ఖమ్మం జిల్లా కథకులు రాసిన కథలను సేకరించి ఖమ్మం జిల్లా కథకుల ప్రతిభను అందరికీ పరిచయం చేసారు ఈ కథల సంకలనం సంపాదకురాలు జ్వలిత. ఇది నిజంగా అభినందనీయమైన విషయం. కథలు సేకరించడం అంటే మామూలు విషయం కాదు .
- యడవల్లి శైలజ ( ప్రేమ్)
" ఖమ్మం జిల్లా " ఆపేరు వింటేనే ఏదో ఉత్తేజం కలుగుతుంది. చుట్టుపక్కల అడవులు ఆ అడవిలో పూసే మోదుగపూలు, తంగేడు పూలు ఆ పూల ఎర్రదనం , చల్లదనం, చక్కదనంతో ఖమ్మం జిల్లా చైతన్యాన్ని నింపుకుని ఉంటుంది.
ఖమ్మం జిల్లాలో నివసించే వారికి కళల పట్ల అభిరుచి కొంచెం ఎక్కువే అని చెప్పుకోవాలి అందుకే సాహిత్యం మీద ఉన్న ఇష్టంతో కవి సమ్మేళనాలు, సాహిత్య సమూహలు నడిపిస్తున్నారు. ఏ సమస్యలపై నైనా
తొందరగా స్పందిస్తారు.
undefined
ఖమ్మం గుమ్మంలో సాహిత్యం అందంగా విరగబూసి ఎల్లప్పుడూ ఏదో కొత్త స్ఫూర్తి నింపుతూనే ఉంటుంది. ఆ చైతన్య స్ఫూర్తితో 1911-2016 వరకు ఖమ్మం జిల్లా కథకులు రాసిన కథలను సేకరించి ఖమ్మం జిల్లా కథకుల ప్రతిభను అందరికీ పరిచయం చేసారు ఈ కథల సంకలనం సంపాదకురాలు జ్వలిత. ఇది నిజంగా అభినందనీయమైన విషయం. కథలు సేకరించడం అంటే మామూలు విషయం కాదు .
అటువంటిది ఏకంగా 104 మంది రచయిత(త్రు)లు రాసిన కథలను శ్రమపడి సేకరించి ప్రచురించడం అనేది అందరూ చెప్పినట్టు బిడ్డకు జన్మనిచ్చేటప్పుడు ఒక తల్లిపడే ప్రసవ వేదనతో సమానం. జ్వలిత కూడా అంతటి కష్టం పడి ఉంటారని అర్థం అవుతుంది ఈ పుస్తకం చూస్తుంటే. ఈ పుస్తకం యొక్క ముఖ చిత్రం ఖమ్మం ఖిల్లా వైభవాన్ని చూపిస్తూ దానిపైన పాలపిట్టతో అందంగా ఉంది .
కథల పేర్లు చూడగానే చదవాలనిపించేలా , ఆకర్షణీయంగా ఉన్నాయి. వాటిలో కొన్ని అడవి కాచిన వెన్నెల, కాగితపు పూలు, పూచిన మోదుగులు, మానవ కంఠ ధ్వని, పతితలు , లచ్చి నవ్వింది, మానవుడు, తామర పూలు, ఆడపిల్లా వర్దిల్లు , కాగితం దేవుళ్ళు , పడమటి నీడ, కాలం మారక పోదా , దీవారే, మైకం తొలగిన వేళ, సామాన్యుడి స్వప్నం, కొన్ని ఎముకలు- కొన్ని నీళ్ళు- మరికొన్ని గింజలు, ఒక నువ్వే నాకు కోటి నేనులు నాకు, చూరు మరచిన పిచుక, మధ్య తరగతి బతుకు చిత్రం , ఊరిడిచిన ఉత్తరం, మన్నత్ , వేటగాడు, బిజిలి.
సమాజంలో జరుగుతున్న వివిధ సంఘటనలపై వారి స్పందనని కథల రూపంలో ఇక్కడ అందించారు. ఆర్థిక, రాజకీయ, సామాజిక, చారిత్రక, సాంస్కృతిక, సాంఘిక అంశాలను పరిగణనలోకి తీసుకుని తమ కథలను అద్భుతంగా మలిచారు. ఇక్కడ ఎవరి కథను తక్కువ కూడా చెయ్యలేం. వీటిలో ఉపయోగించిన భాష వారి ప్రాంతానికి సంబంధించినదేకాక , యాసతో కూడినవి అందంగా, ఆకట్టుకునేలా ఉన్నాయి . అంతేకాకుండా చైతన్యాన్ని అందిస్తూ ముందు తరాలకు ప్రోత్సాహంగా స్పూర్తిదాయకంగా , ప్రేరణాదాయకంగా కూడా ఉన్నాయి.
