రాజకీయాలు, పదవులు, అసంతృప్తులు, ప్రజలు నవ్వుకోవడాలు ఎలా ఉన్నాయో డా.పసునూరి రవీందర్ రాసిన కథ " అనగనగా ఒక బానిస కథ " లో చదవండి:
అది క్రీస్తు పూర్వపు కాలం. ఏ సంవత్సరమో సరిగా గుర్తులేదు. ఖచ్చితమైన డేటు కూడా అవసరం లేదు. కానీ, ఆ కాలంలో ఒకరాజున్నాడు, రాజ్యమూ ఉంది. చాలా నెమ్మదస్తుడైన రాజు. అలాగని సోమరితనం, నక్కజిత్తుల తనమూ లేనివాడు. రాజుకు ఏదో ఒక పేరుండాలి కదూ. పేరు లేకుండా రాజెలా ఉంటాడు? మనం ఈ కథ కోసమైన రాజుకు ఒక పేరు పెట్టుకుందాం. రాజు పేరు మన సౌకర్యం కోసం రాజరాజ సురేంద్రుడు అనుకుందాం. ఇంక అంతగా శత్రురాజుల దండయాత్రలేమి లేని కాలం. రాజ్యాలే తక్కువగా ఉన్నాయి కాబట్టి రాజుగారు కంటినిండ నిద్ర పోతూ, కడుపు నిండా తింటున్నాడు.
ప్రజలను సుఖసంతోషాలతో పాలించడానికి సకల జాగ్రత్తలూ తీసుకుంటున్నాడు. అవసరమైతే రాత్రి పూట మారువేషంలో వెళ్లి ప్రజల జీవితాలను చాలా దగ్గరగా చూసి వచ్చి, వారు ఏ సమస్యలతో బాధపడుతున్నారో తెలుసుకొని మరీ పరిష్కరిస్తున్నాడు. ఇక చెప్పేదేముంది రాజుగారి పాలన చూడముచ్చటగా కొనసాగుతున్నది. ఈ విషయాన్ని కాసేపు అట్లా పక్కన పెడుదాం. మరొక రాజు గురించి తెలుసుకుందాం.
ఇది క్రీస్తు శకపు కాలం. ఇరవై ఒకటో శతాబ్దం. 2020. ఇక్కడ కూడా ఒక పాలకుడు ఉన్నాడు. ఇతన్ని రాజు అని కాకుండా ముఖ్యమంత్రి అని పిలుస్తున్నారు. ఈయనకు శత్రురాజుల్లా బలమైన ప్రతిపక్షం లేకున్నా, తన పార్టీలోనే మిత్రుల రూపంలో ఈ సీఎంకు అనేకమంది శత్రువులున్నారు. అందుకే ఈ రాజుగారు సరిగా తినలేకపోతున్నాడు. సరిగా కంటి నిండ నిద్ర కూడా పోలేకపోతున్నాడు.
ఇక నీతి, నిజాయితీ అనేవాటిని తన డిక్షనరీలోనే కాదు, మైండ్ మెమోరీ కార్డులోంచి కూడా తీసేయించుకున్నాడు. ఎవరిని ఎలా వాడాలి. ఎవరిని అడ్డగించాలి. ఎవరిని బుజ్జగించాలో బాగా తెలిసినవాడు. మందీ, మార్బలం, మంత్రివర్గమూ ఉంది. అలాగని సీఎం గారు అధికారాన్ని పంచి ఇవ్వలేదు. పదవులను మాత్రమే పంచి ఇచ్చి, రోజూ తమాషా చూస్తుంటాడు. పవరులేని పదవులతో తన అనుచరులు పడే పాట్లు చూసి లోలోపలే నవ్వుకుంటు ఉంటాడు. అప్పుడప్పుడు బయటికి కూడా నవ్వుతుంటాడు. ఈయనగారి పక్కన ఉన్నవారు కూడా విషయంతో సంబంధం లేకుండా ఈ ఆధునిక సీఎం నవ్వినప్పుడు నవ్వు రాకున్నా నవ్వుతుంటారు. సీఎంకి కోపం వస్తే సీఎంగారి కంటే ముందే ఊగిపోతుంటారు. సీఎం అన్నదే రైటు, సీఎం రాంగన్నది నూటికి నూటా ఒక్క శాతం రాంగు.
