ప్రముఖ తెలుగు కవిత వఝల శివకుమార్ పూనిక పేర ఓ కవిత రాశారు.బరిలోకి దూకి/ పనిగా పరిణతించడానికి/ సంకల్పధారిలా/ పట్టుదలకు పుట్టువడిచ్చే/ సంలగ్న సంభావికలా పూనిక కావాలని అంటున్నాడు శివకుమార్.
ఒక పూనిక కావాలి
నిర్ధారణగా నిలకడైన నిశ్చయంలా
బరిలోకి దూకి
పనిగా పరిణతించడానికి
సంకల్పధారిలా
పట్టుదలకు పుట్టువడిచ్చే
సంలగ్న సంభావికలా..
చినుకుల దారాలతో
నేలకు పచ్చికను కుట్టాలి
కొంతయినా చెమ్మగిల్లి చెట్టు దేహానికి
హరిత కాంతిని తొడగాలి
నీరదాల రాగ మథనంలో
సాధనకు రక్తిమ నద్దాలి
శృతిపీకలా సన్నాయితో
ఊపిరిని సంధానించినట్టు
ఊహకు ఉనికిని నిర్ధారించాలి
ఎలుకను పట్టడానికీ
దాని చీకటి దందా కు చెక్ పెట్టడానికి
పిల్లి మెడలో గంట కట్టడానికి
దాని దొంగాటకం కనిపెట్టడానికీ
కుక్కను తరమడానికి
కరుస్తుందని తెలిశాక కొట్టడానికీ
కుక్క రాజుదయినా తరాజుదైనా
నిర్ణయంగా కొంత నిర్దయగా
కర్ర చేతిలోకి తీసుకోవడానికి
ఒక పూనిక కావాలి
పట్టీ లేని కాలక్షేపం
కదిలే శవంతో సావాసం
నాకేంటని వదిలేసిన సమయాలే
మెడ చుట్టూ బిగుసుకుంటున్నప్పుడు
ఏ దేవుడూ ఉన్న పళంగా
అననుకూలాలు దిద్దడు
కొత్త దృష్టినీ ఇవ్వడు.
గమనించి కడిగేసుకుంటూ
చూపు సారించి సాగిపోవాలి
బతికున్న గుర్తుగా వేగిపోవాలి
ఏదైనా మాట్లాడచ్చు నరం లేని కదలిక కదా మాటగా పెగలడానికి మనసు ప్రమేయం
మనసుగా స్పందించటానికి మట్టి ఆత్మ
ఇప్పుడు మాటను బతికించుకునే మహాయజ్ఞం సాగాలి.
గాలివాటు ఆట లొసుగుల లొంగుబాట
దాటేసిన గీత మాటేసిన నీడ
ఎవడో ప్రశ్నించడు
సమాధానంగా నిలబడాలని ఆశిస్తడు
సంభాషించు ఎదకు దగ్గరగా
కన్నీళ్ళని సమీకరించేటంత బిగ్గరగా
- వఝల శివకుమార్