ప్రముఖ రచయిన టి. లలిత ప్రసాద్ రాసిన ప్రేమ కథ 'రజని' ఇక్కడ చదవండి.
రజనీ తన చక్కని నల్లని కురులను మరింత ఆకర్షిణీయంగా చేసుకోవాలనుకోదు. కానీ ఇవాళ తన ఆలోచనను మార్చుకుంది. ఎంతో అందంగా మార్చుకోవాలనుకుంది. అంతేకాదు, తను అందగత్తెగా కనిపించాలని గట్టి నిర్ణయం తీసుకుంది. అలానే తయారయింది. అరగంట తర్వాత అద్దంముందు నిలబడి తనని తాను చూసుకుని ఎంతో ఆనం దించింది. చేతులు చాచి చూసుకుంది, కాస్తంత రింగులు తిరిగిన కురులను చూసుకుంది, పెదాలపై మెరుస్తున్న లిప్‌స్టిక్ చూసుకుంది.. ఇపుడు తన ఆనందానికి అంతే లేదు. తాను అత్యంత అందగత్తెల స్థాయిలో ఉన్నానని మురిసి పోవాలి. మరో మరోసారి చూసుకుని శభాష్ అని తనను తానే మెచ్చుకోవాలి. కానీ మనసు తిరస్కరిస్తోంది.
చిత్రమేమంటే ఆమె చుట్టూ ఉన్నవారు, స్నేహితులూ..ముఖ్యంగా అబ్బాయిలు అందరూ నిజానికి ఆమెను ఇలా బొమ్మలా చూడాలనుకోవడం లేదన్నది రజనీకీ తెలుసు. పుట్టినరోజుకి కొనుకున్న లేతనీలం రంగు చీర మరింత అందాన్నిచ్చింది. మరీ భారీగా కనిపించని నెక్లెస్ తన స్నేహితుడిని తప్పకుండా ఆకట్టుకుంటుంది. అన్నట్టు అది అతను కొనిచ్చిందే. అతనూ దాదాపు తనలాంటి వాడే. అతిగా రెడీ అవడం ప్రత్యేకంగా కనిపించేలా ప్రయత్నించడం యిష్టం లేదు. అచ్చం తనలానే ఉండాలని ఆశిస్తాడు. కానీ కొన్ని ప్రత్యేక ఫంక్షన్స్‌కి తప్పదు మరి. చెస్ లో పావులు కదిపినట్టు గాకుండా మెల్లగా నడవడం, ఆచితూచి మాట్లాడటం, తన స్థాయికి తగ్గట్టు హుందాగా పలకరించడం ఇన్ని చేయాలి. బయటివారి కోసం ఇవన్నీ తప్పవు గదా! చూసేవారికి అందరికీ ఆమె అన్ని విధాలా నచ్చింది, ఆకట్టుకుంది, తనకు తాను తప్ప!
అయినప్పటికీ, ఆమెకు చాలా అయిష్టంగా ఉన్నట్టు కనపించడం ఇష్టంలేదు. మగాళ్ల గురించి ఆమెకు తగినంత తెలుసు. కాబట్టీ, ఆమె అయిష్టంగానే, ఊహించని విధంగా మంచి చీర కట్టింది. ఆమెకు ఇష్టమైన లేతనీలం రంగు చీర, మగాళ్లను ఆటపట్టించే మ్యాచింగ్ నెక్లెస్ ఆమెను ఆకర్షణీయంగా మార్చినప్పటి నుంచీ. ఆమె ప్రియుడు తనను ఎప్పటి నుంచో ప్రేమిస్తున్నానని తనతో చెప్పే రోజు ఇదేనని ఆమెకు తెలుసు. ఆమె అది అనుభూతి చెందింది. ఆమె తననే చూస్తు న్న వారంతా తన చక్కటి వొంపుల్ని చూసి ఎలా అసూయపడుతున్నారో, వారి జంట ప్రతిమాటలో ఎలాటి అర్ధాలు తీస్తారో, రవ్వంత ఇబ్బంది పడతారో ఆమె ఊహించింది. ఇద్దరూ తమ ప్రేమలో ఏకాంతంగా ఉన్నారని భావిస్తారు. కానీ వారు మొదట కలుసుకున్న షోలోనే చాలామంది దృష్టిలో పడ్డారు. అందుకే ఆమెను అక్కడ కలవమని కోరాడు.
