కనికరాన్ని చూడు కర్కశం కసితీరా కాటేసినా అమృతమై కురవాలన్న మహోన్నతత్వం అంటూ డా. తిరునగరి శ్రీనివాస్ రాసిన కవిత ' ఒక యుద్ధం...' ఇక్కడ చదవండి :
మిణుగురును చూడు
చీకటిని తుద ముట్టించాలన్న
ఎడతెగని ధైర్యం
మేఘాన్ని చూడు
విద్యుల్లతగా క్షణమైనా
మెరిసి అస్తిత్వం చాటాలన్న పంతం
కాలాన్ని చూడు
జీవితపు ప్రతి అంకంలో
చెరగని ముద్రగా మిగిలిపోవాలన్న సంకల్పం
హృదయాన్ని చూడు
తాను స్పందించినంత కాలం
ప్రతిస్పందనకు రాబట్టాలన్న తాపత్రయం
కనికరాన్ని చూడు
కర్కశం కసితీరా కాటేసినా
అమృతమై కురవాలన్న మహోన్నతత్వం
మట్టిని చూడు
చినుకు తడిపిన తనువు పరిమళాన్ని
పరివ్యాప్తం చేయాలన్న ధీరత్వం
చెట్టును చూడు
శాఖోపశాఖలుగా విస్తరిస్తూ లోకానికి
విశాలతను నేర్పించాలన్న మమకారం