........... ............ ..........
రాజరాజ సురేంద్రుడు ఒక రోజు తన సేవకున్ని పిలిచాడు. పరుగు పరుగున పరుగెత్తుకొచ్చాడు సేవకుడు. తనకు అలసటగా ఉందన్నాడు రాజు. ‘‘ఒళ్లు పట్టమంటారా?!’’ ప్రభూ అన్నాడు సేవకుడు. అవునన్నట్టు తలూపాడు రాజావారు. సేవకుడు ఒళ్లు పడుతున్నాడు. రాజావారు కళ్లు మూసుకున్నాడు. కానీ, నిద్రపోలేదు. ‘‘సేవకా మన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు?’’ రాజా వారి కుశలప్రశ్న.సేవకుడు రాజు అడిగిన ప్రశ్నకు ఏం చెప్తే ఏ ఆపద ముంచుకొస్తుందోనని కొద్దిగా వెనకా ముందు ఆలోచించాడు. మరోవైపు రాజావారి ప్రశ్నకు వెంటనే సమాధానం చెప్పక తప్పదని గ్రహించాడు. ‘‘రాజా వారు తమకు తెలియనిదా ప్రభూ...నా బోటివాణ్ణి అడిగితే ఏం చెప్పగలను? నేను కూడా రోజూ పని చేసేది మీ రాజభవనంలోనే కదా?! అందుకే కనుక్కొని చెప్తాను ప్రభూ అన్నాడు.
‘సరే’ అని రాజు తల ఊపి, లేచి తన శయనమందిరంలో నిద్రపోవడానికి వెళ్లిపోయాడు. వెళ్తూ వెళ్తూ తన చేతి బంగారు కడాలు, అప్పటిదాకా మెడలో వేసుకున్న బంగారు గొలుసులు తీసి అక్కడే పెట్టి వెళ్లిపోయాడు. అలా రాజావారు వెళ్లిపోయాక సేవకునిలో దుర్భుద్ధి పుట్టింది. అందులో నుండి ఒక నగను దొంగిలిస్తే రాజావారికి ఏం తెలుస్తుంది అనుకున్నాడు. కానీ, మనసు కీడు శంకించింది. ఒకవేళ దొరికితే అని వెనుకాడాడు. మరి దొరకకపోతే అని సాహసానికి సిద్ధమయ్యాడు. మొత్తానికి చుట్టూ చూసి కళ్లు మూసుకొని చేతికి ఏది దొరికితే అది తీసుకొని బయల్దేరాడు. తన అదృష్టం ఈ పూటకు బాగుండి ఒక బంగారు కడెం దొరికింది అనుకున్నాడు.
.......... ........ .........
ఇప్పుడు ఆధునిక రాజావారైన సీఎం వద్దకు వద్దాం...సీఎం వారు పంచిన పదవుల్లో దక్కించుకున్నవారు సంతోషంగాను, దక్కని వారు తీవ్ర అసంతృప్తితోను ఉన్నారు. పదవులు దక్కిన ఒక ప్రజాప్రతినిధి దగ్గరికి కొంతమంది నియోజకవర్గ ప్రజలు వెళ్లి ఆయనగారి ఇంటిలో కలిశారు.
దళితుడే అయినా ఎక్కడా కూడా అప్పర్‌కాస్ట్‌కు తగ్గకుండా చూసుకుంటున్నాడు. అందరూ గంటలుగంటలు ఎదురుచూసే దాకా తన గది నుండి బయటికే రావడం లేదు. వచ్చినా సరే మన క్రీస్తు పూర్వపు సురేంద్ర ప్రభువు కంటే మరో మెట్టు రాచరికాన్నే చూపిస్తున్నాడు. జనాలకు అర్థమైనాసరే నోరు మెదపడానికి సిద్ధంగా లేరు. వారి పనులు వారికి కావాలంటే ఈ ప్రజాప్రతినిధి దగ్గర వినయంగా ఉండడమే మేలనుకున్నారు. ఇక ప్రజాప్రతినిధి వారి దర్బార్ మామూలుగా లేదు. మంత్రికి తక్కువ, ఎమ్మేల్యేకు ఎక్కువ. తనకు పదవి దక్కిన కాలం కాబట్టి ఆ ప్రశాంతత తాలూకూ ప్రభావం అయ్యవారి ముఖంలో కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది.
