డా. సిద్దెంకి యాదగిరి కవిత : మూలశంక

By Arun Kumar P  |  First Published Feb 17, 2023, 11:05 AM IST

వాళ్లక్కావల్సింది మనిషికాదు మమతా కాదు మానవతా కాదు  ...లం లాంటి కులం అంటూ డా. సిద్దెంకి యాదగిరి రాసిన కవిత  "  మూలశంక " ఇక్కడ చదవండి : 


వెతికేది దొరికే వరకు 
వెలితి పూడ్చుకునే వరకు 
సాంగత్యం సాగుతుంటది

సంభాషణకు ప్రమాణముంటదా?
నిర్ధారణకు కొలమానమా?
అంచనాకు ప్రతిభా కౌషలమా?
కాదనీ తెలిసాక 
డొంక తిరుగుడు ప్రశ్నల వర్షం మొదలైతది

Latest Videos

undefined

వాస్తవాలకు మానసిక ఆకాశము మెరుస్తూ
మధ్య మధ్యలో ఉరుముల్లేని పిడుగులు పడుతుంటాయి
మనసులు మాడినా కుల పరిశీలన మారది
ఎచ్చు తచ్చులు కొన్ని
ఎగుడు దిగుళ్లు కొన్ని 
వొంకర టింకరల వాదులాటల్లో ఏదీ మారదీ
మనసే ఊసరవెల్లిలా మారుతుంటది

ప్రశ్న 1
‘‘మీ ఆహార్యం అచ్చం మా ....లా ఉంది
అన్నట్టు మీరుా?’’
‘‘అవును
 గూటం రెడ్డీలమే...’’
‘‘వినలేదే?’’ 
‘‘వినరు
మా వైపే గూటం రెడ్లుంటరు’’
ముల్లురిగిన నాలుకలా మరో ప్రశ్న కదులదీ మెదలదీ

ప్రశ్న 2
‘‘అబ్బో! ఏం పాండిత్యం!! ఏం పాండిత్యం!!!
పోత పోసినట్లున్నారే?
మీరూ...?’’
‘‘నిజమే పోసే బ్రాహ్మలమే’’
‘‘ఏంటీ....’’
‘‘బ్రహ్మాండానికి పొద్దస్తమానం సేవచేసేటోల్లమే’’
‘‘అదెక్కడా వినలేదే?’
" ఎక్కడా పఠించట్లేదా? ఎందుకూ??
ఏంటండీ మరీను? ఇంత అపచారం
లోకాన్ని కూడా కాస్త పఠించండి"
ప్రశ్నకు జ్ఞానం తలదించుకుంటది. 

ప్రశ్న 3
‘‘అన్నీ బాగానే కానీ 
మీరంతా మొరటు?’’
‘‘నిజమే!
తడిసి ఎండిన దేహం కదా!
రూపుకు సూపుకు వెగటే 
భవబంధాలని త్యజించిన జీవుడి తపస్సుని సందేహించుటయా?"
భక్తి వైరాగ్యమైతది

ప్రశ్న 4
‘‘మీరు బీసీలా సార్‌’’
‘‘కాదు సార్‌’’

బోధపడక ముఖం రంగు మారుతది 
కారుతున్న మూలశంక సందిగ్ధానికి
ఎంత పత్తి తెచ్చినా సరిపోదు
మనసును శుభ్రం చేయడానికి 
ఏ స్పిరిట్‌ చాలదు

‘‘మరేంటి సార్‌?
ఇక్కడంతా ఉబ్బరంగా ఉంది 
చెప్పి చావండి!
పొట్ట పగిలేలా ఉంది?’’

మౌనమే జవాబవుతున్నవేళ 
అవతలి మనసు కంపరం
మనిషి కులకంప శిథిలం

వాళ్లక్కావల్సింది మనిషికాదు
మమతా కాదు
మానవతా కాదు 
...లం లాంటి కులం

click me!