ఇలాంటి విచిత్ర పరిస్థితిని ఆమె లోలోపల చిరాకుపడుతోంది, తనకీ తెలుస్తోంది. ఎవరికి ఎవరూ సరదాగా మాట్లాడుకోవడం లేదు.. అందరి దృష్టీ తనవేపే, ప్రతీ మాటా వారితో వారు మాట్లాడుకోవడం లేదు..అంతా అన్ని మాటలూ తన గురించినవే కావడమే మరీ ఇబ్బందిపెడుతోంది. తను తాను కాదని అరిచి చెప్పాలనే ఉంది రజనీకి. కానీ సమయం, సందర్భం కట్టిపడేసాయి. బహుశా, తన ప్రత్యేకతను తనకు తెలియజేయడానికే తనను అతను పిలిచాడని భావించింది. నవ్వుకుంది, నవ్వులో ఆనందం లేదు. చుట్టూన్నవారి కోసం నవ్వినట్టు నవ్వింది. కెమెరాల్లో బంధించారెవరో.
ఇది ఊహాతీతం. క్షణం కళ్లు మూసుకుంది, తన లోకంలోకి వెళ్లింది. ఇంతటి గందరగోళంలో అతను తన ప్రేమను ప్రోసోజ్ చేస్తాడనుకోలేదు. చిత్రమేమంటే, తను చాలాకాలం నుంచి ఆశించిన పెళ్లి ప్రస్తావన ఇవాళ, ఇలాటి వేదిక మీద అతను మరోసారి తీసుకురావడమే. కిటికీ లోంచి పిల్లి దూకింది. అమాంతం మెలకువ వచ్చింది. తను ఆఫీస్‌కి వెళ్లే టైమయింది. సెకను ముల్లులా పరుగుదీసింది.
....
అతను కొయ్యబొమ్మలకు మెరుగుపెడుతూ దుకాణంలోనే ఉన్నాడు. బజార్లో జనం బొమ్మల్ని చూసి ఎంతో బావు న్నాయనే అనుకుంటారు. అదే సమయంలో వారి చూపులు కలిశాయేమో. కానీ అతను పనిలో నిమగ్నమయ్యాడు. ఎవరో చూసి నవ్వుతున్నారని పక్కనవాడు బుజం తట్టి మరీ చెప్పాడు. అప్పుడు తీరిగ్గా చూసాడు. మెల్లగా ఆమె దగ్గరికి వెళ్లి పలకరిద్దామని అనుకున్నాడు. కానీ ఏదో భయం, ఆందోళనా అడుగు వేయనీయలేదు. కానీ చాలారోజుల తర్వాత ఎక్కడో కలిసారు. ఒకరి నొకరు అలా చూస్తుండిపోయారు. మాటలు లేవు. వీధి దీపాల వెలుగులో అతను ఓ చక్కని బొమ్మని చూస్తు న్నట్టు చూసాడు. ఆమె మాత్రం కళాకారుడినే కాదు, ప్రేమికుడినీ చూసింది అతనిలో. మరి కొన్నాళ్లకి ఎక్కడో ఎదురయ్యారు, అప్పటికీ ఇద్దరిలో ఎంతో మార్పు వచ్చేసింది.. ‘కాలం ఎంతో మార్పు తెస్తుంది.. నీలో ఎంతో అందాన్నిచ్చింది. కుందనపు బొమ్మలా ఉన్నావు’.. అతనన్నాడు. కాదు, అనగలిగాడు, ఆమె కురులు తాకి.
కానీ నీ పట్ల నా ప్రేమలో ఎలాంటి మార్పు తేలేదు ఆమె అనుకుంది.. అతని తెలిసి నవ్వాడు. నీకోసం ఎంతో వెతికాను అన్నాడతను.. ఆమె చేయి తన చేతిలోకి తీసుకుంటూ. దూరం కావాలని అనుకోలేదు.. అవుతావనీ అనుకోలేదు.
ఇప్పుడు కలిశాం గదా.. అంటూ చేతులు ముద్దాడిరది.. ఇన్ని రోజుల సంగతి వదిలేయమన్నట్టు. అతను జేబులోంచి ఉంగరం తీసి వేలికి తొడిగి నీ అందం ముందు చిన్నదే కాని ఇది నా ప్రేమ గుర్తు.. అన్నాడు.. గతంలో ఆమె కలయిక కంటే ఇప్పటి కలయిక గొప్పగా ఉందని చెబుతూ నవ్వాడు. ఇక నిన్ను విడవాలని లేదు.. దూరం చేసుకోలేను.. నన్ను పెళ్లి చేసుకుంటావా?.. అడిగాడు చక్కగా నవ్వుతూ.