ఆ రోజు అదే నియోజకవర్గంలోని సారంగం అనే పెద్దమనిషి మరో పదిమందిని తీసుకొని ఈ ప్రజాప్రతినిధి దగ్గరకి వచ్చాడు. మల్లయ్య వరండాలోపలికి అడుగు పెట్టడమే గగనం అయ్యింది. పార్టీ కార్యకర్తలు, కాంట్రాక్టర్లు, ఉద్యోగులు, పత్రికా జర్నలిస్టులు ఇలా చాలా మందే ఉన్నారు. వారందరినీ తోసుకొని, దాటుకొని సారంగం ఎమ్మెల్యే గది వద్దకు చేరుకోవడానికి చాలానే కష్ట పడాల్సి వచ్చింది.
సారంగం వచ్చిన పని కూడా తన ఊరిలో తనకు దక్కాల్సిన ఉపాధి హామీ పనులు అధికార పార్టీ నేతలే కాజేస్తున్నరని సదరు ప్రజా ప్రతినిధిని నిలదీయడానికి వచ్చాడు. తనకు ఆ పని కాంట్రాక్ట్ దక్కకపోయే సరికి తనతో ఉన్నవాళ్లకే కాదు, తనకు కూడా పని లేకుండా పోతున్నది. ఆ బాధతో ఇప్పటికే సారంగం మండలంలో ఏ మీటింగ్ జరిగినా అధికార పార్టీకి వ్యతిరేకంగానే మాట్లాడుతున్నాడు. ఇవాళ మాత్రం అదే అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధిని కలవడానికి వచ్చాడు. సారంగంను చూసి అందరు గుసగుసగా మాట్లాడుకుంటూనే ఉన్నారు.
ప్రజాప్రతినిధికి కూడా సారంగం నిజాయితీ గురించి తెలుసు. పైగా తన కులానికి చెందినవాడనే గౌరవం ఉంది, కానీ, పార్టీ అధిష్టానాన్ని ఎదురించి ఏమీ చేయలని తనం కూడా ఉంది. అందుకే సారంగం మీద గౌరవం, సారంగం నిక్కచ్చితనం మీద కోపం జాగ్రత్తగా కవర్ చేసే పనిలో ఉన్నాడు సదరు ప్రజా ప్రతినిధి.
‘‘ఏం సారంగం ఎట్లున్నదే మన నియోజకవర్గం’’అని కుశల క్షేమాలు కనుక్కోవడానికి అడిగాడు.
ఆ మాటకు సారంగం కాసేపు సురేంద్ర ప్రభువు సేవకునిలాగే నసిగాడు. కాకుంటే ప్రజాప్రతినిధికి ఎక్కడ కోపం రావొద్దని "మీకు తెలియనిదేమున్నది సార్, మీరు చూస్తున్నదే కదా" అన్నాడు. సారంగం ఇంకేదో చెప్పబోతుంటే అడ్డుపడ్డాడు ప్రజా ప్రతినిధి.
ప్రజాప్రతినిధి ఒక చిరునవ్వు నవ్వి ‘‘ఏమున్నది సారంగం మనం ఎన్నడన్న అనుకున్నమా? ప్రజలు ఇంత సంతోషంగా ఉంటరు అని. మొన్న నేను శనిగపురం ఊరికి పోతే మన ముఖ్యమంత్రిగారికి పాలాభిషేకాలు చేసిన్రు. పనిలో పనిగా నా ఫోటోలకు కూడా పాలు పోస్తుంటే భలే సంతోషమేసింది. చాలా సంబురమైంది. కొట్లాడిన కొట్లాటకు మంచి ఫలితమే దక్కిందనిపించింది’’ అని తనలో తానే మురిసిపోతూ సారంగంతో అన్నడు.
