రూపాయి నేత్రాలు రంధ్రాలు పెడుతున్నాయి వొంటి మీద అంటూ ఒబ్బిని రాసిన కవిత "దృశ్యాలు బరువెక్కుతాయి" ఇక్కడ చదవండి :
తుపాకులు
తలుపు గొళ్ళాలుగా మారుతున్నాయి !
తలపాగాలు
కొబ్బరిబొండాళ్ళా తెగిపడుతున్నాయి !
దృశ్యాలు బరువెక్కుతుంటాయి
ధైర్యాన్ని వెతుక్కోమంటాయి!
గరిక వింజామరలతో
ప్రాణాలకి హాయి విసురుకోరు !
ధైర్యం ఊరడానికి
ఓ మట్టి ముద్దని ఒంటికి పట్టించుకోరు !
ప్రతీ చూపులోనూ
ఓ బరువైన దృశ్యం ఆవిష్కారమవుతుంది !
undefined
జూద, యుద్ధాల నేత్రాలు
పహరా గాస్తున్నాయి !
మూడో చేయి వడిసెలతో
రేయింబవళ్ళు నుదిటి గాయాలు నడయాడుతున్నాయి !
ఆదర్శ రహదార్లు రక్తసిక్తమవుతున్నాయి !
మెయిన్ లైన్ లో
పెయ్యలు పరుగెత్తడం లేదు
అంతా లూప్ లైన్ దుర్గంధమే, లూటీ గంధమే !
రూపాయి నేత్రాలు
రంధ్రాలు పెడుతున్నాయి వొంటి మీద !
ఉసురు నిలబెడుతున్న
పచ్చనాకు పసరు వొంటికి పట్టించుకోవడం లేదు !
ధాన్యం గింజలని
దేహాల రోమాలగా అలంకరించడం లేదు !
కొండల కుండల జలాలని
చలివేంద్రపు దాహాలగా నైనా వొంపడము లేదు !
కొరవడిన ప్రాణ దృశ్యాలతో
పిడికిళ్ళ నిండా మట్టి నింపుకొని
మట్టి నేత్రాలు మాట్లాడుతున్నాయి!