మేలైన మాను సంతతిని/ మేని పత్ర సుగంధాన్ని/ మీ ఉనికికి ఊతాన్ని/ మీ ఊపిరికి మూలాన్ని అని అంటున్నాడు తెలుగు కవి మండలస్వామి. ఈ కవిత చదవండి...
మేలైన మాను సంతతిని
మేని పత్ర సుగంధాన్ని
మీ ఉనికికి ఊతాన్ని
మీ ఊపిరికి మూలాన్ని
కాలుష్యం భగ భగలు పీల్చే
ఆకు పచ్చ అమ్మను
ఆ జన్మాంతం
నా ఒడిలో శ్వాసిస్తూ
ఎవరెస్టులై ఎదిగే
మనుగడ ముఖ చిత్రాలు మీరు
మీ కేంద్ర నాడీ మండలాల్లో
హరిత చెమ్మను ప్రసరించి
హృదయ అలారాలుగా
ధ్వనింప చేసేదీ నేనే
అయినా , నేనన్నా ?
నా పుట్టెడు బలగమన్నా ?
ఎన్నడూ సిన్న సూపేనాయె !
మీ బహు ముఖ ప్రజ్ఞతో
నా మూలాలను
నాశనం చేస్తున్నారు ?
మీ బతుకు పున్నముల్లో
కారు చీకట్లు
కోరి తెచ్చుకుంటున్నారు ?
నా బతుకు
నన్ను బతకనివ్వండి !
నగరీకరణ పేరుతో
నిలువునా నరికేయకండి !
మీ కోసం ఎవరినైనా
ప్రతిఘటించే ప్రతిజ్ఞను నేను
మీ క్షేమంకై ఎప్పుడైనా
దండెత్తే దండకారణ్యాన్ని
- మండల స్వామి