అతన్నించీ ఇదే ఆశించింది. అతని మీదకి దూకినంత పనిచేసింది. టేబుల్ మీది ఫ్లవర్ వాజ్ కిందపడి పగిలింది. ఆమె బలవంతంగా కళ్లు తెరిచింది. మనసులో ఇలాంటి సీన్లు ఎన్నో అనుకుంది. కలల్లో ఎంతో అందంగా కనిపించి కవ్విం చాయి. కానీ ఇవాళ మాత్రం సరిగ్గా అలా జరగదు. రింగ్ తొడగడం, ముద్దుగా బతిమిలాడటం.. అవేమీ ఉండకపోవచ్చు. అతనింకా బొమ్మల దుకాణం దగ్గరే ఉన్నాడు. పిజ్జా ఆర్డర్ ఇచ్చి వెయిట్ చేస్తున్నట్టే నిలబడ్డాడు. కానీ ఆమె ఆశ వదులుకోలేదు. దుకాణం దగ్గరి నుంచే జనాలకు వినపడేలా ఫలానా ఎదురింటి మేడమీద అమ్మాయిని ప్రేమిస్తున్నాను.. పెళ్లాడతానని అరిచి మరీ చెబుతాడేమో! అదే వినాలనుకుంది రజని. ఆ క్షణం తర్వాత నుంచి ఇద్దరూ కలిసే ఉండవచ్చని ఊహించు కుంటోంది. ఆశ ఆమెను కిటికీ దగ్గర నుంచి కదలనీయడం లేదు.
వారి బ్రేక్ అప్ మామూలుగానే జరిగిపోయింది..గొడవలు, ఆరోపణలు, వాదనలతో సహా! అతను తన పనిలో బిజీగా ఉండిపోవడమే, బొమ్మల్ని మరింత అందంగా తయారుచేయడం, అమ్మడంలోనే జీవితాన్ని సమయాన్ని వెచ్చించాడు.. చెప్పినంతగా ప్రేమించలేదన్నదామె. జనం తన కళాత్మక దృష్టిని ఆరాధించాలనుకున్నాడు.. అదే జరిగింది.. అదే ఆత్మ తృప్తి నిచ్చింది.. అదే జీవితం అనుకున్నాడు. ఆమె కూడా అదే గమనించింది. కానీ ఆమెకు మాత్రం అతను దగ్గరున్న సమయం ఎంతో ఆనందాన్నిచ్చింది, లోకాన్ని ఎంతో తెలుసుకోగలిగింది.. తను జెలసీ ఎందుకు ఫీలవ్వాలి? ప్రశ్నలెప్పుడూ వేధిస్తుంటాయి సమా! నిజానికి ఆమె మరింత అతన్ని మరింత తెలుసుకోవాల్సింది. తన దృష్టి కోణంలో అతన్ని మరింతగా చూడాల్సి ఉం దని ఆమే భావిస్తోంది. ఎంతో ప్రేమను వ్యక్తం చేసింది.. చేస్తోంది.. అతను తన మనసులో ఉన్నది దాచకుండా చెప్పాలి మరి.. ఇపుడు అదే జరగాలి.
....
చాలారోజులకు ఊళ్లో సంత జరుగుతోంది. చిన్న చిన్న దుకాణాలవారంతా వ్యాపారం బాగా సాగుతుందని ఎదురుచూస్తున్నారు. రజనీ అలా అన్నీ చూస్తూ వెళుతోంది. అనేక రకాల దుకాణాలు. దుస్తులు, ఆభరణాలు, వంటింటి వస్తువులు, బొమ్మలు, పరదాలు.. ఎన్నో, ఎన్నెన్నో రంగుల్లో ఆకట్టుకుంటున్నాయి. హఠాత్తుగా తనను అతను ఎక్కడి నుంచో గమనిస్తున్నాడన్న ఆలోచన వచ్చి ఆగిపోయింది. అటూ ఇటూ పరిశీలనగా చూసింది. ఆమె దృష్టి అక్కడికి కొంత దూరంలో ఉన్న బొమ్మల దుకాణం వేపు మళ్లింది. అక్కడ నిజంగానే అతను ఉన్నాడు. కానీ తనను చూడటం లేదు. ఎవరో పెద్దామెకు దేన్ని గురించో చెబుతున్నాడు. తనను పలకరించే కంటే తానే అతన్ని పలకరించాలనుకుంది. చేయి ఊపింది. అతను చూడలేదు. పక్కనే ఉన్న పనివాడు చూసి అతని బుజం తట్టి రజనీని చూపించాడు. కొన్ని ఊహకు అందవు. సరిగ్గా ఇలానే తొలిసారి చూడటం జరిగింది. ఇపుడూ అంతే. నవ్వుకుంది, చీర కొంగు అడ్డుపెట్టుకుని. చూస్తాడనుకుంది. అతను చూడలేదు.. కోప్పడాలనుకుందామె.. ఏమీ అనలేకపోయింది. తానే వెళ్లింది.
