ఇరుగు పొరుగు శీర్షిక కింద ప్రముఖ తెలుగు కవి వారాల ఆనంద్ కె. సచ్చిదానందన్ కవితను తెలుగులో అందించారు. ఆ కవితను చదవండి.
చాలాకాలంగా ఈ దారెంబడి
నడుస్తూనే వున్నా
కానీ
నా గదికి చేర లేకపోతున్నా
ఈ దారేమో
భూమధ్య రేఖలా
గుండ్రంగా సాగుతూనే వుంది
నిప్పుల కుంపటి లాంటి ‘సహారా’ను
ఈ పాదాలతో దాటడం కష్టం
గడ్డకట్టిన ఆర్కిటిక్ సముద్రం
ఈతకొట్టడాన్ని అనుమతించదు
నాకు తెలుసు
నా గది ఎక్కడో ఒక చోట వుంది
. . .
ఎప్పుడూ కలవని
ఓ నిజమయిన మిత్రుడు
ఎప్పుడూ రాయని
ఓ నిజమయిన కవిత
ఆ గదిలో నాకోసం ఎదురు చూస్తున్నారు
. . .
ఆ దారెంబడి వెళ్తున్న వాళ్ళని అడిగాను
ఈ దారెటు వెళ్తుందని
పాపం
వాళ్ళకూ తెలియదు
గది తెరవడానికి తమ వద్ద
తాళం చెవులు లేకున్నా
వాళ్ళు కూడా తమ తమ గదులకోసం
వెతుకుతూనే వున్నారు
మూలం: కే.సచ్చిదానందన్
తెలుగు: వారాల ఆనంద్