"అది సరేగని మా పొట్టగొట్టుడు మంచిదేనా లీడర్ సాబ్ అన్నడు".
ఆ మాటకు ప్రజాప్రతినిధికి ఒకింత కోపం వచ్చింది.అయినా సరే ఆపుకొని, దాచుకొని ‘‘యే పోనీయ్ సారంగం, నువ్ పురాగ ప్రతిపక్ష పార్టోల్ల లెక్క మాట్లాడుతవెందుకు’’ అంటూ స్వరం పెంచి వారించాడు.
అయినా సారంగం ఒకనికి లొంగే మనిషి కాదు.‘‘అట్లా కాదు మరి మీ పార్టోల్లే కమీషన్‌లకు ఎగబడి మాలాంటి వెనుకబడ్డ జనాలకు అన్యాయం చేస్తుంటే, మాట్లాడొద్దా మేము’’ అన్నడు సారంగం.
లీడర్‌కు షాక్ కొట్టినట్టయ్యింది. ఇక చర్చించుడు అనవసరం అనుకున్నాడు. పైగా పొద్దుపొద్దుగాల్నే ఎవనితోనన్న గొడవ పెట్టుకుంటే ఆ రోజంతా అట్లనే ఉంటదనే సెంటిమెంటు కూడా ఉంది.
‘‘అట్లా కాదు సారంగం మనం బంగారు రాజ్యంలోకి వెళ్లే సమయం ఇది. నువ్వు అనవసరంగా ఒకర్ని నిందించుడు బంద్ జెయ్. ఎవని పాపాన వాళ్లే పోతరు’’ అన్నడు.
సారంగంకు లీడర్ మాటలోని అంతరార్థం తెలుసు. అయినా ఇది సందర్భం కాదు. ఇప్పుడు చెప్పినా అర్థం కాదు. తమ ఊరి సమస్యగాని, తన సమస్యగాని ఈ ప్రజాప్రతినిధికి చెవికి ఎక్కదని గమ్మునున్నాడు సారంగం.
...... ....... ..........
ఎప్పటిలాగే రాజరాజ సురేంద్రుడు తన మంత్రులతో చర్చలు జరిపి, తన నివాస మందిరానికి విచ్చేశాడు. తన విశ్రాంత స్థలంలో కూర్చోని మళ్లీ సేవకున్ని పిలిచి సేవలు చేయించుకుంటున్నాడు. మళ్లీ సేవకున్ని పాత ప్రశ్నే అడిగాడు.
‘‘సేవకా మన రాజ్యంలో ప్రజలు ఎలా ఉన్నారు?’’
సేవకుడి ముఖంలో చిరునవ్వులు వచ్చి చేరాయి.
‘‘రాజా మీ పాలన గురించి చెప్పేది ఏముంది. ప్రజలంతా మునుపటి కంటే సుఖశాంతులతో వర్థిల్లుతున్నారు’’ అన్నాడు.
రాజుకు కొంత సంతోషం కలిగింది. మళ్లీ రెండు మూడు రోజులకు అదే ప్రశ్న అడిగాడు. సేవకుడు మళ్లీ అదే సంతోషముఖంతో మరింత గొప్పగా రాజును గురించి, రాజ్యం గురించి చెప్పుకొచ్చాడు. ఇలా పలుమార్లు జరిగిన తరువాత రాజుకు ఒకసారి అనుమానమొచ్చింది.
అసలు ఈ సేవకుడు చెప్పేది నిజమా అబద్దమా ఎలా తెలుసుకోవడం అనుకున్నాడు. ప్రజల క్షేమం రాజుకు తెలియనిది కాదు. కాకుంటే ఈ సేవకుడు చెప్పే అంత సంతోషంలో ఏమీ లేరు. కాలం కాకపోవడం వల్ల వారి కష్టాలు వారు పడుతున్నారు. సేవకుని మాటల వెనుక ఏదో కారణముందని గ్రహించాడు రాజు. సేవకుడు ఎప్పుడూ తన వెంట తెచ్చుకునే సంచి వైపు చూసి, అందులో ఏదో ఉందని గ్రహించి, సేవకున్ని కొన్ని నీళ్లు తెమ్మని పంపించాడు. సేవకుడు రాజాజ్ఞను శిరసావహించి పరుగున వెళ్లాడు. ఈ లోపు రాజు అతడి సంచిలో చేయిపెట్టి పోయిందనుకున్న తన బంగారు కడెంను బయటికి తీసి చూశాడు. సరే సేవకునికి తగిన గుణపాఠం చెప్పాలని దాన్ని అతడు వచ్చేలోపు తీసి దాచిపెట్టాడు.