‘వచ్చినందుకు చాలా థాంక్స్’ అన్నాడు మర్యాదపూర్వకంగా.
‘భలేవాడివి, రాకుంటే ఈ సంత, బొమ్మల కొలువులు మళ్లీ ఇప్పట్లో జరుగుతాయా?’ అన్నదామె. అతని బుజం మీద చేయివేసి ఇంకా ఏదో అనబోయింది. అతను ఆమె చేయిపట్టి దుకాణాలకు కాస్తంత దూరంగా ఉన్న చెట్ల నీడలోకి తీసికెళ్లాడు.
ఇది ఊహించలేదామె. మనం మన గురించి మాట్లాడుకోవాలి అన్నాడు. అతన్ని ముద్దాడిరది. కానీ అతను కనీసం చిర్నవ్వూ నవ్వలేదు, సీరియస్‌గా చూశాడు. క్షణం నివ్వెరపోయింది రజని. ఏం జరిగిందో తెలియలేదు..అతనేమయినా అన్నాడేమో కూడా .. తాను మాత్రం వినలేదేమో!
‘మనం మనతో గడిపే క్షణాలు ఎంతో విలువయినవి కానీ, మన మద్య బంధం ఇంతటితో అయిపోయిందన్నది ఇద్దరం అంగీకరించాలి. కానీ నువ్వు మాత్రం ఏదో విధంగా నీ ప్రేమని తెలియజేస్తున్నావు. మరోలా అనుకోవనుకుంటా’ అన్నాడు.
‘మరోలా ఎలా అర్ధంచేసుకుంటాననుకున్నావ్?’ కాలం క్షణం ఆగింది. ఆమె హృది లయతప్పింది. ఆమె చుట్టూరా చూసింది. ఎవరూ వారిని పట్టించుకోవడం లేదు.. ఎవరి పనిలో వారున్నారు. ఆమె అతని వెంట వెళ్లింది.
‘రజనీ, నన్ను కలవడానికి ప్రయత్నించకు. పొరపాటున కూడా మెసేజ్‌లు పెట్టవద్దు. ఎంతో మిస్ అవుతున్నానని అనొద్దు. కలవాలనుందని కబురుపెట్టకు. అన్నీ వదిలేయ్. వదిలేసుకో. కఠినంగా చెబుతున్నాననుకోకు..ఇద్దరం ఎవరికి వారుగా ఉందాం..ప్లీజ్’ అన్నాడతను దగ్గరికి తీసుకుంటూ.
‘ఇద్దరం ఒకటే అనుకున్నాను..’ గొంతు అంతకంటే పెగల్లేదు. ఇలా జరుగుతుందనుకోలేదు.. ఎవరిదో కథ విన్నా తనకు జరగకూడదనే గతంలో అనుకుంది. కానీ జరిగింది.. అతన్ని ఒక్కసారి.. చివరిసారిగా హత్తుకుంది.
‘ఇలాంటివి నాకు యిష్టం లేదు. నిగ్రహం లేనివాడిని..చుట్టూ ఉన్నవారంతా నీ ఉద్దేశంలో ఎలా ఉండాలో వారికి తెలీదు. నువ్వు అనుకున్నట్టు వారు ఉండరు. నేనూ వారిలో వాడినే. నీకు తగను. అనుకోవడం, వాస్తవం వేరు. ఇతరుల కోసం కొత్తగా జీవితంలో నటించలేము. ఒకరిని ఆకట్టుకోవడానికి వారికి యిష్టమైన పనులేచేస్తూంటే నిన్ను నువ్వు కోల్పో తున్నావు. వద్దు. ఇంక అలా చేయకు. ఐ యామ్ సారీ..’’ అంటూ అతను వెళిపోయాడు, కళ్లు తుడుచుకుంటూ.
రజనీ అలా సగం ఎండా, సగం చెట్టు నీడలో నిలబడి చూస్తుండిపోయింది. అతని వెంటే ఆమె దుఖం పొంగి పొర్లుతోంది. అతను వడి వడిగా నడిచి వెళిపోయాడు.. ఎంతో దూరం.. ఇక కలవనంత దూరం.
....
సంతలో దుకాణం దగ్గర అతను చేసిన తనలాంటి బొమ్మను ఎవరో కదిలించారు.. చక్కగా గుండ్రంగా తిరుగుతోంది.. ఎంత బావుందో అనుకుంటున్నారంతా. దాని పేరూ రజనీయే. అతని పేరు రంజిత్.