ఇల్లిందల సరస్వతీదేవి కథ 'కాగితపు పూలు' లో సహజంగానే భర్త ప్రేమ కోరుకునే భార్య, తన సంపాదనకు , తన కీర్తికి వారసుడిని కోరుకునే భర్త. అతని ప్రేమను దక్కించుకోవడం కోసం ఆమె చేసిన పని అదే ఆమెకు శాపం అవుతుందేమోనని అసలు నిజాన్ని బయటకు రాకుండా ఆసుపత్రిలో చేర్పించి , ఆ పాపభీతితో ప్రతిరోజు చస్తూ బతుకుతూ భర్త ప్రేమలో మునిగి తేలాలని ఆశించడం. సామాన్యమైన మహిళ కోరికల కథ. ' పూచిన మోదుగులు ' అన్యాయం చేసిన వారిని ఎదిరిస్తూ సమాజం కోసం కుటుంబానికి దూరంగా ఉంటూ జైలు శిక్ష అనుభవిస్తున్న సమయంలోనే జబ్బుతో ఉండి ఎక్కడో చనిపోయే సారంగపాణి పాత్ర అతను ఇష్టపడే మోదుగులతో అన్వయించి చూపడం, భావుకత రంగరించి రాసిన కథ హృదయాన్ని కదిలిస్తుంది.
' కాగితం దేవుళ్ళు ' భక్తి పరాకాష్టకు చేరి కొన్ని సంవత్సరాల క్యాలెండర్స్ గోడలకి వేలాడదీసి ఇంట్లో దుమ్ము, దూళి పేరుకుని పోయి ఆ ప్రభావం ఆరోగ్యంపై పడడం చాలా సున్నితమైన అంశం అనుకుంటాం కానీ పర్యావరణం దెబ్బతినడమే కాకుండా క్యాన్సర్, శ్వాసకోశ సంబంధిత వ్యాధులు మనకు తెలియకుండానే మనం మన కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతీస్తున్నాం.
సంజన అనుశ్రీ కథ 'చూరు మరచిన పిచుక ' ప్రపంచీకరణ ప్రభావంతో పెరిగిపోతున్న కాలుష్యం, మానవ సంబంధాలు, కనుమరుగైన వ్యవసాయం, పారిశ్రామికీకరణ అన్నింటిని కలగలిపిన కథ.
తరతరాల నుంచి వేట పేరుతో జంతువులను అమానుషంగా చంపి మీసాలు మెలివేసే పెద్దలు, కామందులు ఎందరో ఉన్నారు . తమ సరదాల కోసం మాగజీవులను హింసించే వాళ్ళు. అజ్ఞానంలో బతికే మూర్ఖులు సాదనాల వేంకటస్వామి నాయుడు కథ 'వేటగాడు ' లో కనిపిస్తారు.
రచయిత(త్రు)ల, రచయిత్రుల మొదటి కథలు అంటే పరిణితి చెందకుండా ఉంటాయని కొందరికి సందేహం కలగవచ్చు కానీ ఈ కథలు సమాజానికి చైతన్యాన్ని ఇస్తూ ప్రశ్నిస్తూ, యేళ్ళ తరబడి వెంటాడుతున్న అసమానతలు, అసంతృప్తి, సామాజిక, రాజకీయ, ఆర్థిక, భౌగోళిక పరిస్థితులను కళ్ళకు కట్టినట్లు చూపెడుతున్నాయి. సమాజానికి ప్రయోజనకరమైన, ఉపయోగపడే మంచి భావజాలాన్ని అందించిన రచయిత(త్రు)లకు అభినందనలు.
చివరిగా ఒక్కమాట నేను సైతం ప్రపంచానికి సమిధనొక్కటి ఆహుతి ఇచ్చాను మేము సైతం సాహిత్యం కోసం కథలు ఇచ్చాము అని రచయిత(త్రు)లందరు గర్వంగా తలెత్తి చెప్పుకునేలా చేసిన సంపాదకురాలు జ్వలిత కృషి అభినందనీయం. ఇది అందరూ చదవాల్సిన పుస్తకం అని ఖచ్చితంగా చెప్పగలను. తప్పకుండా చదవగలరు.
ప్రతులకు -
జ్వలిత
అక్షరవనం , ఫ్లాట్ నంబరు. 202,
శేషసాయి పారడైజ్,
విజయనగర్ కాలనీ-2
ఖమ్మం-507002
చరవాణి : 9989198943