సేవకుడు ఆ రోజుకు తన విధులు ముగించుకొని సంచితో పాటు ఇంటికి వెళ్లాడు. రాజు దగ్గర దొంగిలించిన బంగారు కడెం ఇంట్లో పెడితే ఎవరైనా దొంగిలిస్తారేమోనని ఇన్నాళ్లు ఎటు వెళ్లినా పట్టుకు తిరిగాడు. ఇవాళ అది కనిపించలేకపోయేసరికి లబోదిబోమన్నాడు. కష్టపడి సంపాదించినవాడికంటే మరింత ఎక్కువ విలపించాడు...
....... ............ ........
ఈ సారి రాజావారికి అత్యంత ఉత్సాహంగా ఉంది. సేవకుడు రాజ్యం గురించి ఏం చెప్తాడో చూడాలనుకున్నాడు. అలసట లేకున్నా సరే వెళ్లి విశ్రాంత కుర్చీలో కూర్చొని సేవకున్ని పిలిపించుకున్నాడు. సేవకునిలో నిన్నటి హుషారు, ఆనందమూ కనిపించడం లేదు. యిల్లు కాలిపోయినట్టు, ఆస్తులన్నీ పోయి దివాళ తీసినట్టు, చేతి దాకా వచ్చి అందినట్టే అంది జారిపోయినట్టు విచారం ఉంది సేవకుని ముఖంలో. రాజుకు ఆ నిరుత్సాహం వెనుక కారణం అర్థమయ్యింది. బంగారు కడెం కనిపించకుండా పోయినందుకు సేవకుడు రాత్రి నిద్ర కూడా సరిగాపోయినట్టు లేడు. బంగారు కడెం తాలూకు బెంగ సేవకుని విషాదముఖంలో కనిపిస్తున్నది. ఇప్పుడు రాజావారు బహు ఆసక్తితో అడిగాడు.
‘‘ఏమైంది ఏదో దిగులుగా ఉన్నట్టు ఉన్నావు’’అన్నాడు.
ఆ మాటకు సేవకుడు అప్రమత్తమయ్యాడు. ఏమీ లేదన్నట్టు నటించాడు. అసలు విషయం బయటపడితే తన దొంగతనమూ బయటపడుతుందని ఖంగారు పడ్డాడు. "అదేమీ లేదు ప్రభూ" అంటూ దిగాలుగా రాజుగారి ఒళ్లు పట్టడం ప్రారంభించాడు.
రాజు లోలోపల నవ్వుకుంటున్నాడు. అసలు ప్రశ్న ఇప్పుడు అడగాలనుకున్నాడు. ఒకసారి కళ్లు తెరచి సేవకుని వాలకం వైపు చూశాడు.
ప్రపంచం మొత్తం మునిగిపోయి తానొక్కడే బతికున్నట్టు ఏడుపొక్కటే తక్కువున్నది సేవకునికి. అది చూసి రాజుకు మరింత నవ్వొచ్చింది. అయినా సరే తన్నుకొస్తున్న నవ్వును అలాగే ఆపుకొని అడగాలనుకున్న రెగ్యులర్ ప్రశ్న అడిగాడు. కాకుంటే మరింత నాటకీయంగా ఉంది ఇప్పుడు ప్రశ్న.
‘‘ఓ నా ప్రియమైన సేవకా రాజ్యం ఎలా ఉందిరా ఇప్పుడూ?’’
