తెలుగు సాహిత్యం: శ్రీరామోజు హరగోపాల్ తెలుగులో ప్రముఖ కవి. ఆయన ఏషియా నెట్ న్యూస్ కోసం కవిత రాశారు. సంజీవి అనే ఆ కవితను ఇక్కడ చదవండి.
నదులతోని,మబ్బులతోని,చెట్లతోని
నేర్చుకున్నదే ప్రేమ
వంగి సలాంకొట్టని కొండలదగ్గర,
నంగి,నంగి మాట్లాడని గాలిదగ్గర,
ఎవ్వనికాళ్ళు ముట్టని పంటలదగ్గర
నేర్చుకున్నదే ప్రేమ
ఇంతమట్టిని సాళ్ళుతీసి,విత్తిన గింజలనుంచి,
మంటిపొరలల్లదాగి చిమ్ముకొచ్చే నీళ్ళవూటలనుంచి,
కన్నకడుపుకోసం బతుకంతా ధారవోసే మట్టినుంచి,అమ్మతాన
పంచుకున్నదే ప్రేమ
మొసమరలకున్నా ప్రాణమిచ్చేదే ప్రేమ
మనిషివైనందుకు మనిషికోసం నీలో పొంగే తండ్లాటే ప్రేమ
లోకాన్ని మొత్తం యిప్పటిదాకా సాకుతున్నది ప్రేమే
తనకుతాను రూపమిచ్చుకుని నిన్ను నాకిచ్చింది ప్రేమే
ఎక్కడ ముట్టుకున్నా నువ్వే,నీ ప్రేమే
ములుగుచ్చే సందులేకుంట నిండివుంది నీ ప్రేమే
నువ్వు గాక ఈ మానవలోకానికి అర్థమేముంటది?
పువ్వులు చిమ్మిన కమ్మనివాసనలు,
తేనెగూళ్ళల్ల దాచిన తియ్యని తేనెలు,
చేతులు సాచిన లేతతీగెలకొసలు
అపుడే లోకానికి కండ్లు విప్పిన పసిచూపుకాంతులు
నువ్వే,నువ్వే,నువ్వే
లాలనగా గుండెలకు హత్తుకున్న చేతుల్లో పొత్తిళ్ళబిడ్డే లోకం
ఒంటరి అక్షరాలు కలిస్తే అర్థం నీ ప్రేమే
ఒక్కగూటిలో మనుషులు ఒదిగిపొయ్యే రుతువువయ్యి రా
- శ్రీరామోజు హరగోపాల్