తెలుగు సాహిత్యం: ప్రముఖ తెలుగు కవి బండారి రాజ్ కుమార్ మనువు తగలపబడుతున్న దృశ్యం అనే కవిత రాశారు. ఆ తెలుగు కవితను ఏషియానెట్ న్యూస్ తెలుగులో మీకు అందిస్తున్నాం.
నాగరికత కండ్లు దెర్శింది
నడక నేర్సుడు యాది మర్శింది
పికిలిపోతున్న ఒక్కో దృశ్యాన్ని వొంపుకుంట
దృష్టికోణాల్ని లెక్కబెడుతున్నం
లెక్కలేశి నెత్తుటి పారకానికింతా..ని
కన్నీళ్లను పోగులేసుకుంట మూటగడుతున్నం
రోజుకింత సాకబోసుడు జూశి
బతుకుల్ల తడి మాగనే వున్నదనుకున్నం
రేపటికి రక్తచరిత్ర ఎట్లుంటదోనని
రాతిరంతా కంటిమీద కునుకుంటలేదు
మనిషి మనిషిగాకుంట పోతానికి
ఎన్కమర్ల ఎవలున్నరని ఆరాదీశినం
నరనరాల్లో కులం మత్తును నింపి జోకొడుతున్న వైనమే అంతటా కనవడ్డది
తుట్టె జోపుదుమా...
తట్టుకునే దమ్ముండాలని ఎరుకైంది
బలగాన్ని పోగుజేశి
పొరుక జమజేశి మంటబెట్టాలనుకున్నం
బూడిదబూసుకుని ఎవడన్నొత్తడని ఎదురుసూత్తానం
తరతరాలుగా మనువు పేరు వింటనే వున్నం
మనువు మనిషి రూపంలో ఎదురుపడుతనే వున్నడు
వీని నాము నరికే మొగోడే లేడా ? అనుకున్నం
ఒక్కొక్క ఇటుకపెల్లను గుంజి అవుతల పడేత్తానం
గోడలైతే పడిపోతలెవ్వు
ఒక్కొక్క పోగును తెంపిపారేత్తానం
పోతలైతే చెక్కుచెదురుతలెవ్వు
మనువు మాటే శాసనంగా బతికే బానిసలకెన్నడు అర్థంగావాలె జెప్పు?
మడిగట్టుకున్నోల్లంతా ముడులిప్పినప్పుడే మాడు పలిగి సత్తడని జాగృతం జేత్తనే వున్నం
ఎప్పటికైనా మనువు నిలువునా తగలబడుతున్న దృశ్యం కోసమే
కండ్లల్ల వొత్తులేసుకుని కూసున్నం
- బండారి రాజ్ కుమార్