రాజుగారి ప్రశ్నకు సేవకుడు ఒక్క నిముషం కూడా ఆలస్యం చేయకుండా...‘‘ఎలా ఉంటుంది ప్రభూ, వరుస కరువులొస్తే ఎలా ఉంటుందో, అతివృష్టి వచ్చి మొత్తం కొట్టుకుపోతే ఎలా ఉంటుందో సరిగ్గా అలాగే ఉంది ప్రభూ ప్రజల పరిస్థితి. చెప్పలేని కష్టాలంటే నమ్మండి. కన్నీళ్లు, కడగండ్లు చూడలేకపోతున్నాను ప్రభూ’’ అని తానే కన్నీళ్లు పెట్టినంత పని చేశాడు.
ఈ ఓవర్ యాక్టింగ్ చూసి రాజు నవ్వుకున్నాడు. బంగారు కడెం ఉన్నప్పుడు ప్రశాంతంగా కనిపించిన రాజ్యం ఇప్పుడు కరువొచ్చినట్టు కనిపిస్తుందా అనుకుని నవ్వుకున్నాడు.
..... ............ ........ ........
సురేంద్ర ప్రభువుగారి కొలువులోని సేవకునికి కష్టాలొచ్చినట్టే మన నియోజకవర్గంలో పదవి దక్కిన ప్రజా ప్రతినిధికి కూడా కష్టాలొచ్చాయి. పదవి ఇచ్చినట్టే ఇచ్చి ఆరునెలలకే ముఖ్యమంత్రిగారు ఓ రాత్రి పూట మనసు మార్చుకున్నారు. తెల్లారేలోగా ఆ పదవి మరొకరికి ఇస్తున్నట్టు ప్రకటించాడు. దీంతో చేసేదేమీ లేక సదరు ప్రజాప్రతినిధి కూడా సేవకుని వలే లబోదిబోమని విలపించాడు. నెత్తి మీద తెల్ల కండువా వేసుకొని ప్రజలెవ్వరూ రాకముందే తన ఆఫీసులో ఖాళీ కుర్చీలతో కూర్చున్నాడు.
నిన్నటి వరకు గుంపులుగుంపులుగా, తండోప తండాలుగా వచ్చి, తన ఇంటినే మినీ అసెంబ్లీలా మార్చిన జనం ఇవాళ ఇటువైపు కన్నెత్తి కూడా చూడడానికి మొహమాట పడ్డారు. దీంతో సదరు ప్రజా ప్రతినిధి పనిమనుషులు, గన్‌మెన్‌లు తప్ప ఎవ్వరూ లేక యిల్లు వెలవెలబోయింది. ఇలాంటి కష్టకాలంలో సారంగం మళ్లీ వచ్చాడు. కారణం సారంగంకు ఈయనగారి పదవి పోయిన విషయం తెలియదు. సారంగం ప్రజాప్రతినిధి ఆఫీసులో అడుగుపెట్టాడో లేదో, ప్రజా ప్రతినిధి బాడీ లాంగ్వేజ్ పూర్తిగా మారిపోయింది. ఎవ్వరున్నా లేకున్నా తనకోసం సారంగం ఉన్నాడనుకున్నాడు. కానీ, సారంగం తనపనికోసమే వచ్చాడని ఈ ప్రజాప్రతినిధికి తెలియదు.
‘‘రా సారంగం దా కూసో’’ అని లేచి మరీ కుర్చీ చూపించాడు. ఆయనగారి మర్యాదకు సారంగంకు కలో నిజమో అన్నట్టు ఉంది. నిన్న నిలబెట్టి మాట్లాడి ఫోజులు కొట్టి, ఈగను తీసేసినట్టు పట్టించుకోనోడు ఇవాళ తనను కూర్చోమంటున్నాడు అనుకున్నాడు. ఇంతలోనే మారిపోయాడా అని ముక్కున వేలేసుకున్నాడు సారంగం.
‘‘జనం ఏమంటున్నరు సారంగం ?’’ అన్నాడు ప్రజాప్రతినిధి.
సారంగంకు ఏం పాలుపోలేదు. నిన్న అడిగిన ప్రశ్నే మళ్లీ అడుగుతున్నాడేంది అనుకున్నాడు. సారంగం నెత్తి గోక్కునేలోపే ప్రజాప్రతినిధే నోరువిప్పాడు. కాకుంటే నిన్నటి ఊపు, ఉత్సాహం ఏదీ లేదు. ఒక దివాళ తీసిన కంపెనీ ఓనర్‌లా లోస్వరంతో పలికాడు.
