తండ హరీష్ గౌడ్ తెలుగు కవిత: ~REVERSE GEAR~

By telugu team  |  First Published Feb 8, 2021, 2:47 PM IST

యెదుటి వాడిని ప్రేమించటంలో అనంతానంత హృదయం నీలో దాగుంది..ఈ ప్రపంచంలో నుండి వెలివేయబడ్డానికి ఇదొక్కటి చాలు అంటున్నాడు తండ హరీష్ గౌడ్ తన కవితలో.. చదవండి.


ఎవ్వరికీ అర్థం కాని వైపుకు గాలి వీస్తుంది.
సర్దుకునే లోపే తోకతో దేహాన్నంతా ఆడించినంతపనవుతుంది.ఇదో reverse gear ముచ్చట.ఎవడో నీ పక్కనుండి నీ కొలతలతో మంచి గోతి తవ్వి సిద్దం చేస్తాడు.నువ్వేమో ఆ గోతులలో పూలమొక్కలు నాటే ముఖం వాడివి.వాడిపోని పువ్వును చూసి ఆనందపడే నీకూ,చెట్టు మొదళ్ళు నరికేవాడికి చాలా తేడా.

యెన్నో సుడిగుండాలు, సునామిలు,
భూకంపాలు మనిషిరూపమెత్తి ఓ ప్రశ్నాపత్రంలా పక్కపక్కనే ఉన్నా..నీ చుట్టూరా లేని సమాధానాన్ని వెతుక్కుంటున్న వాళ్ళ కోసమే బతుకుతున్నవాడవు

Latest Videos

నువ్వు నువ్వులా,నేను నేనులా జీవిస్తూ నటించనంతసేపు ఏమవుతుంది.
జీవితమే అవుతుంది.జీవించటం
అవుతుంది.నిన్ను చూసి నేను,నన్ను చూసి నువ్వు వాత పెట్టుకున్నప్పుడే అసలు కథ మొదలవుతుంది.ఇది straightforward ముచ్చట.నువ్వు నిజంగా జీవిస్తావు.నువ్వు నువ్వుగా ప్రేమిస్తావు.నువ్వు నువ్వుగా
బాధపడతావు కూడా..నిన్ను చూసే నన్ను నేనుగా మార్చుకున్నాను.

యెదుటి వాడిని ప్రేమించటంలో అనంతానంత హృదయం నీలో దాగుంది..ఈ ప్రపంచంలో నుండి వెలివేయబడ్డానికి ఇదొక్కటి చాలు.
నీలాంటి వాడి అవసరమిక లేదనుకుంటా
అంతా అప్పటికప్పుడే..ఇచ్చిపుచ్చుకోవటం..

యెప్పుడు కోపంరాని వాడో,యెప్పుడు బాధపడనివాడో ఉన్నాడని నేను నమ్మను.
నిన్ను చూశాక నాలో..లోలో.. 
కొన్ని ఆలోచనల ఆత్మహత్య.

నిన్ను తప్పకుండా ఓ రోజు గట్టిగా అరుస్తూ పిలుస్తారు..ఆ సమాధిలోంచి రెండు చేతులు పైకెత్తి..వాళ్ళల్లో ధైర్యాన్ని నింపు.

నీకు నేను చెప్పాల్సిన పనిలేదు
ప్రేమించేవాడికెలాగూ క్షమించేగుణమూ ఉంటుంది.ప్రేమ సర్వాంతర్యామి.
కొందరిని చేరాలంటే కొంత సమయం
పడుతుంది.

click me!