పదే పదే తలాడింపజేసి నిన్ను గంగిరెద్దుని చెయ్యగలదు ఈ తోకలేని పిట్ట అంటూ కాలిఫోర్నియా నుండి డా.కె.గీత రాసిన కవిత " పాండమిక్ ప్రపంచపు పిట్ట " ఇక్కడ చదవండి :
ఈ తోకలేని పిట్ట
ప్రపంచమంతా చూపించగలదట
డివైజులే
దీని సర్వావయవాలూ!
తూనీగలా
గాలివాటున తేలగలిగే
మెరుపు మేఘమై
చప్పున మాయంకాగలిగే
తుర్రు బుర్రు పిట్టకి
సంకేతాలే
వాహనాలు
వాహకాలు
ఈ రెక్కల్లేని పిట్ట
ప్రపంచమంతా ఎగరగలదట
వేదికలకు ఎల్లలు చెరిపి
ఖండఖండాంతరాలను
ఒక్కటి చెయ్యగలదట
ఎదురు బొదురుగా కూర్చున్నట్టే
కబుర్లు చెప్పగలదట
ఒకరికొకరిని తన కెమెరా
కన్నులోంచి చూపించగలదట
"జూమ్" అని
కలకల్లాడి
కువకువలాడి
దివారాత్రాల్ని ఒక్కటి చేసి
సాపేక్ష ప్రపంచాన్ని
సృష్టించగలదట
ఈ
మూగ పిట్ట
మాటలాడించగలదు
పాట పాడించగలదు
అద్దంలో చూసుకున్నట్టు
అందంగా కనిపించి
సెల్ఫీగా మారి
నవ్వు ముఖాన్ని చూపించి
నువ్వే గొప్పని
భ్రమింపజెయ్యగలదు
పళ్ళికిలింపజేసి
పదే పదే తలాడింపజేసి
నిన్ను గంగిరెద్దుని చెయ్యగలదు
ఇరవై నాలుగుగంటలూ
మంత్రమేసినట్లు
తనెదురుగా కూర్చోబెట్టి
మాయా తెర మీద
నిన్ను నీకే అందంగా చూపిస్తూ
విసుగెత్తనివ్వదు
ఈ ఆధునిక పిట్ట
లోకం లోని
గొంతులన్నిటిని ఏకం చేసి
ప్రభంజనం సృష్టించగలదు
ప్రలోభం కాగలదు
శక్తివంతమైన ఈ పిట్ట
మనకి శక్తినివ్వగలదు
మన శక్తిని గుంజుకోగలదు
సర్వమూ తనే అయ్యి
ప్రపంచం పాండమిక్ పాలైనపుడు
జీవితాల్ని నడిపించగలదు
ప్రపంచం పాండమిక్ నించి
బయటపడినా
ఇంకా సర్వమూ తనే అని
భ్రమలోనే ముంచగలదు