చొప్పదండి సుధాకర్ కవిత : ఇక్కడంతా నిశ్శబ్దం...!

By narsimha lode  |  First Published Dec 1, 2023, 3:47 PM IST

పాటంటే పూల మీదుగా గాలి గోపురాన్ని ముద్దాడే సాహసం...! అంటూ సిద్దిపేట నుండి చొప్పదండి సుధాకర్ రాసిన కవిత ' ఇక్కడంతా నిశ్శబ్దం...! ' చదవండి  


నాపాట వెన్నెల వింటోంది
చిరు చిరు తెమ్మెరల కచేరీలో సెలయేరు సాగినట్టు
ఆకుల సమ్మతితో పూలకన్యలు నర్తించినట్టు
నా పాట కాంతిని ప్రసవిస్తోంది
అక్షరాలన్నీ కుదురయిన ముగ్గులా కొలువుదీరి
వాకిలి ముఖంపై చిరునవ్వు శోభిల్లినట్టు
పాట ప్రకృతితో పందెం వేసుకొంది
ఇందాకే ఇక్కడెవరో చక్కని స్వరమేదో సవరించుకొన్నట్టు గాలి సాక్ష్యం ఇస్తోంది...
ఎవరో సున్నితంగా తీరిచిదిద్దే ఉంటారు
ఇప్పటికీ వినిపించని వారికి ఇదే మా ఆహ్వానం....
ఒక స్వేచ్ఛ నచ్చక పోవచ్చు
వినే అదృష్టం ఉండాలిగా
 స్వేచ్ఛ బహు వచనం కదా...
అలాగే అనివార్యంగా ధ్వనిస్తూ ఉంటుంది
ఎంతటి మానస సరోవరమయినా 
చిరు చేపల విన్యాసాలు లేకపోతే 
పూలు లేని చెట్టు నర్తించినట్టే
పాట  వీధి మలుపులో దీపం
స్వర పేటిక సంధించిన శరం
పాలపిట్టలు వెళ్లిన దారి...బలహీన గొంతుల ప్లీనరీ 
అలంకారాల తాళింపు
అందమయిన కవాతు
పాట ఒక ప్రారంభం..ముక్తాయింపు కూడా
పాట ఒక పరావర్తనం.. కొంచెం గీర్వాణం
కనిపించే సుగంధం..పూర్వ జన్మ సుకృతం..!
పూల మీదుగా గాలి గోపురాన్ని ముద్దాడే సాహసం...!
 

click me!