‘‘ఏం చేస్తం సారంగం, ఎవరి చేతిల ఏమున్నది చెప్పు. అంతా ఏలెటోళ్ల చేతిల ఉన్నది. మనం నిమిత్త మాత్రులం’’ అన్నాడు.
"అయ్యా ఏం జరిగింది" అన్నాడు అసలు కథ తెలియని సారంగం.
‘‘ఏముంది సారంగం, నమ్మి నానబోస్తే పుచ్చి బుర్రలయినట్టు ఉంది పరిస్థితి’’ అన్నడు.
మరి నిన్న అంతా ప్రశాంతంగా సంబురంగా ఉందన్నరు కదా సార్?! ప్రజాప్రతినిధికి కోపం వచ్చింది. సర్రున లేచిండు....‘‘అరె మల్ల అట్లనే అంటవ్ సారంగం, చెప్పితి కదా, కష్టం ఒకడిది, సుఖం ఇంకొకడిది. ఇట్లయితదని ఎవరనుకున్నరు చెప్పు’’ అని నిట్టూర్చాడు ప్రజాప్రతినిధి.
సారంగంకు సీన్ మొత్తం అర్థమైంది. ప్రజా ప్రతినిధిని ఆటపట్టించడానికి ఇదే సమయం అనుకున్నాడు.
‘‘మరి కొట్లాడి తెచ్చుకున్నం, అంతా బంగారమే, సంబురంగా ఉందంటిరి కదా సార్’’ అని రెట్టించాడు సారంగం.
ప్రజాప్రతినిధి దగ్గర నిజానికి సమాధానం లేదు. కానీ, పవర్ లేకపోతే గడ్డిపోసకు కూడా లోకువైతం అని గుర్తించాడు. అలా కాకూడదని మేకపోతు గాంభీర్యానికి దిగాడు.
‘‘చెప్పుకుంటే సిగ్గు చేటు సారంగం, అంతమంది ప్రాణత్యాగం చేస్తే ఏం బాగుపడ్డది చెప్పు. మనయేమో త్యాగాలు వాళ్లయి భోగాలు. చీమలు పుట్టలు పెడితే, వాటిల్ల పాములు చేరినట్టు చేరిన్రు. ఒక్కింట్లనే ఇన్ని పదవులు అధికారం ఇచ్చుకున్నడు గానీ, ఎవరికి ఏం ఒరిగింది చెప్పు?’’ అన్నడు.
సారంగంకు మొత్తం కథ అర్థమయ్యింది. ప్రజాప్రతినిధి అసంతృప్తికి కారణమేందో సమజైంది. "మరి మీ పదవి ఎవరికి ఇస్తరట సార్’’ అన్నడు సారంగం.
ఎవరికిస్తరు సారంగం నీకు తెలియంది ఏమున్నది, మా దళితులల్లనే ఇంకో గ్రూపు రెడీగనే ఉండే, వాళ్ల జనాభ ఎంత, వాళ్లకు ఇన్ని పదవులు ఇచ్చుడేందో నాకైతే సమజ్ కాదు. మనోళ్ళేమో మందకు మంద ఉన్నరుగని, ఏది మాట్లడరు? ఏం చెస్తం చెప్పు’’అన్నడు. ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిని వ్యక్తం చేస్తూ...
రాజరాజ సురేంద్ర ప్రభువు కాలమైనా, ఇప్పటి ముఖ్యమంత్రి కాలమైనా పవరనే బంగారు నగ ఉన్నప్పుడు ఉండే మాట, లేనప్పుడు ఎందుకుంటది?!
ఈ రాజ్యంలోని ప్రజలు ఆనాటి నుండి ఒక నీతిని గ్రహించారు. పవర్ ఉన్నప్పుడు ఒకలా, పవర్ లేనప్పుడు ఒకలా మాట్లాడే వారిని చూసినప్పుడాల్లా ‘‘ఇది బంగారు నగ మహిమా?!’’ అనుకుంటున్నారు.