసిన మౌనం
ఆకుపచ్చ తీగలో అక్షర జీవం
కొమ్మల్ని అల్లుకున్న నీడ
విశాల ప్రవాహ హృదయంలో అడవి
జీవరాశి వేటాడిన ఆకలి
దాహం తీరిన జలాలది
ఇక ఆటంతా
జాలీ దయా మరిచిన వేటలో
అడవి
జీవిని పట్టిన పులి నోరు
గాండ్రించి దులిపే సింహం జూలు
విష సర్పాల సయ్యాటలు
ఇప్పపూల పుప్పొడి పరిమళించే వెన్నెల సోయగం
ఆకాశంలో మెరిసే ఆకుపచ్చ అందాలు
ఊహల ఆకులు ఊగే జలపాతాలు
ఆశల శోభలన్నీ ప్రకృతిలో ఆవిష్కృతం
అడవి ఓ గంభీర మాటలాంటి మౌనం
ఒక దయార్ద్ర నిశ్శబ్ద స్వరం
రవివర్మ గీసిన సింగిడి
నడిచిన కలల కరచాలనం
అది అద్భుత పులకింతల కళ
ఆంక్షల ప్రాకార ఆమని కాదు
స్వచ్ఛ స్వేచ్ఛా జీవన కావ్యం
పులి వేటు పాము కాటు ఎరిగిన వేటలో
రక్షిత జీవ జల జంతు వృక్షజాలం
మానవాళి ఆరోగ్యగవాక్షం